Begin typing your search above and press return to search.

బయోపిక్స్.. ఎందుకు రుద్దుతున్నారు?

By:  Tupaki Desk   |   31 Aug 2016 5:30 PM GMT
బయోపిక్స్.. ఎందుకు రుద్దుతున్నారు?
X
స్పోర్ట్స్ బయోపిక్స్.. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ప్రముఖంగా వినిపిస్తున్న మాట. ఏ ముహూర్తాన రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా.. లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్ జీవిత చరిత్రను ‘బాగ్ మిల్కా బాగ్’ పేరుతో తెరకెక్కించి మెప్పించాడో కానీ.. అప్పట్నుంచి వరుసగా స్పోర్ట్స్ బయోపిక్స్ పోటెత్తుతున్నాయి. ఇప్పటికే బాక్సర్ మేరీకోమ్ జీవిత చరిత్రతో ‘మేరీ కోమ్’ సినిమా వచ్చింది. ఆ తర్వాత అజహరుద్దీన్ కథతో ‘అజహర్’ సినిమా తీశారు. త్వరలోనే ఎం.ఎస్.ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ.. సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్ లాంటి సినిమాలు రాబోతున్నాయి. ఇవి కాక మరిన్ని స్పోర్ట్స్ బయోపిక్స్ రెడీ అయిపోతున్నాయి.

ఐతే ఏది ఎంత స్ఫూర్తినిస్తుంది.. ఎంత ఆసక్తి రేపుతుంది అని చూడకుండా కాస్త ఫేమ్ ఉన్న ప్రతి స్పోర్ట్స్ పర్సన్ గురించీ బయోపిక్ తీసేద్దామని చూస్తుండటమే ఆశ్చర్యం కలిగించే విషయం. నిజానికి ‘బాగ్ మిల్కా బాగ్’ ఆడినంతగా.. ఆసక్తి రేకెత్తించినట్లుగా ఆ తర్వత వచ్చిన మేరీ కోమ్.. అజహర్ సినిమాలు ఆడలేదు.. ఆసక్తి కలిగించలేదు. మేరీకోమ్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి జనాల్లో అంతగా లేదు. ఇక ‘అజహర్’ సినిమా విషయానికి వస్తే.. అందులో చూపించింది నిజమని జనాలు నమ్మలేదు. నిజానికి అజమర్ కథ చాలా ఆసక్తి రేకెత్తించేదే. కానీ దాని ముగింపు వాస్తవికంగా ఉండదని జనాలు అనుమానించారు. అలాగే జరిగింది. అజహర్ కు ఫేవర్ గా సినిమాను ముగించి.. అతను అమాయకుడన్నట్లు చూపించడంతో సినిమా తేలిపోయింది.

ఐతే ధోని.. సచిన్ సినిమాల విషయంలో జనాల్లో బాగానే ఆసక్తి ఉంది. ధోని గురించి తెలియని విషయాలే ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు నీరజ్ పాండే. దీని ట్రైలర్ కూడా ఆసక్తి రేకెత్తించింది. ఇక సచిన్ గురించి ఏం చూపించినా జనాలు చూస్తారనడంలో డౌట్ లేదు. ఐతే మన గోపీచంద్ జీవిత కథ ఆధారంగా సినిమా అంటున్నారు కానీ.. అతడి గురించి జనాల్లో అంత ఆసక్తి ఉందా అన్నది సందేహమే. గోపీచంద్ గొప్ప కోచే కానీ.. అతడి జీవితంలో అంత ఆసక్తికర మలుపులేమీ లేవు. పైగా అతడికి క్రేజ్ లేదు. ఉన్నదున్నట్లు చూపించకుండా మసాలా వేస్తే ఇక ఆ సినిమాకు అర్థం ఉండదు.

మరోవైపు సైనా మీద ఓ బయోపిక్.. సింధు మీద కూడా మరో బయోపిక్ తీసేస్తామంటున్నారు ఫిలిం మేకర్స్. సైనా గురించి చూపించడానికి అంతగా ఏముందో మరి. సింధు ఇప్పుడు ఒలింపిక్స్ రజతం గెలిచింది కాబట్టి.. ఆమె పేరు మార్మోగిపోతోంది కాబట్టి దాని గురించి కూడా చర్చిస్తున్నారు. ఇంకో వైపు సానియా బయోపిక్ గురించి కూడా చర్చ నడుస్తోంది. వీళ్లందరూ గొప్ప అథ్లెట్లే. కానీ సినిమా తీసేంత కంటెంట్ వాళ్ల జీవితాల్లో ఉందా అన్నది డౌట్. ఉన్నదున్నట్లు చూపిస్తే మాత్రం ఆ సినిమాలు అంత గొప్పగా అయితే ఉండవు. ఉన్నదాని కంటే ఎక్కువ గొప్పదనాన్ని ఆపాదించి.. మలుపులు జోడిస్తే ఆ సినిమాకు అర్థం ఉండదు. మరి మన ఫిలిం మేకర్స్ ఏం చేస్తారో చూద్దాం.