Begin typing your search above and press return to search.

సి.కళ్యాణ్.. షాకిచ్చాడుగా

By:  Tupaki Desk   |   23 July 2016 10:40 AM GMT
సి.కళ్యాణ్.. షాకిచ్చాడుగా
X
సి.కళ్యాణ్.. సినిమాలు చేసినా చేయకపోయినా ఈయన పేరు ఇండస్ట్రీలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. సినిమాల నిర్మాణం కంటే వేరే విషయాల్లో ఆయన చాలా యాక్టివ్‌ గా ఉంటారు. టాలీవుడ్ లోనే కాక సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో ఆయనకు పలుకుబడి బాగానే ఉంది. సినీ రాజకీయాల్లో ఆయన బాగా తలపండిపోయారు. అప్పుడప్పుడూ లేని పోని వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలుస్తుంటారు. సినీ రంగానికి సంబంధించి ఏవైనా ఎన్నికలు జరిగినపుడు సి.కళ్యాణ్ చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటారు. ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించి అనేక పదవుల్లో కొనసాగిన ఆయన.. తాజాగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి సంబంధించిన ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేశారు.

అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో కళ్యాణ్.. జెమిని కిరణ్ మీద విజయం సాధించారు. కార్య నిర్వాహక సభ్యులు 45 మంది ఓటింగ్‌ లో పాల్గొన్నారు. కిరణ్ కు 19 ఓట్లు పడగా.. కళ్యాన్ 26 ఓట్లు పడ్డాయి. 7 ఓట్ల ఆధిక్యంతో కళ్యాణ్ గెలుపొందారు. ఐతే ఈ ఎన్నికల్లో కళ్యాణ్ గెలవడం కష్టమని.. జెమిని కిరణ్ కే సభ్యులు పట్టం కట్టబోతున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలోని ప్రముఖులు కిరణ్ వైపే ఉన్నట్లు.. వివాదాస్పద నేపథ్యం ఉన్న కళ్యాణ్ మీద వ్యతిరేకత పెరిగినట్లు చెప్పుకున్నారు. కిరణ్ విజయం పక్కా అన్నారు. కానీ అందరికీ షాకిస్తూ కళ్యాణ్ విజేతగా నిలిచారు. ఇండస్ట్రీపై తనకున్న పట్టును మరోసారి రుజువు చేసుకున్నారు. ఈసారి ఎన్నికలు విజయవాడలో జరగడం విశేషం.