Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘భాగమతి’

By:  Tupaki Desk   |   26 Jan 2018 8:48 AM GMT
మూవీ రివ్యూ: ‘భాగమతి’
X
చిత్రం : ‘భాగమతి’

నటీనటులు: అనుష్క- ఉన్ని ముకుందన్ - జయరాం - మురళీ శర్మ- ఆశా శరత్ - ప్రభాస్ శీను - ధన్ రాజ్ - విద్యుల్లేఖ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: మధి
నిర్మాతలు: వంశీ - ప్రమోద్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జి.అశోక్

తెలుగులో ‘అరుంధతి’.. ‘రుద్రమదేవి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో గొప్ప పేరు సంపాదించిన కథానాయిక అనుష్క. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త సినిమా ‘భాగమతి’. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ జి.అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆసక్తికర ప్రోమోలతో జనాల దృష్టిని ఆకర్షించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

చంచల (అనుష్క) ఒక ఐఏఎస్ అధికారి. ఆమె తనకు కాబోయే భర్తను చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తుంటుంది. ఐతే చంచల ఒకప్పుడు పీఏగా పని చేసిన మంత్రి అవినీతిని నిరూపించేందుకు సీబీఐ అధికారులు.. చంచల నుంచి సమాచారం రాబట్టాలని అనుకుంటారు. అందుకోసం ఆమెను జైలు నుంచి అటవీ ప్రాంతంలో ఉండే పాడుబడ్డ బంగ్లాకు తరలిస్తారు. ఆ బంగ్లాకు వెళ్లాక అనూహ్య పరిణామాలు జరుగుతాయి. అవేంటి.. భాగమతి బంగ్లాగా పేరున్న దాని వెనుక కథేంటి..? ఇంతకీ చంచల తనకు కాబోయే భర్తను ఎందుకు చంపింది.. మంత్రి నిజంగా అవినీతి పరుడా.. చివరికి చంచల కేసు నుంచి బయటి పడిందా.. అన్న అనేక ప్రశ్నలకు తెరమీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

ఒక సినిమా ఎలా ఉండబోతోందన్న విషయంలో స్పష్టత ఇవ్వడానికి ఉద్దేశించిందే థియేట్రికల్ ట్రైలర్. ‘భాగమతి’ ట్రైలర్ చూస్తే ఇదొక హార్రర్ థ్రిల్లర్ అనే అనుకుంటాం. ఆ విషయంలో అంచనాలు పెట్టుకుని వెళ్తాం. ముఖ్యంగా ‘ఇది భాగమతి అడ్డా..’ అంటూ ట్రైలర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన డైలాగ్ చూశాక.. సినిమాపై ఏర్పడ్డ అంచనాలే వేరు. ‘భాగమతి’లో సగం సినిమా చూస్తున్నంతసేపూ ఇది అంచనాలకు తగ్గ సినిమానే అనిపిస్తుంది. భయపెడుతుంది.. ఉత్కంఠ రేకెత్తిస్తుంది.. ప్రేక్షకుల్ని గెస్సింగ్ లోనే ఉంచుతుంది. కానీ రెండో సగంలో మాత్రం మనకు భిన్నమైన సినిమా చూపిస్తారు.

మనం ఏదో అనుకుంటే అక్కడేదో జరుగుతుంది. అది ఆసక్తికరంగా లేదని కాదు.. ‘భాగమతి’ రంజింపజేయలేదనీ కాదు.. కానీ ఒక దశ వరకు ప్రత్యేకమైన సినిమాలాగా నడిచే ‘భాగమతి’కి చివరికి మామూలుగానే ముగుస్తుంది. చివరికొచ్చేసరికి సినిమాలోని పాత్రల్లాగే మనం కూడా ఫూల్స్ అయిపోయామే అన్న భావన కలుగుతుంది ప్రేక్షకుడికి. చివర్లో ఒక ట్విస్టు ఇచ్చి ప్రేక్షకుల్ని ఏమార్చడం కొత్తేమీ కాదు. కానీ ఆ ట్విస్టు ప్రేక్షకులు మరీ అఫెండ్ అయ్యే స్థాయిలో ఉండకూడదు. ‘భాగమతి’ కొంచెం అలాంటి భావనే కలిగిస్తుంది. కాకపోతే కథాకథనాల విషయంలో దర్శకుడి ప్రయత్నం వల్ల.. చక్కటి నిర్మాణ విలువలు.. సాంకేతిక హంగులతో దీనికి నిర్మాణ సంస్థ బలంగా నిలవడం వల్ల.. ‘భాగమతి’ చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది. అక్కడక్కడా ఒడుదొడుకులు ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఓకే అనిపిస్తుందీ చిత్రం.

