Begin typing your search above and press return to search.

బాండ్ 25 .. ఎందుకింత ఆల‌స్యం?

By:  Tupaki Desk   |   17 Feb 2019 1:30 AM GMT
బాండ్ 25 .. ఎందుకింత ఆల‌స్యం?
X
ప్ర‌పంచ‌వ్యాప్తంగా జేమ్స్ బాండ్ 007 సిరీస్ కి వీరాభిమానులు ఉన్నారు. బాండ్ సిరీస్ లో ఓ సినిమా సెట్స్ కెళుతుంది అన‌గానే ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంటుంది. ఎప్పుడెప్పుడు పూర్త‌వుతుంది? ఎప్పుడు రిలీజ్ కి వ‌స్తుంది? ఎంత తొంద‌ర‌గా ఆ సినిమా చూసేయాలా? అన్న క్యూరియాసిటీ ఉంటుంది. కానీ ఎందుక‌నో బాండ్ 25 అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. అస‌లింత‌కీ ఏమా కార‌ణం?

ప్రతిష్ఠాత్మ‌క బాండ్ సిరీస్ లో ఇప్ప‌టికే 24 సినిమాలు రిలీజ‌య్యాయి. వీటిలో మెజారిటీ పార్ట్ ఘ‌న‌విజ‌యాలు అందుకున్నాయి. వ‌రుస‌గా గ‌త రెండు సినిమాల్లో ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు డేనియ‌ల్ క్రెయిగ్ హీరోగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. బాండ్ 23- స్కై ఫాల్‌ - బాండ్ 24- స్పెక్ట‌ర్.. రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్ స్థాయి వ‌సూళ్ల‌ను సాధించాయి. స్కైఫాల్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1.1 బిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టిస్తే - ఆ త‌ర్వాత వ‌చ్చిన స్పెక్ట‌ర్ 880 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసి రికార్డులు నెల‌కొల్పింది. దీంతో బాండ్ సిరీస్ లో అంత‌గా అంద‌గాడు కాక‌పోయినా క్రెయిగ్ క్రేజు అంత‌కంత‌కు పెరిగింది. వ‌రుస‌గా ఇప్ప‌టికి మూడోసారి - ఓవ‌రాల్ గా ఐదోసారి జేమ్స్ బాండ్ గా న‌టించే ఛాన్స్ ని క్రెయిగ్ ద‌క్కించుకున్నాడంటే అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఈ సిరీస్ 25వ సినిమాకి ఆరంభ క‌ష్టాలు ఇబ్బందిక‌రంగా మారాయి. ఇదిగో పులి అంటే అదిగో మేక త‌ర‌హాలో అస‌లు ఈ సినిమా మొద‌లైపోతోంది అంటూ గ‌త రెండేళ్ల నుంచి ప్ర‌చారం సాగుతూనే ఉంది. కానీ ఎప్ప‌టికీ మొద‌లు కాదు. ఇప్ప‌టికే రెండు సార్లు రిలీజ్ తేదీల్ని లాక్ చేసి - తిరిగి పోస్ట్ పోన్ చేసేశారు. ఒక‌సారి ద‌ర్శ‌కుడిని మార్చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫ్రాంఛైజీ 25వ చిత్రానికి స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ ఫేం డానీ బోయ్లే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సిన‌ది. కానీ అనూహ్యంగా అత‌డు త‌ప్పుకోవ‌డంతో క్యారీ జోజి ఫుకునాగ ఆ ప్లేస్ లోకి వ‌చ్చారు.

ఎట్ట‌కేల‌కు బాండ్ 25 యూనిట్ మార్చి 4 నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఒరిజిన‌ల్ గా 8 ఏప్రిల్ 2020 రిలీజ్ తేదీ అంటూ ప్ర‌క‌టించినా, ఇప్పుడు ఆ తేదీని కూడా మార్చారు. 14 ఫిబ్ర‌వ‌రి 2020న‌ రిలీజ్ చేయ‌నున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు క్యారీ జోజి ఇదివ‌ర‌కూ బీస్ట్స్ ఆఫ్ నో నేష‌న్, జానే ఐర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌న రాక‌తో బాండ్ సిరీస్ లో తొలిసారి ఓ అమెరిక‌న్ డైరెక్ట‌ర్ ప‌ని చేస్తున్నార‌న్న సౌండ్ వినిపించ‌డం ఆస‌క్తిక‌రం. ఈ చిత్రాన్ని ఎంజీఎం & ఇయాన్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. నీల్ పుర్విస్, రోబ‌ర్ట్ వేడ్ వంటి టాప్ స్టార్లు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇక బాండ్ సిరీస్ లో ఆరు చిత్రాల‌కు స్క్రిప్టులు అందించిన ర‌చ‌యిత‌లు కో రైట‌ర్స్ గా ప‌ని చేస్తున్నార‌ట‌. `ది వ‌ర‌ల్డ్ ఈజ్ నాట్ ఎన‌ఫ్` పేరుతో 25వ సినిమా పాపుల‌ర‌వుతోంది.