రజినీ బయ్యర్లలో భయం మొదలైంది

Sat Jun 16 2018 12:29:06 GMT+0530 (IST)


రజినీకాంత్ మూవీ కాలా నిరుత్సాహపరిచింది. ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు తక్కువగానే ఉన్నాయి కానీ.. రజినీ మ్యాజిక్ పని చేస్తుందని.. వండర్స్ జరిగే ఛాన్స్ ఉందని ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అలాంటివేమీ లేకుండా.. పక్కాగా ఫ్లాప్ అనిపించేసుకుంది కాలా. ఇది సూపర్ స్టార్ తర్వాత సినిమాలపై కూడా గట్టిగానే ప్రభావం చూపుతోంది.ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2.ఓ విషయంలో టెన్షన్స్ ఎక్కువయ్యాయి. 400 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఈ సినిమా కోసం కేటాయించింది లైకా ప్రొడక్షన్స్. దీన్ని రాబట్టుకునేందుకు ఇతర భాషల రైట్స్ ను కూడా భారీగానే విక్రయించారు. తెలుగు వెర్షన్ ను 80 కోట్లు వెచ్చించి సునీల్ నారంగ్ కొనుగోలు చేయగా.. ఇప్పటికే 20 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా చెల్లించారట. అయితే.. 2.ఓ మాత్రం పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇప్పుడు 2019 రిపబ్లిక్ డే అంటున్నారు కానీ.. దానిపై కూడా నమ్మకాలు లేవు. పెట్టుబడిపై భారీగా వడ్డీని నష్టపోతుండగా.. కాలా దెబ్బకి అసలు రిజల్ట్ పై కూడా అనుమానాలు తలెత్తాయి.

ఎంత రజినీకాంత్ సినిమా అయినా  సరే.. ఖర్చులతో కలుపుకుని 85 కోట్లు రాబట్టడం చిన్న విషయమేమీ కాదు. దీంతో తన అడ్వాన్స్ వెనక్కు ఇచ్చేయాలని.. ప్రాజెక్టు బాగా డిలే అవుతోందని లైకా ప్రొడక్షన్స్ పై సునీల్ నారంగ్ ఒత్తిడి చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇతర డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇలాంటి భయాలే ఉండగా.. అసలు మూవీ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందని చెప్పడంపై లైకా దగ్గర కూడా క్లారిటీ లేకపోవడం గమనించాల్సిన విషయం.