‘భాగమతి’ చాలా లేయర్స్ ఉన్న కథ. ఇందులో మూణ్నాలుగు ఉపకథలుంటాయి. వాటి విషయమేంటో తేలడానికి.. కథపై పూర్తి స్పష్టత రావడానికి దాదాపు రెండు గంటలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొంత అసహనం కూడా కలుగుతుంది. ప్రేక్షకుల్ని చివరిదాకా సస్పెన్సులోనే ఉంచాలన్న ఉద్దేశం దర్శకుడు ఏ కథనూ ఒకేసారి చెప్పేయడు. గతాన్ని.. వర్తమానాన్ని మార్చి మార్చి చూపిస్తూ చూపిస్తూ కొంచెం కొంచెంగా విషయం వెల్లడయ్యేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. సినిమా మొదలైన 20 నిమిషాలకే వ్యవహారం భాగమతి బంగ్లాకు మళ్లుతుంది. అక్కడ ప్రతి హార్రర్ సినిమాలో మాదిరే.. విచిత్రమైన శబ్దాలు.. ఉలిక్కి పడేలా చేసే దృశ్యాలు.. రకరకాల భయాలు.. అనుమానాలతో సన్నివేశాలు నడుస్తాయి. కొన్ని సీన్లు గుండె జల్లుమనేలా చేస్తాయి. హార్రర్ కామెడీ సినిమాల్లో మాదిరి కమెడియన్లతో నవ్వులు పంచే ప్రయత్నం కూడా జరిగింది.

అసలీ కథానాయిక కథేంటి.. ఆమె తనకు కాబోయే భర్తను ఎందుకు చంపింది.. అసలింతకీ భాగమతి వ్యవహారమేంటి.. ఇలా రకరకాల ప్రశ్నలు తొలిచేస్తుండగా.. ప్రథమార్ధంలో కొంచెం రిపిటీటివ్ గా అనిపించే సీన్లు కొంత అసహనం కలిగిస్తాయి. ఇంతలో భాగమతి ఆగమనంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఊపిరి బిగబట్టి చూస్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. భాగమతికి సంబంధించి ఒక భారీ ఫ్లాష్ బ్యాక్ చూడబోతున్న భావన కలుగుతంది. కానీ తెర మీద జరిగేది పూర్తి భిన్నం. కొంచెం ముందుకు వెళ్లాక కథ పూర్తిగా భిన్నమైన ట్రాక్ లోకి మళ్లుతుంది. ఇక్కడ వచ్చే ట్విస్టు ఆసక్తికరమే కానీ.. మనం అంచనాలు పెట్టుకున్న దానికి భిన్నంగా కథ వెళ్తుంది. హార్రర్ థ్రిల్లర్ అనుకున్న ‘భాగమతి కాస్తా.. పొలిటికల్ థ్రిల్లర్ జానర్లోకి వెళ్లిపోతుంది.

కథానాయిక పాత్రకు సంబంధించిన గతం పూర్తిగా రివీలయ్యాక నిరాశ తప్పదు. మొత్తంగా రీ కలెక్ట్ చేసుకుని చూస్తే ఆ ఎపిసోడ్ ఏమంత ప్రభావవంతంగా ఉండదు. జయరాం పోషించిన మంత్రి పాత్ర.. ఆయన నటన భిన్నంగా ఉండి ఆసక్తి రేకెత్తిస్తాయి. ‘భాగమతి’లోని మలుపులు కొత్తగా అనిపిస్తాయి. కానీ ఆ మలుపులే ఈ సినిమాకు బలం.. బలహీనత లాగా అనిపిస్తాయి. భాగమతి అనే పాత్రకు ఒక ఫ్లాష్ బ్యాక్ అదీ పెట్టి ప్రేక్షకుడి అంచనాకు తగ్గట్లుగా నడిపించి ఉంటే సినిమా రొటీన్ అయ్యేదేమో. కానీ అంచనాలకు భిన్నంగా మరో రకంగా ఈ కథను నడిపించారు. అదే ఇందులో కొత్తదనం. కానీ ఆ మలుపు తర్వాత నడిచే వ్యవహారం మాత్రం రొటీన్ అనిపిస్తుంది. ఇది ఒక మామూలు సినిమానే కదా.. దీనికి మధ్యలో ఆ వేరే కలర్ ఎందుకో అన్న భావన కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే ‘భాగమతి’ అంచనాలకు తగ్గ స్థాయిలో లేదు కానీ.. ఇందులో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే అంశాలూ ఉన్నాయి.

