బిల్డప్ ఇచ్చిన మెంటల్ కృష్ణ

Sun Sep 23 2018 21:37:40 GMT+0530 (IST)

వైవిధ్యం విలక్షణత అంటే ఏంటో తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించిన నటుడు పోసాని కృష్ణమురళి. ఆయన ఆలోచనలే డిఫరెంట్. ఆయన ముక్కుసూటితనం ఇతరులతో పోలిస్తే సంథింగ్ స్పెషల్. కథలు మాటలు రాయించుకుని డబ్బులు ఎగ్గొట్టిన వాడిని దొంగ వెదవ అని తిట్టే దమ్ము ఆయనకు మాత్రమే ఉంది. అందుకే ఆయన సూటియైన తత్వం నచ్చక చాలామంది పెద్దలు అతడిపై బోలెడన్ని కుట్రలు చేశారని చెప్పుకున్నారు. అయినా అతడు ఆ తత్వాన్ని వీడలేదు. సరికదా.. అదే తత్వాన్ని వెండితెర నటనకు అన్వయించుకుని రచయిత కాస్తా నటుడిగా రాణించేశాడు. కెరీర్ పరంగా ఎన్నో డిఫరెంట్ పాత్రలతో మైమరిపించే నటనతో ఆకట్టుకున్నారు పోసాని కృష్ణమురళి. ముక్కుసూటి తనం వల్లనే అతడిని మెంటల్ కృష్ణ అని జనం ముద్దుగా పిలుచుకునేలా చేసింది. నిజాయితీకి సూటిగా ఉండే తత్వానికి దక్కిన అవార్డు ఇది.అందుకే పోసాని ఇప్పుడు బిల్డప్ కృష్ణగా నటిస్తున్నాడు అనగానే అందరిలో ఒకటే ఆసక్తి. ఈ సినిమా పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో రివీల్ అయ్యాయి. వీటిలో పోసాని లుక్ ఆకట్టుకుంది. తన ఆహార్యానికి తగ్గట్టే పంచెకట్టి మేడలు మిద్దెలు ఎక్కి అక్కడ ఏదో తీవ్రంగా ఆలోచించేస్తున్నాడు. ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలు చేశాను. అప్పట్లో ఐదారు ఫ్యామిలీల మధ్యలో కీ పాత్రలో గొల్లపూడి మారుతీరావుగారు ఎలా నటించేవారో.. ఈ సినిమాలో అలాంటి పాత్రనే చేస్తున్నానని పోసాని తెలిపారు. చాలా కాలం తర్వాత చాలా మంచి పాత్ర వచ్చింది. రెండు కుటుంబాలను ఎలా విడదీయాలి? లేదంటే ఎలా కలపాలి వంటి పాత్రలు మారుతీరావుగారు చేశారు. దర్శకుడు విన్సెంట్ ఇప్పుడు అలాంటి పాత్ర నాకు ఈ సినిమాలో ఇచ్చారని తెలిపారు.

రైటర్గా ఉన్నప్పుడు ఇలాంటివి రాసుకోలేకపోయానని ఎవరికీ ఇలాంటి పాత్ర రాయలేకపోయానని బాధపడ్డారు. ఈ ``సినిమాలో నా పాత్ర చూస్తుంటే గొల్లపూడిగారే కనబడతారని ఆ  పాత్రకి చాలా ప్రాధాన్యత ఉందని అన్నారు. ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు చేశాను. నవ్వించాను. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించాను. కానీ ఇందులో ట్రాజెడీ తరహాలో పెద్దపెద్దగా ఏడ్చే పాత్రలో చేశా. ఒక మగాడు తప్పు చేయడానికి ఈ సొసైటీలో ఎలాంటి వాతావరణం ఉందో.. అలాగే ఓ ఆడది రాంగ్ రూట్లో వెళ్లడానికి ఈ సొసైటీలో ఉన్న కారణాలను చాలా సహజంగా ఇందులో చూపించారు`` అని పోసాని తెలిపారు. మొత్తానికి మరో ఇంట్రెస్టింగ్  క్యారెక్టర్తో పోసాని అలరించనున్నారని అర్థమవుతోంది.