Begin typing your search above and press return to search.

'భలే భలే మగాడివోయ్' మూవీ రివ్యూ

By:  Tupaki Desk   |   4 Sep 2015 8:52 AM GMT
భలే భలే మగాడివోయ్ మూవీ రివ్యూ
X
'భలే భలే మగాడివోయ్' రివ్యూ

చిత్రం - భలే భలే మగాడివోయ్
నటీనటులు- నాని - లావణ్య త్రిపాఠి - మురళీ శర్మ - వెన్నెల కిషోర్ - అజయ్ - నరేష్ - సితార - మధుమిత - ప్రవీణ్ - శ్రీనివాసరెడ్డి తదితరులు
ఛాయాగ్రహణం - నిజార్ షఫి
సంగీతం - గోపి సుందర్
నిర్మాతలు - బన్నీ వాస్, వంశీ
రచన, దర్శకత్వం - మారుతి

ఏ రసాన్నయినా పండించే నటుడు నాని. వినోదాత్మకమైన పాత్రలైతే మరీ చెలరేగిపోతాడు. అతడికి సరైన డైరెక్టర్ దొరకాలి, మంచి క్యారెక్టర్ పడాలి. 'భలే భలే మగాడివోయ్' టీజర్, ట్రైలర్ చూస్తే.. నానికి మారుతి రూపంలో సరైనోడే దొరికినట్లు, మంచి క్యారెక్టరే పడ్డట్లు కనిపించింది. మతిమరుపు పాత్రతో ట్రైలర్లోనే కితకితలు పెట్టారు నాని, మారుతి. మరి సినిమా అంతటా కూడా ఇలాగే నవ్వించారా? చూద్దాం పదండి.

కథ:

లక్కరాజు అలియాస్ లక్కీ (నాని) ఓ మతిమరుపు మహారాజు. సాక్సులు తొడుక్కుని షూలు వేసుకోవడం మరిచిపోయే టైపు. ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ దాన్ని అలాగే పక్కనబెట్టేసి వేరే పని మీద వెళ్లిపోయే రకం. ఈ మతిమరుపు వల్లే అతడికి పెళ్లి కూడా అవదు. తనకు పిల్లనివ్వడానికి వచ్చిన మామ గురించి మరిచిపోయి ఫ్రెండుతో ముచ్చట్లు చెబుతుంటాడు. దీంతో అతడికి మామ కావాల్సిన వ్యక్తి అతణ్ని అసహ్యించుకుని వెళ్లిపోతాడు. ఐతే ఇదే మతిమరుపు వల్ల అనుకోకుండా అతడి కూతురితోనే (లావణ్య) లక్కీకి పరిచయ భాగ్యం దక్కుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఐతే తనను అసహ్యించుకున్న వ్యక్తే తనకు కాబోయే మావ అని లక్కీకి తెలుస్తుంది. ఇలాంటి స్థితిలో తన మతిమరుపు గురించి తన ప్రేయసికి తెలియకుండా, తానెవరో తన మామకు చెప్పకుండా లక్కీ ఎలా మేనేజ్ చేశాడు? చివరికి నిజాలు బయటపడిపోయాక ఏం చేశాడు? అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ:

డైరెక్టర్ మారుతికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉందన్న సంగతి అతను తీసిన తొలి రెండు మూడు సినిమాలతోనే అర్థమైంది. చాలా సింపుల్ గా అనిపించే సన్నివేశాలతోనే వినోదం పండించగల నైపుణ్యం అతడి సొంతం. ఇక నాని సంగతి చెప్పాల్సిన పని లేదు. మామూలు సన్నివేశాల్లో కూడా తన నటనతో వెయిట్ తీసుకురాగలడు. కామెడీకి కాస్తంత ఛాన్స్ ఉన్నా ఆ సన్నివేశం పేలిపోయేలా చేయగలడు. అలాంటి డైరెక్టర్, ఇలాంటి హీరో జతకట్టాక వినోదానికి ఢోకా లేకపోయింది.

హీరోకు మతిమరుపు.. ఈ పాయింటుతో కథ రాసుకున్నపుడే మారుతి సగం విజయం సాధించేశాడు. మన చుట్టూ ఇలాంటి క్యారెక్టర్లకు కొదవేం ఉండదు.. ఆ మాటకొస్తే ప్రతి వ్యక్తీ ఈ మతిమరుపుతో ఇబ్బంది పడే వాడే కాబట్టి.. ప్రేక్షకులు ఈజీగా కనెక్టయిపోయే అవకావశముంది. ఐతే సినిమా కాబట్టి కొంచెం డోసు పెంచి.. వినోదం పండించాడు మారుతి. అవసరమైనపుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు.