నటీనటులు:

‘అరుంధతి’.. ‘రుద్రమదేవి’ తరహాలోనే ‘భాగమతి’ కూడా అనుష్కకు ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనుష్కే. ఇలాంటి పాత్రలకు తనకు మించిన ఛాయిస్ లేదు అనిపించేలా అనుష్క తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటుంది. ఆమె నటన కూడా మెప్పిస్తుంది. భాగమతిగా రౌద్రం చూపించే సన్నివేశంలో అనుష్క బాగా ఆకట్టుకుంటుంది. కథలో కీలకమైన పాత్రలో మలయాళ నటుడు జయరాం తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఉన్ని ముకుందన్ పాత్ర చిన్నదే అయినా చక్కటి నటనతో తన పాత్రను గుర్తుంచుకునేలా చేశాడు. ఆశా శరత్ నటన కూడా బాగుంది. మురళీ శర్మ పాత్రకు తగ్గట్లు నటించాడు. విద్యుల్లేఖ.. ప్రభాస్ శీను.. ధన్ రాజ్ కొంత మేర నవ్వించారు.

సాంకేతికవర్గం:

‘భాగమతి’కి నిర్మాణ విలువలు.. సాంకేతిక హంగులు పెద్ద బలంగా నిలిచాయి. యువి క్రియేషన్స్ స్థాయికి తగ్గట్లుగా సినిమా రిచ్ గా తెరకెక్కింది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తన కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అనదగ్గ పనితనం చూపించాడు. భాగమతి బంగ్లాను తీర్చిదిద్దిన తీరు అమోఘం. సగానికి పైగా కథ ఈ బంగ్లాలోనే నడిచినా.. మొనాటనీ రాకుండా చేయడంలో ఆర్ట్ డైరెక్టర్.. సినిమాటోగ్రాఫర్ పనితనం కనిపిస్తుంది. ఛాయాగ్రాహకుడు మధి హార్రర్ సినిమాల్లో ఇంతకుముందు చూడని లైటింగ్స్.. థీమ్స్ తో సినిమాకు డిఫరెంట్ లుక్ తీసుకొచ్చాడు. తమన్ నేపథ్య సంగీతం కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర.. ద్వితీయార్ధంలో బ్యాగ్రౌండ్ స్కోర్ ఎఫెక్టివ్ గా అనిపిస్తాయి. సినిమాలో ఉన్న ఒక్క పాట ‘మందార మందార..’ పర్వాలేదు. సాంకేతికంగా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ మరో అంశం.. సౌండ్ డిజైన్. ఇక దర్శకుడు జి.అశోక్.. ఇప్పటిదాకా తీసిన మూడు సినిమాలతో పోలిస్తే పూర్తి భిన్నంగా కనిపిస్తాడు ఈ సినిమాలో. చాలా లేయర్స్ ఉన్న కథను ఎంచుకుని.. భిన్నమైన స్క్రీన్ ప్లేతో చెప్పే ప్రయత్నం చేశాడు. ఐతే కథనంలో ఉండాల్సింతన బిగి లేకపోయింది. మరింత ఆసక్తికరమైన సన్నివేశాలు రాసుకోవాల్సింది. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచాలనే ఉద్దేశం ఓకే కానీ.. మరీ ఫ్రీ హ్యాండ్ తీసుకున్నాడనిపిస్తుంది. ‘భాగమతి’కి సంబంధించిన సెటప్ మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోవాల్సింది. ఓవరాల్ గా అశోక్ పనితనం ఓకే అనిపిస్తుంది.

చివరగా: భాగమతి.. కొంచెం భయం.. కొంచెం థ్రిల్!

రేటింగ్- 3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre