Begin typing your search above and press return to search.

ఆమరణ దీక్షకు కౌశల్.. కారణమిదే..

By:  Tupaki Desk   |   24 Jun 2019 7:13 AM GMT
ఆమరణ దీక్షకు కౌశల్.. కారణమిదే..
X
బిగ్ బాస్ 2 విజేత కౌశల్ వ్యవహారశైలి ఆదినుంచి వివాదాస్పదమే.. బిగ్ బాస్ 2లో అందరూ ఒంటరిని చేసి టార్గెట్ చేయడంతో అభిమానులు ఆయన కోసం కౌశల్ ఆర్మీగా మారి కౌశల్ ను గెలిపించారు. ఆ తర్వాత సామాజిక మాద్యమాల్లో కౌశల్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. అలాగే బిగ్ బాస్ టైటిల్ ను కూడా గెలుచుకున్నాడు.

అయితే బిగ్ బాస్ 2 విజేతగా కౌశల్ కావడానికి కారణమైన ఆయన ఆర్మీ ఆ తర్వాత ఆయనపైనే ఆరోపనలు చేయడం.. అది ఫేక్ ఆర్మీ అని - పెయిడ్ ఆర్మీ అని వార్తలు రావడంతో కౌశల్ ప్రతిష్ట మసకబారింది. కొన్ని చానళ్లు డిబేట్లు పెట్టి మరీ కౌశల్ పరువు తీశాయి. అయితే పోయిన తన ఇమేజ్ ను - పరువును తిరిగి రాబట్టుకోవాలని కౌశల్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది.

తాజాగా కౌశల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ లో 11 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా ఆమరణ దీక్షకు దిగుతున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపాడు. ఇందు కోసం హన్మకొండ వెళుతున్నట్టు తెలిపారు.

తాజాగా సోమవారం మరో వీడియోలో తను చిన్నారి నాన్న జగన్ ను కలిసి వివరాలు తెలుసుకున్నానని.. వరంగల్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట ఆమరణ దీక్షకు దిగుదామని వెళితే పోలీసులు అనుమతివ్వలేదని.. తెలిపాడు. రేపు ఉదయం చిన్నారి తల్లిదండ్రులతో కలిసి మెజిస్టేట్ ఎదురుగా దీక్ష చేపడుతామని.. తన కౌశల్ ఆర్మీ - ఫ్యాన్స్ - మానవతావాదులంతా రేపు ఉదయం వరంగల్ తరలిరావాలని వీడియోలో కోరారు. ఇలా కౌశల్ ఇప్పుడు సామాజిక సమస్యలపై తన దృష్టిని కేంద్రీకరించడం.. ఈ అడుగులు ఎటువైపు పడుతాయనే చర్చకు దారితీశాయి.

బిగ్ బాస్ గెలిచాక కౌశల్ కు సినిమాలు - సీరియళ్లలో పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చాయని వార్తలు వచ్చాయి.కానీ వాస్తవానికి కౌశల్ కు ఎలాంటి ఆఫర్లు రాలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న కౌశల్ ఇలా సామాజిక సమస్యలపై పోరాడుతూ రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.