తమిళ మీటింగ్ పై కన్నేసిన భరత్

Tue Apr 17 2018 14:09:15 GMT+0530 (IST)

సూపర్ స్టార్ మహేష్ బాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో థియేటర్లో దిగేందుకు ఇంకా మూడు రోజులే ఉంది. ఇండస్ట్రీలో కూడా ‘భరత్ అనే నేను’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా మూడు కోట్ల రూపాయలతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది భరత్ టీం. అయితే ఈ తెలుగు ముఖ్యమంత్రి ఇంకా బాక్సాఫీస్ అధీకారంలోకి రాకముందే పక్క రాష్ట్రంపై కన్నేసాడట.



కోలీవుడ్ లో మార్చి 2 నుంచి నిరవధిక థియేటర్ల బంద్ జరుగుతున్న విషయం తెలిసిందే. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో వీపీఎఫ్ చార్జి భారీగా తగ్గించాలని కోరుతూ దక్షిణ భారత నిర్మాతల మండలి పిలుపునిచ్చింది. అయితే వారం రోజుల తర్వాత మిగిలిన చిత్ర పరిశ్రమలన్నీ సంధి చేసుకుని 23 శాతం డిస్కౌంట్ కి ఒప్పుకుని థియేటర్లు తెరిచినా... తమిళ తంబీలు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కోలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం ఓ పరిష్కారం చూపాలంటూ అప్పటినుంచి బంద్ పాటిస్తున్నారు. ఎట్టకేలకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాతల మండలితో మాట్లాడేందుకు ఒప్పుకుంది. ఈరోజు సెక్రటేరియట్ లో సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ మీటింగులో ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడట మన ముఖ్యమంత్రి భరత్. అక్కడ గొడవ సద్ధుమణిగితే చెన్నై లాంటి నగరాల్లో భారీ స్థాయిలో ‘భరత్ అనే నేను’ సినిమాను విడుదల చేయాలనుకుంటోంది చిత్ర బృందం. భరత్ తో పాటు తమిళ జనాలందరూ ఈ మీటింగ్ విజయవంతం కావాలని కోరుకుంటున్నారు. వాళ్లు థియేటర్లో కొత్త సినిమా చూసి చాన్నాళ్లయ్యింది మరి.