Begin typing your search above and press return to search.

‘సైరా’లో ఆ నటుడు కూడా?

By:  Tupaki Desk   |   19 Nov 2017 4:07 AM GMT
‘సైరా’లో ఆ నటుడు కూడా?
X
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కబోయే ‘సైరా నరసింహారెడ్డి’లో భారీ తారాగణమే ఉండబోతోందని ఇంతకుముందే వెల్లడైంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ తో పాటు కన్నడ స్టార్ సుదీప్.. టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు.. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించబోతున్నట్లు కొన్ని నెలల కిందటే చిత్ర బృందం వెల్లడించింది.

ఈ సినిమాలో మరో టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీకి కూడా కీలక పాత్ర దక్కినట్లు సమాచారం. ఈ సినిమాలో నటించే మిగతా నటీనటులతో పోలిస్తే బ్రహ్మాజీ స్థాయి తక్కువే కానీ.. అతడి పాత్ర మాత్రం సినిమాలో కీలకంగా ఉంటుందట. ఈ పాత్ర గురించి చెప్పగానే బ్రహ్మాజీ మరో ఆలోచన లేకుండా సినిమా చేయడానికి అంగీకరించాడట. ‘సింధూరం’ తర్వాత బ్రహ్మాజీ కెరీర్లో ఇది అతి పెద్ద అవకాశం అని భావిస్తున్నారు.

‘సైరా నరసింహారెడ్డి’ రెగ్యులర్ షూటింగ్ కోసం సన్నాహాలు పూర్తి కావస్తున్నాయి. డిసెంబరు 6న ఈ చిత్ర తొలి షెడ్యూల్ మొదలవుతుందంటున్నారు. ఇటీవలే చిరుపై టెస్ట్ షూట్ చేయగా.. అది బాగా వచ్చినట్లు చెబుతున్నారు. రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. రత్నవేలు ఛాయాగ్రహణం అందించే ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు.