Begin typing your search above and press return to search.

సినిమా పేరు చెప్పి ఎలా మస్కా కొట్టారంటే..

By:  Tupaki Desk   |   28 July 2016 8:00 AM GMT
సినిమా పేరు చెప్పి ఎలా మస్కా కొట్టారంటే..
X
ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రకటన ఇవ్వడం.. ఇంటర్వ్యూలకు వచ్చినవాళ్లకు మాయ మాటలు చెప్పడం.. వాళ్లతో డబ్బులు కట్టించుకోవడం.. నమ్మకం కుదరడానికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం.. కొన్ని రోజుల తర్వాత బోర్డు తిప్పేసి వసూలైన డబ్బులతో ఉడాయించడం.. ఇలాంటి మస్కా వ్యవహారాలు చాలా విని ఉంటాం. ఐతే ఐటీ ఉద్యోగాల విషయంలోనే కాదు.. సినిమా అవకాశాల విషయంలోనూ ఇలాంటి మోసాలే జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాదులో ఇలాంటి మోసమే చోటు చేసుకుంది. తాను ఓ దర్శకుడినని చెప్పి.. తాను తీయబోయే సినిమాలో హీరో వేషాలిప్పిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు ఓ మోసగాడు. బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు చెబుతున్నదాని ప్రకారం నిజామాబాద్ జిల్లా బోధన్‌ కు చెందిన రాజేంద్రనాయక్ అలియాస్ డి.వి.సిద్దార్థ్ ఫిలింనగర్‌ లోని అపోలో రోడ్డులో ఓం సాయిరాం ప్రొడక్షన్స్ పేరుతో ఓ ఆఫీస్ తెరిచాడు. తన దర్శకత్వంలో ‘ప్రేమ+స్నేహం=సంగీతం’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నానని.. జూన్ 19న ప్రారంభోత్సవం అని.. ఇందులో నటించడానికి హీరోలు కావాలని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు. దీంతో కొందరు కుర్రాళ్లు ఆశపడ్డారు. ఐతే అతణ్ని కలిశాక సినిమా కోసం కొంత డబ్బులు పెట్టాల్సి ఉంటుందని చెప్పాడు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రావణ్‌ కుమార్‌ గౌడ్ తన అక్క పెళ్లి కోసం ఇంట్లో ఉంచిన రూ.4 లక్షలు తీసుకెళ్లి సిద్దార్థ్ కు ఇచ్చాడు. అదే ప్రాంతానికి రాజశేఖర్ రూ.70 వేలు - కిషోర్ రూ.30 వేలు.. ఇలా మరికొంతమంది యువకులు సిద్దార్థ్ కు డబ్బులు సమర్పించుకున్నారు. ఈ డబ్బులకు అతను బాండు కూడా రాసిచ్చారు. కానీ జూన్ 19 వచ్చినా సినిమా మొదలుపెట్టలేదు. వారం రోజుల కిందట ఆఫీస్ మూతపడింది. తాము మోసపోయామని ఈ కుర్రాళ్లకు అర్థమైంది. చివరికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.