Begin typing your search above and press return to search.

భారతీయుడు మళ్ళి వస్తాడా ?

By:  Tupaki Desk   |   25 Jun 2018 10:16 AM GMT
భారతీయుడు మళ్ళి వస్తాడా ?
X
సోషల్ మెసేజ్ ఇస్తూనే అబ్బురపరిచే కథలను భారీగా తెరకెక్కించడంలో మాస్టర్ అయిన దర్శకుడు శంకర్ తీసిన సినిమాల్లో కమల్ హాసన్ నటించిన భారతీయుడిది ప్రత్యేక స్థానం. లంచాలు తీసుకునే అధికారులను చంపుతూ పోయే వయసు మళ్ళిన సేనాపతి పాత్రలో కమల్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆఖరికి కన్న కొడుకుని కసితీరా పొడిచి దేశం కోసం తన బాధ్యతను నిర్వర్తించే వృద్ధుడిగా ఇచ్చిన పెర్ఫార్మన్స్ కు నభూతో నభవిష్యత్ అనే మాట చిన్నదే. గత ఐదారు నెలలుగా దీనికి సీక్వెల్ రూపొందనుంది అనే వార్తలు గట్టిగానే వినిపించాయి. ఒకదశలో దిల్ రాజు దీన్ని నిర్మిస్తానని ముందుకు వచ్చి నిర్మాణంలో ఉండే రిస్క్, సాధక బాధలు ముందే గుర్తించి డ్రాప్ అవ్వడం అందరికి తెలిసిన విషయమే. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇప్పుడు 2.0 నిర్మిస్తున్న లైకా సంస్థే దీనికి కూడా పెట్టుబడి పెట్టనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ మధ్య శంకర్ కూడా ఇదే మాట అన్నాడు. కానీ ఇప్పుడు అది అంత ఈజీగా జరిగేలా లేదు.

శంకర్ 2.0 కోసమే మరో ఏడాది ఖర్చు పెట్టాల్సి వచ్చేలా ఉంది. ఇటీవలే మరో వంద కోట్ల బడ్జెట్ ను 2.0కు జోడించడంతో పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా ఆలస్యం కావడం ఖాయం. షూటింగ్ అయిపోయిందని ఏనాడో గుమ్మడి కాయ కొట్టేశారు కానీ రజని లేని కొన్ని సీన్స్ ని పర్ఫెక్షన్ కోసం శంకర్ మళ్ళి తీస్తున్నాడని కోలీవుడ్ టాక్. ఇదంతా జరిగే లోపు కనీసం ఏడాది పడుతుంది . విడుదల కూడా వచ్చే వేసవి అనే మాట వినిపిస్తోంది. దానికి తోడు కమల్ హాసన్ ఖాళీగా లేడు. విశ్వరూపం 2 విడుదల సన్నాహాలతో పాటు సగంలో వదిలేసిన శభాష్ నాయుడు పూర్తి చేసేందుకు నడుం బిగిస్తున్నాడు. వీటి మధ్య బిగ్ బాస్ 2 షూటింగ్ ఉంటుంది.

ఇవన్నీ ఒక ఎత్తైతే రాజకీయాల్లో అడుగు పెట్టిన కమల్ కు పార్టీని బలోపేతం చేసుకోవలసిన బాధ్యత ఉంది. దాని కోసం విస్తృత పర్యటనలు చేసే ప్రణాళిక ఉంది. శంకర్ భారతీయుడు కనక మొదలుపెడితే దానికి ఎంత లేదన్నా రెండు నుంచి మూడేళ్ళ సమయం కేటాయించాలి. కమల్ అన్ని డేట్స్ ఇవ్వలేడు. మరో సమాచారం మేరకు దీన్ని అజిత్ తో తీసే ఆలోచనలో కూడా ఉన్నాడట శంకర్. శివ దర్శకత్వంలో చేస్తున్న విశ్వాసం తప్ప అజిత్ ఇంకెవరికి కమిట్ కాలేదు. మరి సేనాపతి రెండో సారి వస్తాడో రాడో వస్తే ఎవరి రూపంలో వస్తాడో వేచి చూడాలి .