మాట్లాడే వర్మ.. విచారణలో మాత్రం అలా..!

Sun Feb 18 2018 11:29:45 GMT+0530 (IST)

ఎవరేం చెప్పినా.. దానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడటం వర్మకు వెన్నతో పెట్టిన విద్య. అడ్డదిడ్డంగా మాట్లాడటం.. అదేమంటే ఏదో ఒక లాజిక్కును తెర మీదకు తీసుకురావటం ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదంటారు. అలాంటి వర్మను పోలీసులు పిలిచి.. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది?ఇలాంటి ప్రశ్నలకు గతంలో అయితే ఊహాజనిత సమాధానాలు మాత్రమే చెప్పే పరిస్థితి. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నం. ఎందుకంటే వాస్తవం బయటకు వచ్చేసింది. సోషల్ మీడియాలోనూ.. టీవీ ఛానళ్ల ఇంటర్వ్యూలలోనూ.. మీడియాతో మాట్లాడేటప్పుడు టక్.. టక్ మని సమాధానాలు ఇచ్చే వర్మ పోలీసులు అడిగిన ప్రశ్నల పరంపరకు ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా?

విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. వర్మకు పోలీసులు చుక్కలు చూపించారు. విచారణ మొదట్లో అడిగిన ప్రశ్నలకు వర్మ తన తరహాలో క్యాజువల్ గా సమాధానాలు చెప్పేశారు. అయితే.. తాను అనుకున్నంత ఈజీగా విచారణ ఉండదన్న విషయం వర్మకు చాలా త్వరగా తెలిసిపోయినట్లుగా తెలుస్తోంది.  జీఎస్టీ సినిమాకు దర్శకత్వం వహించలేదన్న ప్రశ్న వర్మ నోటి నుంచి వచ్చినంతనే.. ల్యాప్ టాప్ ఓపెన్ చేసి.. జీఎస్టీ ట్రైలర్ చూపించి.. వర్మ దర్శకత్వం వహించినట్లుగా వేసిన టైటిల్ కార్డుకు సమాధానం ఏమిటని అడిగినంతనే మౌనమే సమాధానమైందట.

అంతేనా.. దర్శకత్వాన్ని స్కైప్ లో చేశానంటూ వర్మ చెప్పిన మాటకు.. న్యూడ్ ఉన్న మాల్కోవాకు ఏదో సూచనలు ఇస్తున్నట్లుగా వర్మ పెట్టుకున్న ట్విట్టర్ ఫోటోల్ని ఓపెన్ చేసి చూపించినప్పుడు మాటల వర్మ మౌనాన్ని ఆశ్రయించక తప్పలేదంటున్నారు.

చాలా ప్రశ్నలకు మౌనంగా ఉన్నారని.. తనకు తెలీదని కొన్నింటికి.. తర్వాత బదులిస్తానని మరికొన్నింటికి సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మూడు గంటల 20 నిమిషాల పాటు సీసీఎస్ లో గడిపిన వర్మకు లంచ్ ఏర్పాటు చేస్తామన్న పోలీసుల ఆఫర్ ను వద్దని చెప్పారు. తన లంచ్ తను ఆరేంజ్ చేసుకుంటానని.. పోలీసులు ఓకే అంటే తింటానని చెప్పటంతో.. అందుకు పోలీసులు ఓకే చెప్పటం.. కంట్రోల్ రూంలో లంచ్ చేసేశారు. విచారణ మొదట్లో కాస్తంత క్యాజువల్ గా బిహేవ్ చేసిన వర్మ.. తర్వాత మాత్రం తత్త్వం బోధపడటంతో వీలైనంత మౌనాన్ని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.

విచారణ నుంచి బయటకు వచ్చిన కొద్ది గంటలకు తాను పోలీస్ లా బాగా యాక్ట్ చేసినట్లుగా ట్వీట్ వెనుక.. తన పనిని కవర్ చేసుకోవటంతో పాటు.. కన్ఫ్యూజ్ చేసేలా  ట్వీట్ చేసినట్లుగా చెప్పక తప్పదు.