మతిమరపు హీరోతో సినిమాకు కమిటవుతుంది హీరోయిన్. కానీ హీరో థియేటర్ కు రాడు. ఆమె థియేటర్ నుంచి కోపంగా అతడి దగ్గరికొస్తే హీరో క్యారమ్స్ ఆడుతుంటాడు. ఆమెకు ఒళ్లు మండిపోతుంది. కోపంగా అతడివైపు వెళ్తుంటే.. 'శంకర్ దాదా ఎంబీబీఎస్'లో అబ్బాజాన్ సీన్ గుర్తుకొచ్చేస్తుంది హీరోకు. మొత్తానికి ఆ సమయానికి అలా కవర్ చేసేస్తాడు. ఇలాంటి ఫన్నీ కవరింగులతో సాగిపోతుంది ప్రథమార్ధమంతా.

ఏ మతిమరుపు వల్లైతే హీరో పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్నాడో.. తనకు మావ కావాల్సిన వ్యక్తితో ఛీకొట్టించుకున్నాడో.. అదే మతిమరుపు వల్ల హీరోయిన్ తో పరిచయం జరిగి ప్రేమలో పడేలా చేయడం బాగుంది. సినిమాకు మంచి ఆరంభాన్నిచ్చిన సన్నివేశమిది. ఇక అక్కణ్నుంచి హీరోయిన్ దగ్గర హీరో మతిమరుపు కవరింగులతో ప్రథమార్ధం చకచకా సాగిపోతుంది. ఐతే ప్రథమార్ధం వరకు రిఫ్రెషింగ్ అనిపించిన సినిమా.. ద్వితీయార్ధంలో రొటీన్ టర్న్ తీసుకోవవడమే నిరాశ పరుస్తుంది. హీరో తన ప్లేసులో ఇంకొకణ్ని పెట్టి.. అవతలి వాళ్లను కన్ఫ్యూజ్ చేసే లాజిక్ లేని రొటీన్ ఫార్ములా కామెడీ ట్రాక్ లతో ద్వితీయార్ధం సాగుతుంది. ఐతే కామెడీ పండితే రొటీన్ అయినా.. క్షమించేసే ప్రేక్షకులకు ఇది పెద్దగా ఇబ్బంది అనిపించదు.

ప్రథమార్ధమంతా నానీనే కామెడీ బాధ్యత మోస్తే.. ద్వితీయార్ధంలో అతడికి వెన్నెల కిషోర్ కూడా తోడయ్యాడు. ఇద్దరూ కలిసి కొన్ని కామెడీ అదరగొట్టేశారు. వాళ్లిద్దరి కెమిస్ట్రీ భలేగా పండింది. ఆరంభంలో పాత్రల పరిచయం అయిపోగానే.. ఇక క్లైమాక్స్ వరకు కథేంటన్నది ఏ ప్రేక్షకుడైనా ఇట్టే పసిగట్టేస్తాడు. ప్రిక్లైమాక్సులో హీరో దొరికిపోతాడని.. చివరికి అతడి ప్రేమలో నిజాయితీ అర్థం చేసుకుని మనసేంటో అర్థం చేసుకుని హీరోయిన్ అతడికి దగ్గరవుతుందని ఈజీగా గెస్ చేయొచ్చు కాకపోతే.. హీరోయిన్ తండ్రి పాత్రతో చిన్న ట్విస్టు ఇచ్చాడు మారుతి. అది కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. ప్రిక్లైమాక్స్ లో కొంచెం ఎమోషన్ పండించిన దర్శకుడు.. మళ్లీ క్లైమాక్స్ పాత దారిలోకి వెళ్లిపోయి సినిమాను సరదాగా ముగించాడు.

కథలో కొత్తదనం లేకపోవడం, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు సాగడం మైనస్ అయితే.. ఎక్కడా బోర్ కొట్టకుండా వినోదాత్మకంగా సాగిపోవడం 'భలే భలే మగాడివోయ్'లోని అతి పెద్ద సానుకూలత. హీరో క్యారెక్టర్.. దాన్ని నాని పండించిన తీరు సినిమాకు ప్రధాన ఆకర్షణ. కేవలం బ్లడ్ ఇచ్చినందుకు హీరోయిన్ హీరో ప్రేమలో పడిపోవడం, ఆమె తండ్రి అలాంటోణ్ని అల్లుణ్ని చేసుకోవడం కంటే అదృష్టమా అనడం.. ఓ సైంటిస్టు సరైన కారణాలు లేకుండానే హీరోను, విలన్ని నమ్మేయడం.. ఇవన్నీ కొంచెం సిల్లీగా అనిపిస్తాయి. విలన్ అజయ్ క్యారెక్టర్ కూడా సరిగా తీర్చిదిద్దలేదు. హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ కూడా మామూలుగా అనిపిస్తుంది. ప్రధానంగా హీరో క్యారెక్టర్ మీద దృష్టిపెట్టి చాలా క్యారెక్టర్లను లైట్ తీసుకున్నాడు మారుతి. ఐతే కామెడీతో కనెక్టయిన వాళ్లు.. ఈ మైనస్ లను లైట్ తీసుకోవచ్చు.

నటీనటులు :

సరైన క్యారెక్టర్ పడితే దాన్ని నాని ఏ స్థాయికి తీసుకెళ్తాడో చెప్పడానికి ఈ మతిమరుపు క్యారెక్టర్ మరో ఉదాహరణ. నాని చేయకపోయి ఉంటే లక్కీ క్యారెక్టర్ అంతగా పండేది ఉండేది కాదు, సినిమా ఇంత వినోదాత్మకంగా ఉండేది కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. తనదైన కామెడీ టైమింగుతో లక్కీ క్యారెక్టర్ ను పండించాడతను. సినిమా అంతటా నవ్వించిన నాని.. సీరియస్ గా కనిపించేది, డైలాగు చెప్పేది ఒకే ఒక్క సన్నివేశంలో. మామూలుగా అయితే ఇలాంటి కామెడీ ఫ్లేవర్ ఉన్న సినిమాలో ఆ సన్నివేశం అసహజంగా అనిపించాలి. కానీ అక్కడ నాని ఉండటం వల్లే ఆ సీన్ అలాంటి ఫీలింగ్ కలగదు. లావణ్య త్రిపాఠి నానికి సరైన జోడీ అనిపించుకుంది. 'అందాల రాక్షసి' తర్వాత మళ్లీ అంత అందంగా కనిపించింది లావణ్య. అభినయం కూడా ఓకే. కొన్ని చోట్ల సన్నివేశాలకు తగ్గ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వకపోయినప్పటికీ.. ఆమె లావణ్యం ఆ తప్పుల్ని కవర్ చేసింది. హీరోయిన్ తండ్రిగా మురళీ శర్మ ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించి మెప్పించాడు. వెన్నెల కిషోర్ కనిపించినంతసేపూ నవ్వించాడు. నాని తర్వాత నవ్వులన్నీ అతడివే. అజయ్, నరేష్, సితార, ప్రవీణ్, శ్రీనివాసరెడ్డి పాత్రలకు తగ్గట్లు నటించారు.

సాంకేతికవర్గం:

గోపీసుందర్ పాటలు బావున్నాయి. ఎందరో మహానుభావులు పాటను డిఫరెంట్ గా ట్యూన్ చేశాడు. మొట్టమొదటిసారి.. పాట కూడా బావుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని చోట్ల ఏదో మాస్ సినిమాల తరహాలో మరీ లౌడ్ గా అనిపిస్తుంది. నిజార్ షఫి ఫొటోగ్రఫీ సూపర్బ్. సినిమా అంతటా విజువల్స్ కలర్ ఫుల్ గా, ఆహ్లాదంగా అనిపిస్తాయి. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ కలిసి నిర్మించారంటే నిర్మాణ విలువల గురించి చెప్పేదేముంది. ఒక పెద్ద హీరో సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. రిచ్, ఫారిన్ లొకేషన్స్ లేకపోవచ్చు కానీ.. సినిమా క్వాలిటీకి ఎక్కడా ఢోకా లేదు. మారుతి హీరో క్యారెక్టర్ రాసుకోవడంలోనే మార్కులు కొట్టేశాడు. దాని చుట్టూనే వినోదాన్ని నింపాడు. ఐతే ఫస్టాఫ్ వరకు ఫ్రెష్ గా అనిపించిన అతడి ఆలోచనలు.. ద్వితీయార్ధం నుంచి రొటీన్ రూట్లోకి వచ్చేయడం కొంచెం నిరాశ కలిగిస్తుంది. ఐతే రైటర్ గా, డైరెక్టర్ గా అతనెక్కడా కన్ఫ్యూజ్ కాలేదు. ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయలేదు. ఒకట్రెండు చోట్ల అతడిలో నిద్రాణంగా ఉన్న 'బూతు' కాస్త బయటపడింది కానీ.. హద్దులు దాటలేదు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'భలే భలే మగాడివోయ్'ని తీర్చిదిద్దడానికే చూశాడు. ఆ ప్రయత్నంలో విజయవంతమయ్యాడు.

చివరగా - నాని భలే భలే.. సినిమా చల్తా చల్తా!!

రేటింగ్- 3/5