Begin typing your search above and press return to search.

నాని అంటే నిర్మాతలకు అందుకే భరోసా

By:  Tupaki Desk   |   29 Aug 2015 5:59 PM GMT
నాని అంటే నిర్మాతలకు అందుకే భరోసా
X
రవితేజ తర్వాత స్వయంకృషితో ఎదిగిన హీరోగా నాని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అతడు తనంతట తానుగానే హీరో అయ్యాడు. నటుడిగా నిరూపించుకున్నాడు. రేడియో జాకీ నుంచి హీరో అయ్యాడు కాబట్టి వాక్ఛాతుర్యంతోనూ ఆకట్టుకునే కనికట్టు విద్య బాగా తెలుసు. అది నానికి మొదటి నుంచి కలిసొచ్చింది. అవకాశాల్ని అందిపుచ్చుకుని దూసుకుపోవడం ఎలానో నానీని చూసి నేర్చుకోవాలి ఎవరైనా.

అయితే కెరీర్‌ పీక్స్‌ లోకి వెళ్లిపోతోంది అనగానే కెరీర్‌ లో ఓ చిన్న కుదుపు. వరుసగా రెండు మూడు సినిమాలు ఫెయిలై ట్రాక్‌ ఇబ్బందుల్లో పడింది. అయితేనేం 'ఎవడే సుబ్రహ్మణ్యం' హిట్‌ కొట్టడంతో మళ్లీ ట్రాక్‌ లోకి వచ్చేశాడు. నాని టాలీవుడ్‌ లో ఎప్పుడూ మినిమం గ్యారెంటీ హీరోనే. ఇప్పుడు అతడి సినిమాలకు ఢోకానే లేదు. రిలీజ్‌ కి ముందే బిజినెస్‌ అయిపోతోంది.

భలే భలే మగాడివోయ్‌ .. ఇప్పటికే బిజినెస్‌ పూర్తయింది. మూడు ఏరియాల్లో నిర్మాతలే స్వయంగా రిలీజ్‌ చేసుకుంటున్నారు. మిగిలిన ఏరియాల్లో పంపిణీదారులంతా పోటీ పడి మరీ కొనుక్కున్నారు. శాటిలైట్‌ హక్కుల్ని ఓ ప్రముఖ చానెల్‌ కి 3.6కోట్లకు అమ్మేశారు. ఇదంతా నాని వల్లే సాధ్యమైంది. అతడి ప్రతిభను నమ్ముకునే పంపిణీదారులు సినిమాలు కొనడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్‌ సహా పాటలు ఆకట్టుకున్నాయి. నాని ఈసారి మాస్‌ లో మాసివ్‌ హిట్‌ కొడతాడనే అనుకుంటున్నారు. భలే భలే మగాడివోయ్‌ సెప్టెంబర్‌ 4న రిలీజవుతోంది.