Begin typing your search above and press return to search.

రాఘవుడి స్పీడుకి రేట్లే బ్రేకులా ?

By:  Tupaki Desk   |   15 Oct 2018 7:18 AM GMT
రాఘవుడి స్పీడుకి రేట్లే బ్రేకులా ?
X
ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ రికార్డుల పని పడుతున్న అరవింద సమేత వీర రాఘవ యునానిమస్ గా అందరిచేత శెభాష్ అనిపించుకున్న మూవీ అయినా కాకపోయినా వస్తున్న వసూళ్లు చూపిస్తున్న లెక్కలు దీన్ని సూపర్ హిట్ స్టేటస్ ని దాటించాయన్నది నిజం. కాకపోతే ఇంత కన్నా మెరుగ్గా వసూళ్లు వచ్చే అవకాశాన్ని టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు తెచ్చుకోవడం ద్వారా నిర్మాతలే పోగొట్టారనే కామెంట్ ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. దానికి కారణం లేకపోలేదు.

మొదటి వారం నుంచి పది రోజుల దాకా రోజుకు ఆరు షోలతో పాటు ధరను పెంచుకునే అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే ఏబిసి అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో ఎగువ తరగతి టికెట్ ను 150 నుంచి 200 రూపాయల దాకా అమ్మడం మొదలుపెట్టారు. మొదటి రెండు మూడు రోజులు కాంబినేషన్ కున్న క్రేజ్ తారక్ ఫాలోయింగ్ వల్ల అదేమీ పెద్ద సమస్యగా పరిణమించలేదు. కానీ ఆ తర్వాత కుటుంబ ప్రేక్షకులు థియేటర్ దాకా రావడానికి ఇదే కాస్త అడ్డంకికి మారిందన్నదే అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.

నిజానికి ఇంత టికెట్ ధర ఓ నలుగురైదురు ఉన్న కుటుంబానికి భారమే. టికెట్లకే వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే రాను పోను ప్లస్ లోపల ఫుడ్డు కోసం పెట్టాల్సిన దానితో కలుపుకుని తడిసి మోపెడు అవుతుంది. దీని వల్ల అధిక సంఖ్యలో చూడాలి అనుకున్న వాళ్ళు వెనక్కు వెళ్తున్నారని ప్రత్యక్ష సాక్షుల రిపోర్ట్ గా చెబుతున్నారు. ఉత్తరాంధ్రతో పాటు గుంటూరు నెల్లూరు లాంటి ప్రాంతాల్లో వారానికి మించి అధిక ధరలకు అమ్మేలా అనుమతి తెచ్చుకోవడంతో హాల్ నిండినా నిండకపోయినా టాక్స్ మాత్రం పెరిగిన ధరకు చెల్లించాల్సి ఉంటుంది. దసరా సెలవులు కాబట్టి ఖచ్చితంగా భరిస్తారు అనే నమ్మకంతో ఇలా చేసినప్పటికీ బాహుబలి తరహాలో ఇది విజువల్ గ్రాండియర్ కాబట్టి ఎంత ఖర్చైనా సరే తెరమీద చూడాల్సిందే అన్న ఆత్రం అందరికి ఉండదు. ఆ ప్రభావమే ఇక్కడ పడుతోందని చెబుతున్నారు.

ఎలాగూ పది రోజులు అయ్యాక తగ్గిస్తారు కదా అప్పుడు చూద్దాంలే అనుకునే వాళ్లకు కొదవలేదు. కానీ మొదటి వారం ఉన్న ఉత్సాహం అప్పటికి కొంతమందిలో తగ్గడం కొత్త సినిమాల తాకిడి తదితర కారణాలు టికెట్ రేట్ తగ్గాక చూద్దాం అనుకున్న వాళ్ళందరిని థియేటర్ దాకా తెస్తుందన్న గ్యారెంటీ లేదు. పైగా ఎంత కాదన్నా యునానిమస్ గా పాజిటివ్ టాక్ పూర్తి స్థాయిలో రాకపోవడం సీమ ఫ్యాక్షన్ కు త్రివిక్రమ్ స్టైల్ ని జోడించడం తప్ప ఇందులో ఏముందన్న పెదవి విరుపులు కూడా సోషల్ మీడియాలో భారీగా ఉన్నాయి. లేని ఫ్యాక్షన్ ను ఇంతలా చూపించడం గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఈ లెక్కన టికెట్ ధరలు దిగివచ్చాక అరవింద సమేత వీర రాఘవ ఎంత రాబడతాడు అనే దాని మీద ఫైనల్ ఫిగర్స్ ఆధారపడనున్నాయి.