మరో యువనటి అనుమానాస్పద మృతి

Mon Jun 19 2017 20:24:43 GMT+0530 (IST)

ఏమైందో ఏమో కానీ.. రంగుల ప్రపంచంలోకి కోటి కలలతో వస్తున్న వారంతా అర్థాంతరంగా తనువులు చాలిస్తున్నారు. ఉన్నట్లుండి ఏమవుతుందో కానీ.. ఒకరి తర్వాత ఒకరుగా యువనటుల అనుమానస్పద మరణాలు కొత్త సందేహాలకు తావిస్తున్నాయి. ఇటీవల కాలంలో పలువురు సినీ నటులు అనుమానాస్పద రీతిలో మరణిస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలో 29 ఏళ్ల యువనటి అంజనీ శ్రీవాస్తవ అనుమానాస్పద రీతిలో మరణించారు. ముంబయిలోని పశ్చిమ అందేరిలోని తన ఇంట్లో ఆమె సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని కనిపించారు. ఆమె మరణాన్ని అనుమానాస్పదంగా పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకుందన్నది ఇప్పుడు ఎవరూ చెప్పలేకపోతున్నారు.

అంజనీ శ్రీవాస్తవ పలు భోజ్ పూరి సినిమాల్లో నటించారు. కొన్నేళ్లుగా ముంబయిలో ఆమె ఉంటున్నారు. అద్దె ఇంట్లో ఉన్న ఆమె ఆదివారం నుంచి ఫోన్ ఎత్తకపోవటంతో ఇంట్లో వారికి సందేహం వచ్చింది. వెంటనే ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పారు.

దీంతో అనుమానం వచ్చిన ఆయన డూప్లికేట్ తాళంతో ఇంటిని తెరిచి చూడగా.. ఆమె విగతజీవిగా కనిపించింది. దీంతో.. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. అంజనీ మరణానికి కారణం ఏమిటన్న అంశంపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/