‘బిగ్ బాస్’ భామ కోసం కటౌట్లు పెట్టేశారు

Sat Sep 23 2017 14:53:49 GMT+0530 (IST)

హీరోలకు తప్పితే హీరోయిన్లకు కటౌట్లు పెట్టే సంప్రదాయం మన దగ్గర లేదు. ఐతే ఇప్పుడు ఎలాంటి స్టార్ ఇమేజ్ కూడా లేని ఒక ఔట్ డేటెడ్ హీరోయిన్ కటౌట్లు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కనిపిస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. అర్చన. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేక బాగా వెనుకబడిపోయిన స్థితిలో అర్చనకు తెలుగు ‘బిగ్ బాస్’ షో తొలి సీజన్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ అమ్మాయి వ్యవహారం చూస్తే కొన్ని వారాల్లోనే ఎలిమినేట్ అయి హౌస్ నుంచి వెళ్లిపోతుందని అనుకున్నారు. కానీ రెండు మూడుసార్లు ఎలిమినేషన్ దశకు వచ్చి కూడా సేఫ్ అయిపోయిన అర్చన.. చివరికి ‘బిగ్ బాస్’ టైటిల్ కోసం పోటీ పడే ఐదుగురిలో ఒకరిగా చివరి వరకు రేసులో నిలిచింది.ఇప్పుడు టైటిల్ కోసం ఆమె హరితేజ.. ఆదర్శ్.. శివబాలాజీ.. నవదీప్ లతో పోటీ పడుతోంది. ఆదివారమే విజేతను ప్రకటించబోతున్నారు. ఈ లోపు అర్చనకు వీలైనంత ఎక్కువమందితో ఓట్లు వేయించే పనిలో పడ్డారు ఆమె అభిమానులు. అర్చనకు ఓటేయాలంటూ హైదరాబాద్ లో పలు చోట్ల అర్చన కటౌట్లు.. ఫ్లెక్సీలు వెలిశాయి. వాటి మీద ‘జై లవకుశ’ పోస్టర్లు కూడా ఉండటం విశేషం. ఎన్టీఆర్ గతంలో ఒకసారి అర్చనను ఉద్దేశించి మాట్లాడుతూ.. నీకోసం అమీర్ పేటలో కటౌట్లు కూడా వెలిశాయంటూ జోక్ చేశాడు. ఇప్పుడు అదే నిజమైంది. రెండు నెలల కిందటి వరకు ఎవరికీ పెద్దగా పట్టని అర్చనకు ఇప్పుడు ఇంత ఫాలోయింగ్ రావడం.. ఆమె కోసం ఇలా కటౌట్లు పెట్టడం ఆశ్చర్యం కలిగించేదే. మరి కటౌట్ల ప్రచారం అర్చనకు ఏమాత్రం కలిసొస్తుందో చూడాలి.