నిజంగా.. బ్రహ్మీ సినిమా ఆయనకొచ్చినట్టే!

Wed Jan 11 2017 13:47:26 GMT+0530 (IST)

బ్రహ్మానందం `ఖైదీ నంబర్ 150`లో తళుక్కున మెరిశాడు. మునుపటి బ్రహ్మీని గుర్తు చేస్తూ నవ్వించాడు. చిరంజీవి చేతిలో బకరా అయిపోయి ఆయన తీసిన సినిమాకి భయపడుతూ తెరపై కనిపిస్తుంటాడు. నా సినిమా నాకు ఇచ్చేయండని చిరు వెంట పడుతుంటాడు. తీసిన నీ సినిమాని మీ ఇంట్లో రిలీజ్ చేయమంటావా అంటూ చిరు బ్రహ్మీని ఓ ఆట ఆడుకొంటుంటాడు. అయితే సినిమా చివర్లో చిరు తీసిన బ్రహ్మీ  సినిమాని ఆయన చేతికి ఇస్తాడు. అప్పుడు `హమ్మయ్య నా సినిమా నాకొచ్చింది` అని ఓ  డైలాగ్ చెబుతాడు బ్రహ్మానందం. ఆ డైలాగ్ ఆ క్షణంలో  బ్రహ్మీ సొంత కెరీర్ ని గుర్తు చేస్తుంది. నిజంగా ఆయనకి ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ పాత్రలు పడలేదు. దాంతో బ్రహ్మీ పనైపోయిందని మాట్లాడుకొన్నవాళ్లూ ఉన్నారు.

అయితే `ఖైదీ నంబర్ 150` రూపంలో  అలా మాట్లాడుకొనేవాళ్లకి బ్రహ్మీ గట్టి  సమాధానమే ఇచ్చినట్టయింది. సినిమాలో ఆరంభం నుంచి చివరిదాకా పలు సన్నివేశాల్లో కనిపించి నవ్వించే ప్రయత్నం చేస్తాడు. ఆయన హావభావాలు ఆయన చెప్పిన డైలాగులు మునుపటిలాగే బాగా నవ్వించాయి. చివర్లో డైలాగ్ చెప్పినట్టుగానే బ్రహ్మీ చేయాల్సిన సినిమా చేయాల్సిన పాత్ర ఎట్టకేలకి ఆయనకొచ్చిందన్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/