పేరులోకి సింహాన్ని ఎక్కించుకున్నాడే

Fri Aug 11 2017 18:50:30 GMT+0530 (IST)

ఒకప్పడు దర్శకులు తెరపై తమ పేరును వేసుకునే స్టయిల్ తోనే ఒక స్టయిల్ స్టేట్మెంట్ ఇవ్వాలని తెగ ఆరాపడేవారు. అలాంటి ఆరాటాల్లో రాజమౌళి ఒక రబ్బర్ స్టాంప్ తరహాలో తన పేరును వేసుకోవడం ఈ తరానికి బాగా గుర్తుండి ఉంటుంది. అయితే అంతకంటే ముందు.. దాసరి నారాయణరావు ఈ ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఆయన తన పేరును మేఘాల్లో నుండి వచ్చినట్లు యానిమేట్ చేయించి మరీ వేసుకునేవారు. రకరకాలుగా దర్శకుడు కెప్టెన్ అని చెప్పి తన పేరును వేసే తీరుతోనే చెప్పేశేవారు.

ఇక ఇప్పటివరకు సాదాసీదాగానే తన పేరును వేసుకున్నబోయపాటి శ్రీను.. ఇప్పుడు తను కూడా ఒక మార్కు క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఆల్రెడీ ప్రతీ సినిమాకూ ముందు.. లైట్ సౌండ్ కెమెరా యాక్షన్ అంటూ మనోడు ఒక ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు 'జయ జానకి నాయక' సినిమాలో మాత్రం.. ఆయన అలా చెబుతూనే.. తన పేరు ఫాంట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. ముఖ్యంగా BOYAPATI అనే అక్షరాల్లోని 'O' ఉంది చూశారూ.. అక్కడ ఒక సింహాన్ని డిజైన్ చేయించాడు. స్ర్కీన్ మీదకు ఈ అక్షరాలు జూమ్ అయిపోయి.. ఆ సింహం 'O' నుండి మనకు సినిమా బొమ్మ ఓపెన్ అవుతుంది.

బహుశా ఈ తరంలో తన పేరును ఇలా ప్రత్యేకంగా చెక్కుకుంది బోయపాటి అనే చెప్పాలి. పైగా మనోడు తీసే పూర్తి స్థాయి మాస్ యాక్షన్ కంటెంట్ కూ.. ఆ సింహానికీ భలే సెట్టయ్యిందిలే. కాని సినిమా రిజల్టు తేడా వచ్చినప్పుడు ఇలాంటివి కామెడీగా అనిపిస్తాయ్!!