Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: బంతిపూల జానకి

By:  Tupaki Desk   |   26 Aug 2016 10:39 AM GMT
మూవీ రివ్యూ: బంతిపూల జానకి
X
చిత్రం: ‘బంతిపూల జానకి’

నటీనటులు: దీక్షా పంత్ - ధన్ రాజ్ - సుడిగాలి సుధీర్ - రఘు కారుమంచి - చమ్మక్ చంద్ర - షకలక శంకర్ - వేణు - రాకెట్ రాఘవ తదితరులు
సంగీతం: భోలే
ఛాయాగ్రహణం: బాబు
నిర్మాతలు: కల్యాణి - రమణి
కథ - మాటలు: శేఖర్ విఖ్యాత్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ప్రవీణ్ చందర్

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన కమెడియన్లనే ప్రధాన పాత్రధారులుగా తీసుకుని.. దీక్షా పంత్ కథానాయికగా కొత్త దర్శకుడు ప్రవీణ్ చందర్ రూపొందించిన సినిమా ‘బంతి పూల జానకి’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

జానకి (దీక్షా పంత్) ఓ హీరోయిన్. ఆమె నటించిన ‘బంతి పూల జానకి’ అనే సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు వస్తుంది. ఆమెను అభినందించి పార్టీ చేసుకోవడం కోసం ఆ సినిమాకు సంబంధించిన దర్శక నిర్మాతలు.. రచయిత.. హీరో తన ఇంటికి వస్తారు. ఐతే ఆ నలుగురికీ ఆమె మీద కన్నుంటుంది. వీరిలో హీరో పాత్రధారి అయిన ఆకాష్ (సుడిగాలి సుధీర్).. జానకితో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. తప్పించుకునే క్రమంలో జానకి తోసేయడంతో అతను చనిపోతాడు. ఆ హత్యను కప్పిపుచ్చడానికి తన స్నేహితుడైన శ్యామ్ (ధన్ రాజ్)తో కలిసి జానకి ఏం చేసింది.. మిగతా వాళ్లకు ఈ విషయం తెలిసిందా లేదా.. చివరికి ఏమైంది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఇంట్లో ఏం తోచనపుడు టీవీ పెట్టి కామెడీ ఛానెల్లో ఒకదాని తర్వాత ఒకటి సీన్ చూస్తూ.. మధ్యలో చిన్నా చితకా పనులేవో చేసుకుంటూ.. పక్కనోళ్లతో ముచ్చట్లు పెడుతూ.. గంటలు గంటలు ఏదో అలా టైం పాస్ చేసేస్తాం. అంత మాత్రాన థియేటరుకు వెళ్లినపుడు కూడా ఇలాగే కామెడీ సీన్లు పేర్చేసి.. నవ్వుకోండి.. టైంపాస్ చేసుకోండి అంటే ఎలా అనిపిస్తుంది? సినిమా అన్నాక అందులో ఓ కథ.. ఓ కథనం.. అర్థవంతమైన కొన్ని పాత్రలు.. లాజిక్ ఉన్న సన్నివేశాలు ఆశిస్తాం కదా. అలా కాకుండా ‘జబర్దస్త్’ కామెడీ షోలో ఉన్న కమెడియన్లందరినీ తెరమీదికి తెచ్చేసి.. వాళ్లతో నానా అల్లరి చేయించి.. ఓ పెద్ద సైజు స్కిట్ చూపించి.. నవ్వేసుకోండి.. పడి పడి దొర్లేసుకోండి.. అంటే ఏం చెబుతాం? ‘బంతిపూల జానకి’ పరిస్థితి ఇదే.

‘జబర్దస్త్’ షోలో ఒక్కో స్కిట్ పది పదిహేను నిమిషాలుంటుంది. ఒక స్కిట్లో ఉన్నోళ్లు ఇంకో స్కిట్లో కనిపించరు. కానీ ‘బంతి పూల జానకి’లో ఒకే ఒక్క స్కిట్ ఉంటుందన్నమాట. దాని నిడివి గంటన్నర. ఒక్క స్కిట్లోనే బోలెడంతమంది ఆర్టిస్టులుంటారు. అక్కడక్కడా పాటలు.. కొంచెం రొమాన్స్.. కొంచెం సెంటిమెంట్.. టచ్ కూడా ఉంటుంది. ఇక జబర్దస్త్ కమెడియన్లు చేసే అల్లరి.. వాళ్లు వేసే జోకులు.. డబుల్ మీనింగ్ డైలాగులు.. వెకిలిగా అనిపించే కొన్ని సన్నివేశాలు.. ఇవన్నీ కామనే. అంటే ‘జబర్దస్త్’ షోనే ‘సినిమాటిక్’ ఆకర్షణలతో వెండితెర మీద చూసుకునే అవకాశం ‘బంతిపూల జానకి’ కల్పిస్తుందన్నమాట.

