Begin typing your search above and press return to search.

బిచ్చగాడా... ఈ స్థాయి రికార్డులా?

By:  Tupaki Desk   |   26 July 2016 3:46 PM GMT
బిచ్చగాడా... ఈ స్థాయి రికార్డులా?
X
గోడమీదున్న పోస్టర్ పై ఆ సినిమా చూసినప్పటినుంచి జనాల్లో నానుతుంది ఆ సినిమా. మొదట్లో అలా వచ్చి ఇలా పోయే చాలా సినిమాల వంటిదే అది కూడా అనుకున్నారు కొందరు! ఆ సినిమా టైటిల్ చూసి.. నవ్వి పోయారు ఇంకొందరు!! ఇదే సమయంలో ఎన్నో పెద్ద పెద్ద స్టార్ ల సినిమాలు వచ్చాయి, ఆ సినిమాకు ముందూ వచ్చాయి, ఆ సినిమా థియేటర్లలో ఉన్నప్పుడూ వచ్చాయి కానీ... అవన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. ఈ సినిమా మాత్రం అలానే కొనసాగింది.. కొనసాగుతుంది. ఎంతలా అంటే.. 200 థియేటర్లలో 75రోజులు ఆడేటంత.

ఇప్పటికే ఆ సినిమా ఏమిటో అర్ధమై ఉంటుంది... అదే బిచ్చగాడు సినిమా! అవును.. ఇది నిజం! ఈ మధ్యకాలంలో ఎవరూ ఊహించని స్థాయిలో.. స్టార్ కాస్టింగ్ లేని, భారీ నిర్మాణ విలువలు లేని, స్టార్ డైరెక్టర్ లేని ఈ సినిమా తెలుగు - తమిళ ఇండస్ట్రీలను దుమ్ము లేపేసింది. స్టార్లతో సంబందం లేకుండా కేవలం కంటెంటు వల్లే ఒక సినిమా భారీ విజయం సాధించిన సందర్బాలు ఈ మధ్యకాలంలో లేవనే చెప్పాలి. ఆ చరిత్రలను తిరగరాస్తూ... ఈ సినిమా సంచలనం సృష్టించింది.

సైలెంట్‌గా వచ్చి వైలెంట్ హిట్ కొట్టిన బిచ్చగాడు తాజాగా 75 రోజులు కూడా దాటేసింది. ఏ స్టార్‌ హీరోకీ - ఏ భారీ సినిమాకీ తీసిపోని రీతిలో సుమారు 200 థియేటర్లలో 75 రోజులు పూర్తి చేసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం కాదు. పరిస్థితి ఇలానే ఉంటే.. 100 రోజులు పూర్తిచేయడం కూడా ఈ బిచ్చగాడికి చాలా చిన్న విషయమే అనుకోవాలి! కథని మాత్రమే నమ్ముకుని, ఆ కథలో దమ్ముని నమ్ముకుని సినిమాలు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో సూచిస్తూ దూసుకుపోతుంది!