Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం కలెక్షన్లు అంత భయంకరమా?

By:  Tupaki Desk   |   31 May 2016 11:30 AM GMT
బ్రహ్మోత్సవం కలెక్షన్లు అంత భయంకరమా?
X
ఈ మధ్యకాలంలో మరే సినిమాలకు రానంత హైప్ క్రియేట్ అయిన సినిమాలు రెండే రెండు. అందులో ఒకటి సర్దార్ గబ్బర్ సింగ్ అయితే.. రెండోది బ్రహ్మోత్సవం. గబ్బర్ సింగ్ లెక్క తేలిపోయి.. డబ్బాలు రిటర్న్ కావటం తలిసిందే. ఇప్పుడు నడుస్తున్న చర్చ అంతా బ్రహ్మోత్సవం గురించే. ఫస్ట్ లుక్ నుంచి.. దశలు దశలుగా సినిమాకు సంబంధించిన స్టిల్స్ ను.. టీజర్లను ముక్కలు ముక్కలుగా విడుదల చేసి.. బ్రహ్మోత్సవంలో ఏదో ఉందండోయ్.. కచ్ఛితంగా ఆ సినిమాను చూడాలన్న స్టేజ్ కి తీసుకొచ్చేశారు. దీంతో.. వసూళ్ల సునామీ తప్పదన్న అంచనాలు చాలానే వ్యక్తమయ్యాయి.

కానీ.. అందుకు భిన్నంగా జరిగిన సీన్ అంతా ఇప్పుడు తెలిసిందే. బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్ గా తేలిన నేపథ్యంలో.. దాని దెబ్బ ఎంత భారీ అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహేశ్ స్టామినా మీద భారీ అంచనాలతో బ్రహ్మోత్సవం బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమాకు రూ.73 కోట్ల బిజినెస్ జరిగింది.

మొదటి నాలుగు రోజుల కలెక్షన్లతో దాదాపు 70 శాతం వరకూ బిజినెస్ మొత్తం కలెక్షన్ల రూపంలో తిరిగి వస్తాయన్న అంచనాను పలువురు వ్యక్తం చేశారు. అయితే.. మొదటి షో నుంచే బ్రహ్మోత్సవం మీద భారీ నెగిటివ్ టాక్ రావటంతో సీన్ మొత్తంగా మారిపోయింది. మొదటి రోజు రూ.12కోట్ల బిజినెస్ జరిగితే.. రెండో రోజు మరింత తగ్గిపోయినట్లుగా చెబుతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే.. బ్రహ్మోత్సవం బొమ్మతో కళకళలాడాల్సిన థియేటర్లు వెలవెల పోవటంతో వేగంగా రియాక్ట్ అయి.. ఆ స్థానే సుప్రీం.. బిచ్చగాడు మూవీని రిప్లేస్ చేసిన పరిస్థితి.

మహేశ్ కెరీర్ లో బ్రహ్మోత్సవం లాంటి దారుణమైన డిజాస్టర్ లేదన్న మాట వినిపిస్తోంది. సినిమా ఎలా ఉందన్న సంగతిని పక్కన పెట్టి కలెక్షన్ల లెక్కల్లోకి వెళితే.. ఇప్పటివరకూ రూ.35కోట్ల కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఓవర్సీస్ కలెక్షన్లే రూ.7కోట్లుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ అది కూడా లేకుండా పరిస్థితి మరింత దారుణంగా ఉండేదంటున్నారు. రెండో వారంలోకి అడుగుపెట్టిన బ్రహ్మోత్సవం అరొకర థియేటర్లలో మాత్రమే ప్రదర్శితమవుతోంది. అది కూడా.. మరో రెండురోజులు మాత్రమే అని చెప్పక తప్పదు. దీంతో.. బ్రహ్మోత్సవం మిగిల్చిన నష్టం దాదాపు రూ.40కోట్ల కంటే ఎక్కువే ఉంటుందంటున్నారు. మరి.. మహేశ్ ను నమ్ముకొని సినిమాను కొన్న వారికి కలిగిన నష్టంపై ఎలా రియాక్ట్ అవుతారో అన్నది ఇప్పుడందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరి.. మహేశ్ స్పందన ఏమిటో..?