ఒక సినిమాగా ‘బంతిపూల జానకి’ గురించి చెప్పడానికైతే ఏమీ లేదు. కథాకథనాల గురించి.. లాజిక్కుల గురించి మాట్లాడ్డం వృథా. ఇది సినిమా అని మరిచిపోయి.. జబర్దస్త్ కామెడీ షోనో.. జెమిని కామెడీ ఛానెలో చూస్తున్నాం అనుకుంటే బిట్లు బిట్లుగా కొన్ని సన్నివేశాల్ని.. జోకుల్ని ఎంజాయ్ చేయొచ్చు. నిజానికి ‘జబర్దస్త్’లో కనిపించేంత కామెడీ కూడా ఇందులో లేదు. బుల్లితెర మీద బాగానే నవ్వించే కమెడియన్లు కూడా తెరమీదికి వచ్చేసరికి ఏం చేయలేకపోయారు. ‘జబర్దస్త్’లో వచ్చే కొన్ని చీప్ కామెడీ స్కిట్ల కంటే కింది స్థాయికి వెళ్లి నవ్వించడానికి విశ్వప్రయత్నం చేశారు కానీ అవి ఫలితాన్నివ్వలేదు. నిడివి గంటన్నరే అయినా కూడా ‘బంతిపూల జానకి’ సహనానికి పరీక్ష పెడుతుంది. తెరమీద బోలెడంతమంది ఆర్టిస్టులున్నా నవ్వులు పండింది కొన్ని చోట్లే. కామెడీ పేరుతో నవ్వించే ప్రయత్నం పెద్దగా ఫలించకపోయినా.. ఇందులో ధన్ రాజ్-దీక్షా పంత్ ల ‘ప్రేమకథ’ మాత్రం భలే ‘కామెడీ’గా అనిపిస్తుంది.

నటీనటులు:

దీక్షా పంత్ ఇందులో జాతీయ అవార్డు గెలిచిన నటిగా కనిపించింది. ఇందుకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ‘అవార్డు’ నటి అనేసరికి బాగా ‘అతి’గా నటించేసింది. ఓవరాక్షన్ తట్టుకోలేం చాలా చోట్ల. ధన్ రాజ్ తన శైలికి భిన్నంగా సీరియస్ ప్రేమికుడిగా కనిపించాడు. అతడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. అందర్లోకి రఘు కారుమంచి తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ నవ్వించాడు. చమ్మక్ చంద్ర.. సుడిగాలి సుధీర్.. రాకెట్ రాఘవ.. వేణు.. వీళ్లంతా జబర్దస్త్ స్టయిల్లో చేయాల్సిందేదో చేశారు.

సాంకేతికవర్గం:

టెక్నీషియన్స్ ముద్ర కనిపించేంత విషయం సినిమాలో ఏం లేదు. భోలే పాటల్లో సినిమాకు సూటవ్వకుండా సాంగే ఒక మెలోడీ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. నేపథ్య సంగీతం ‘జబర్దస్త్’ స్టయిల్లోనే సాగుతుంది. సినిమాటోగ్రఫీ.. ఇతర సాంకేతిక విభాగాలూ అంతంతమాత్రమే. సినిమా అంతా ఒక ఇంట్లోనే తక్కువ సమయంలో.. తక్కువ ఖర్చుతో లాగించేశారు. ఇలాంటి కథాకథనాలతో సినిమాలో అంటే పెద్దగా కష్టపడాల్సిన పని కూడా ఉండదు. శేఖర్ విఖ్యాత్ రచన.. ప్రవీణ్ చందర్ దర్శకత్వం గురించి చెప్పడానికేమీ లేదు.

చివరగా: బంతిపూల జానకి.. విసిగించే ‘జబర్దస్త్’ స్కిట్

రేటింగ్- 1/5


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre