ట్రెండింగ్: ఖాన్ ల వారసులొచ్చారు

Tue Aug 14 2018 07:00:26 GMT+0530 (IST)

బాలీవుడ్ అంటే ఖాన్ ల త్రయం గుర్తుకు రావాల్సిందే. షారూక్ ఖాన్ - సల్మాన్ ఖాన్ - అమీర్ ఖాన్... ఈ ముగ్గురూ ఎదురేలేనివాళ్లుగా పరిశ్రమను ఏల్తున్నారు. మూడు దశాబ్ధాలుగా అసలు వీళ్లకు తిరుగన్నదే లేదు. ప్రపంచదేశాల్లోనే అసాధారణ పాపులారిటీ ఉన్న స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే వీళ్లందరికీ 50 వయసు దాటేస్తున్నా.. ఇప్పటికీ వీళ్ల వారసులు ఎవరూ పరిశ్రమలోకి రాకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. అలాంటప్పుడు వేల కోట్ల సామ్రాజ్యాధీశులైన వీళ్ల ఆస్తుల్ని కాపాడుతూ ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లేదెవరు? ఈ ధర్మ సందేహానికి వేరొక ఆల్టర్ నేట్ సమాధానం వినిపిస్తోంది.కింగ్ ఖాన్ షారూక్ కి ముగ్గురు వారసులు ఉన్నారు. ఆర్యన్ ఖాన్ - సుహానాఖాన్ - అబ్రమ్.. వీళ్లు బాద్ షా లెగసీని ముందుకు తీసుకెళతారనడంలో సందేహం లేదు. అయితే అది కాస్తా ఆలస్యమయ్యేట్టే కనిపిస్తోంది. ముందుగా నటవారసురాలు సుహానా కథానాయికగా బరిలో దిగుతోంది. ఆర్యన్‌ఖాన్ ఇంకా చదువుకోవడంలోనే బిజీ. అందువల్ల అతడి ఎంట్రీ ఇప్పట్లో ఉండదు. ఇకపోతే అమీర్ ఖాన్  లెగసీని ముందుకు తీసుకెళతాడనుకున్న మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కెరీర్ పరంగా వెనకబడ్డాడు. అమీర్ వారసులు ఉన్నా.. వీళ్లలో ఎవరికీ ఆ తరహా గుర్తింపు కనిపించడం లేదు. మరోవైపు సల్మాన్ ఖాన్ 50 వయసు దాటేసినా స్టిల్ బ్యాచిలర్. ఇక పెళ్లాడే ఆలోచనలోనే లేడు. కాబట్టి ఇక వారసులు అనేవాళ్లే లేరు. లెగసీని ముందుకు తీసుకెళ్లేవాళ్లే కరువు.

అయితే వేరొక కోణంలో వీళ్లకు వారసులున్నారన్నది బాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్న మాట. షారూక్ వారసుడు - రణవీర్ సింగ్ - సల్మాన్ వారసుడు- వరుణ్ ధావన్ - అమీర్ ఖాన్ వారసుడు- రణబీర్ సింగ్ ... హృతిక్ రోషన్ వీళ్లందరికీ పోటీదారు అంటూ కొత్త లెక్కలు చెబుతున్నారు. షారూక్ తర్వాత షారూక్ అంతటివాడిగా రణవీర్ తనని తాను ఎలివేట్ చేసుకున్నాడు. పద్మావత్ చిత్రంతో 600 కోట్ల క్లబ్ హీరోగా అవతరించాడు. అతడు నటించే సినిమాలన్నీ సక్సెస్‌తో దూసుకెళుతున్నాయి. వందల కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను పుల్ చేసే హీరోగా ఎదిగాడు. ఇకపోతే సల్మాన్ స్వయంగా తన వారసుడు ధావన్ బోయ్ అంటూ ప్రకటించాడు. వరుణ్ ధావన్ `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` నుంచి `జుడ్వా 2` వరకూ వరుస సక్సెస్ లతో జోరుమీదున్నాడు. ఈ లెగసీని ముందుకు తీసుకెళుతూ వంద కోట్ల క్లబ్ హీరోగా ఎదిగేశాడు. మునుముందు బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా అతడు సల్మాన్ స్థాయిలో రాణిస్తాడన్న అంచనాలున్నాయి. ఇకపోతే సంజు సినిమాతో మరోసారి స్టార్ డమ్ ని వెనక్కి తీసుకొచ్చాడు రణబీర్. గత కొంతకాలంగా పరాజయాల్లో ఉన్న రణబీర్ ఇప్పుడు చుక్కల్ని అధిరోహించాడు. అమీర్ ఖాన్ తర్వాత అంతటి ప్రతిభావంతుడిగా రణబీర్ కి పేరొచ్చింది. కాబట్టి అమీర్ వారసుడిగా అతడు సత్తా చాటుతాడన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఖాన్ ల త్రయానికే ముచ్చెమటలు పట్టించే హీరోగా హృతిక్ తనంతట తానుగా ఎదిగిన తీరును విశ్లేషకులు అంతే ప్రశంసిస్తున్నారు. వీళ్లంతా ఖాన్ లకు ఆల్టర్నేట్ అనేస్తున్నారు. అదీ సంగతి.