వీరరాఘవుడికి భలే ఛాన్సులే..

Fri Oct 19 2018 15:21:29 GMT+0530 (IST)

‘అరవింద సమేత వీర రాఘవ’కు తొలి రోజు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే.. ఇది రికార్డుల మోత మోగించేస్తుందనిపించింది. నిజానికి దీనికి ఓపెనింగ్స్ అయితే భారీగా వచ్చాయి. తొలి రోజు వరల్డ్ వైడ్ షేర్ అనూహ్య స్థాయిలో వచ్చింది. నాన్-బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టినట్లుగా బాక్సాఫీస్ సైట్స్ నిర్ధరించాయి. ఐతే ఆ తర్వాత ఈ చిత్రం అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయింది. ముఖ్యంగా వీకెండ్ తర్వాత వసూళ్లు బాగా పడిపోయాయి. నామమాత్రపు వసూళ్లతో సాగిందీ చిత్రం. తొలి వారంలో రూ.70 కోట్లకు అటు ఇటుగా షేర్ రాబట్టింది. ఈ నేపథ్యంలో నాన్-బాహుబలి రికార్డులు బద్దలు కొట్టడం తర్వాత.. రూ.100 కోట్ల షేర్ మార్కు అసాధ్యమని తేలిపోయింది. చివరికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు అయినా వస్తుందా అన్న సందేహాలు కూడా కలిగాయి.ఈ నేపథ్యంలో ఈ వారం రిలీజయ్యే కొత్త సినిమాలకు ఎలాంటి టాక్ వస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఐతే గురువారం రిలీజైన రెండు సినిమాలకూ ఏమంత గొప్ప టాక్ రాలేదు. ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రం గురించి అందరూ పర్వాలేదు అని మాత్రమే అంటున్నారు. ఏదో అలా టైంపాస్ అయిపోయే సినిమానే తప్ప.. అంత ప్రత్యేకమేమీ కాదని అభిప్రాయపడుతున్నారు. ‘పందెంకోడి-2’కు కూడా డివైడ్ టాక్ ఉంది. దసరా సెలవుల టైంలో ఫ్యామిలీస్ పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్తాయి. వాళ్లు ఎక్కువగా స్టార్ వాల్యూ ఉన్న సినిమాలే చూడాలనుకుంటారు. కొంచెం తక్కువ స్థాయి సినిమాల విషయంలో టాక్ కనుక్కుంటారు. ఏమైనా ప్రత్యేకత ఉందంటేనే అటు వైపు వెళ్తారు. ఐతే కొత్త సినిమాలు రెంటికీ టాక్ ఏమంత గొప్పగా లేకపోవడంతో ‘అరవింద సమేత’కు కలిసొచ్చే అవకాశముంది. ఈ చిత్రానికి వీకెండ్లో ఆక్యుపెన్సీ రేట్ బాగానే ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా శని.. ఆదివారాల్లో వసూళ్లు పెరుగుతాయని.. మంచి షేర్ వస్తుందని.. సినిమా బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వెళ్తుందని అంచనా వేస్తున్నారు.