Begin typing your search above and press return to search.

బోయపాటి.. ఫార్మాట్ మారుస్తాడా?

By:  Tupaki Desk   |   20 Jan 2018 7:41 PM GMT
బోయపాటి.. ఫార్మాట్ మారుస్తాడా?
X
బోయపాటి శ్రీను కెరీర్లో మెజారిటీ సినిమాలు విజయవంతమయ్యాయి. ఒక్క ‘దమ్ము’ను మినహాయిస్తే బోయపాటి నుంచి వేస్ట్ అనిపించే సినిమా ఏదీ రాలేదు. చివరగా అతను బెల్లంకొండ శ్రీనివాస్‌ ను హీరోగా పెట్టి తీసిన ‘జయ జానకి నాయక’ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఓవర్ బడ్జెట్ కావడం వల్ల అది హిట్ అనిపించుకోలేదు కానీ.. కంటెంట్ పరంగా చూస్తే మాత్రం అది సక్సెస్ ఫుల్ మూవీ అనే చెప్పాలి. ఐతే బోయపాటితో ఉన్న సమస్య ఏంటంటే.. అతను ఒక ఫార్మాట్ లో సినిమాలు తీసుకుంటూ పోతుంటాడు. ఈ మధ్య ప్రేక్షకుల అభిరుచి మారి కొత్త తరహా సినిమాలకు పట్టం కడుతున్నా బోయపాటి మాత్రం మార్పు చూపించట్లేదు.

వ్యవస్థను పట్టించుకోకుండా క్రూరంగా ప్రవర్తించే విలన్లు.. వాళ్ల వల్ల ఇబ్బంది పడే ఒక ఊరు.. లేదా హీరోయిన్.. రక్షకుడిలా వచ్చి అందరినీ కాపాడి విలన్ని ఢీకొనే శక్తిమంతుడైన హీరో.. ఇలా ఉంటుంది బోయపాటి సినిమాల సెటప్. ‘జయ జానకి నాయక’లో పెద్ద కథ.. మంచి ఎమోషన్లు ఉన్నప్పటికీ జనాలకు ఒక రకమైన మొనాటనీ వచ్చేయడానికి కారణం బోయపాటి ఫార్మాట్ వీడకపోవడమే. మరి రామ్ చరణ్ హీరోగా అతను తీయబోయే సినిమా ఎలా ఉంటుందన్న చర్చ మొదలైందిప్పుడు. రామ్ చరణ్ ఒకప్పుడు ఇలాగే ఒక ఫార్మాట్లో సాగిపోయే సినిమాలే చేశాడు. కానీ అవి మొహం మొత్తేసి ‘బ్రూస్ లీ’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. తర్వాత రూటు మార్చి ‘ధృవ’ లాంటి విభిన్నమైన సినిమా చేశాడు. సుకుమార్ తో చేస్తున్న ‘రంగస్థలం’ కూడా కొత్తగా ఉండేలాగే కనిపిస్తోంది. ఇప్పుడు మళ్లీ మాస్ బాటలో నడుద్దామని బోయపాటితో సినిమాకు రెడీ అయినట్లున్నాడు. మాస్ సినిమా చేయాలనుకోవడంలో తప్పు లేదు కానీ.. మళ్లీ ఒక ఫార్మాట్లో సాగిపోయే సినిమా చేస్తే మాత్రం ఎదురు దెబ్బ తప్పదు. బోయపాటి కూడా మారాల్సిన టైం వచ్చేసింది. మరి ఇద్దరూ కలిసి మాస్ గా ఉంటూనే కొంచెం భిన్నంగా సాగే సినిమా చేస్తారేమో చూడాలి.