Begin typing your search above and press return to search.

పవన్ మీద మహేష్ గెలిచాడు

By:  Tupaki Desk   |   3 May 2016 6:52 AM GMT
పవన్ మీద మహేష్ గెలిచాడు
X
చిరంజీవి నిష్క్రమణ తర్వాత నెంబర్ వన్ కుర్చీ ఆట..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య రసవత్తరంగా సాగుతోంది. బిజినెస్ విషయంలో.. కలెక్షన్ల విషయంలో ఇద్దరూ ఎప్పటికప్పుడు ఒకరి మీద ఒకరు పైచేయి సాధిస్తూ ముందుకెళ్తున్నారు. ముందు పవన్ ‘అత్తారింటికి దారేది’తో రికార్డుల మోత మోగిస్తే.. తర్వాత మహేష్ ‘శ్రీమంతుడు’తో ఆ రికార్డులన్నీ చెరిపేశాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కలెక్షన్ల పరంగా తొలి రోజు వరకు మాత్రమే రికార్డు నెలకొల్పినప్పటికీ.. బిజినెస్ విషయంలో మాత్రం శ్రీమంతుడు నెలకొల్పిన చాలా రికార్డుల్ని అధిగమించింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో శ్రీమంతుడు పేరిట ఉన్న రూ.15.5 కోట్ల బిజినెస్ మార్కును చాలా పెద్ద మార్జిన్‌ తో అధిగమించాడు పవన్. ఇక్కడ ‘సర్దార్’కు ఏకంగా రూ.20 కోట్ల రేటు పలికింది.

ఐతే మహేష్ ఇప్పుడు ఆ రికార్డును దాటేశాడు. ఇంతకుముందు ‘శ్రీమంతుడు’కు ఎవ్వరూ ఊహించని రేటు పెట్టిన అభిషేక్ పిక్చర్సే.. ‘బ్రహ్మోత్సవం’ సినిమా నైజాం హక్కుల్ని కూడా కళ్లు చెదిరే ధరకు కొనుక్కుంది. ఆ ధర రూ.21 కోట్లని సమాచారం. ఇది ‘బాహుబలి’ రికార్డుకు చాలా దగ్గరి రేటు కావడం విశేషం. ఆ సినిమాకు రూ.24 కోట్లు పెట్టాడు దిల్ రాజు. ‘బ్రహ్మోత్సవం’ లాంటి రెగ్యులర్ మూవీకి అంత రేటు పలకడమంటే మామూలు విషయం కాదు. నెల ముందు వరకు ‘బ్రహ్మెత్సవం’ మీద ఇంత క్రేజ్ లేదు. కానీ విడుదల తేదీ దగ్గర పడేసరికి హైప్ పెరిగిపోయింది. మొత్తంగా బ్రహ్మోత్సవం బిజినెస్ దాదాపు రూ.100 కోట్లకు దగ్గరగా అవుతోందని అంటున్నారు. చాలా ఏరియాల్లో ‘సర్దార్’ రికార్డుల్ని దాటేసినట్లు తెలుస్తోంది.