దేవుడా..నీవెంత కఠినం!

Sun Feb 25 2018 09:40:07 GMT+0530 (IST)

అతిలోక సుందరి శ్రీదేవి మరణవార్త యావత్ సినీ రంగాన్ని కుదిపేసింది. ఇక.. దేశ ప్రజలకైతే ఒకపట్టాన నమ్మబుద్ధి కాని పరిస్థితి. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ న్యూస్ టీవీల్లో బ్రేకింగ్ గా వచ్చింది.ఆమె మరణవార్త విన్నంతనే బాలీవుడ్ ప్రముఖులు తెల్లవారుజామున స్పందించారు. ఆమె మరణం తమనెంత షాక్‌కు గురి చేసిందన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. శ్రీదేవికి వీరాభిమానిగా.. ఆరాధకుడిగా చెప్పుకునే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాతో తీవ్రంగా స్పందించారు.

ఇంతగా దేవుడ్ని తానెప్పుడూ ద్వేషించలేదంటూ ట్వీట్ చేశారు. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదని బాలీవుడ్ నటి ప్రియాంక చెప్రా పేర్కొన్నారు. శ్రీదేవిని ప్రేమించే అందరికి నా సంతాపం అని ట్వీట్ చేశారు.

సినీ ప్రముఖులు సుస్మితాసేన్.. జాక్వలిన్ ఫెర్నాండెజ్.. రితేష్ దేశ్ ముఖ్.. అనుష్క శర్మ.. అను ఇమ్మాన్యుల్.. ప్రీతిజింటా.. సిద్ధార్థ్ మల్హోత్రా.. జానీ లివర్.. జరీన్ ఖాన్.. ఆద్మాన్ సమీ.. మధుర్ బండార్కర్.. గౌతమి తదితర సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

శ్రీదేవి మరణాన్ని తాను నమ్మటం లేదన్నారు. ఓ లెజెండ్ ఇక లేరు.. భారతీయ సినీ చరిత్రలో ఆమె స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేనిదంటూ టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు.