Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'బందోబస్త్'

By:  Tupaki Desk   |   20 Sep 2019 3:35 PM GMT
మూవీ రివ్యూ: బందోబస్త్
X
చిత్రం : 'బందోబస్త్'

నటీనటులు: సూర్య-మోహన్ లాల్-సాయేషా సైగల్-ఆర్య-సముద్రఖని-బొమన్ ఇరానీ తదితరులు
సంగీతం: హ్యారిస్ జైరాజ్
ఛాయాగ్రహణం: అభినందన్ రామానుజం
రచన-కేవీ ఆనంద్-ప్రభాకర్
నిర్మాణం: సుభాస్కరన్
దర్శకత్వం: కేవీ ఆనంద్

తెలుగులో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్.. మార్కెట్ సంపాదించుకున్న తమిళ కథానాయకుడు సూర్య.. గత కొన్నేళ్లలో వరుస ఫ్లాపులతో వైభవం కోల్పోయాడు. ఇప్పుడతను ‘బందోబస్త్’ సినిమాతో వచ్చాడు. ఇంతకుముందు సూర్యతో ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్’ సినిమాలు తీసిన కేవీ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్ర చేయడం విశేషం. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బందోబస్త్’ సూర్య ఫ్లాపుల పరంపరకు తెరదించిందో లేదో చూద్దాం పదండి.

కథ:

రవి (సూర్య) ఇండియన్ మిలిటరీ తరఫున అండర్ కవర్ ఆపరేషన్లు చేసే ఆఫీసర్. అతడి ట్రాక్ రికార్డు గురించి తెలిసి ప్రధాని చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్).. తన సెక్యూరిటీ సిబ్బందిలో అతడిని చేర్చుకుంటాడు. ప్రధాని దగ్గరికి రావడానికి ముందే ఆయన్ని ఓసారి కాపాడిన రవి.. ఆ తర్వాత ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. కానీ రవి పక్కనుండగానే కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రధాని ప్రాణాలు కోల్పోతాడు. ఈ దారుణానికి పాల్పడిందెవరు.. వాళ్లను రవి ఎలా కనిపెట్టాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

బందోబ‌స్త్ సినిమా ఆరంభంలో హీరో సూర్య‌ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతుగా క‌నిపిస్తాడు. మ‌నిషి మ‌లంతో ఎరువును త‌యారు చేసి అధిక పంట దిగుబ‌డులు సాధిస్తున్న రైతుగా అత‌డి ఇంట్రో ఆక‌ట్టుకుంటుంది. కాస్త లోతుల్లోకి వెళ్లి ఈ వ్య‌వ‌హార‌మేదో చూద్దామ‌నుకుంటే.. ఇది ప‌క్క‌కు వెళ్లిపోయి అత‌ను సీక్రెట్ ఏజెంట్ అని బ‌య‌ట‌ప‌డుతుంది. త‌ర్వాత అత‌ను లండ‌న్ బ‌య‌ల్దేర‌తాడు. అక్క‌డ ఏకంగా మ‌న ప్ర‌ధానినే ప్రాణాపాయం నుంచి కాపాడ‌తాడు. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లా ఉందే.. దీని క‌థేంటో చూద్దామ‌నుకుంటే.. అక్క‌డి నుంచి క‌థ ఇంకో మ‌లుపు తిరుగుతుంది. ఉన్న‌ట్లుండి ఒక రొమాంటిక్ వ్య‌వ‌హారం ఊడిప‌డుతుంది. ఈ ముచ్చ‌టేలో చూద్దామ‌నుకుంటే.. అది సైడ్ అయిపోయి హీరో అప్ప‌టిదాకా చేస్తున్న ప‌నుల‌న్నీ మానేసి ప్ర‌ధానికి సెక్యూరిటీ ఆఫీస‌ర్ అయిపోతాడు. అవ‌తారం మార్చేస్తాడు. ఇవ‌న్నీ సినిమా ఆరంభ‌మైన 40 నిమిషాల్లో తిరిగే మ‌లుపులు. సినిమా అంతా అయ్యేస‌రికి ఇలాంటి యుట‌ర్న్స్ ఎన్నెన్నో.

ట్విస్టులంటే మంచిదే క‌దా.. థ్రిల్ల‌వుతారు అనుకోవ‌చ్చు. కానీ ఈ మ‌లుపులు ప్రేక్ష‌కుడిలో ఆస‌క్తిని పెంచ‌క‌పోగా.. చంపేస్తాయి. ఎన్నో విష‌యాలు చెప్పేయాల‌నుకుని.. దేన్నీ స‌రిగా డీల్ చేయ‌ని సినిమా బందోబ‌స్త్. సినిమా నేప‌థ్యం ఇప్ప‌టిదే కానీ.. ఎప్పుడో 90ల కాలంలో వ‌చ్చి దేశ‌భ‌క్తి సినిమాల్ని గుర్తు చేసే క‌థాక‌థ‌నాల‌తో మొద‌లైన కాసేప‌టికే ఆస‌క్తిని చంపేస్తుంది బందోబ‌స్త్. ద‌ర్శ‌కుడిగా కేవీ ఆనంద్ కెరీర్ మొద‌ట్నుంచి ప‌రిశీలిస్తే అత‌ను కొంచెం కొత్త‌గా ఉండే కాంప్లికేటెడ్ క‌థ‌ల్నే ఎంచుకుంటాడు. స్క్రీన్ ప్లే కూడా కొత్త‌గానే ఉంటుంది. ఉత్కంఠ‌భ‌రిత మ‌లుపుల‌తో క‌థ‌నాన్ని ప‌రుగులు పెట్టించ‌డం అత‌డి శైలి. ఐతే త‌న ద‌గ్గ‌రున్న ఐడియాల‌న్నీ వాడేసి ఖాళీ అయిపోయాడో ఏమో కానీ.. బందోబ‌స్త్ లో అత‌డి మార్కే పెద్ద‌గా క‌నిపించ‌దు. ఇందులో చూసిన చాలా అంశాలు ఇప్ప‌టికే చాలా సినిమాల్లో ఉన్న‌వే. సినిమాలో ర‌ర‌క‌రాల విష‌యాల్ని డీల్ చేసిన కేవీ ఆనంద్.. ఏ ఎపిసోడ్ నూ ఒక తీరుగా న‌డిపించ‌లేదు. ఒక ఎపిసోడ్ మీద కాస్త ఆస‌క్తి క‌ల‌గ‌గానే.. దాన్ని వ‌దిలేసి వేరే దాని మీదికి వెళ్లిపోయాడు. దీంతో ప్రేక్ష‌కుడు తీవ్ర అస‌హ‌నానికి గుర‌య్యే ప‌రిస్థితి వ‌స్తుంది. దీనికి తోడు అవ‌స‌రం లేని రొమాంటిక్ ట్రాక్.. పాట‌లు.. కామెడీ.. సెంటిమెంట్ అంటూ మ‌సాలాలు అద్దే ప్ర‌య‌త్నం చేయ‌డంతో బందోబ‌స్త్ పూర్తిగా నీరుగారిపోయింది.

సూర్య‌.. మోహ‌న్ లాల్ కాంబినేష‌న్ అంటే వాళ్ల పాత్ర‌లు.. క‌థ విష‌యంలో ఎన్నో అంచ‌నాలు పెట్టుకుంటాం. కానీ బందోబ‌స్త్ లో వీళ్లిద్ద‌రి పాత్ర‌లూ చాలా పేల‌వం. ముఖ్యంగా మోహ‌న్ లాల్ ఎందుకు ఈ సినిమా చేశాడా అని సందేహాలు క‌లుగుతాయి. సూర్య త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే అవ‌కాశ‌మే ర‌వి పాత్ర ఇవ్వ‌లేదు. ఇక‌ ఏదో చిన్న స్థాయి మంత్రి త‌ర‌హాలో ప్ర‌ధాని ఆఫీస్ - ఇల్లు - సెక్యూరిటీ వ్య‌వ‌హారాన్ని చూపించిన వైనం ద‌ర్శ‌కుడి స్థాయిని త‌గ్గించేస్తుంది. సూర్య‌ - మోహ‌న్ లాల్ లాంటి పెద్ద హీరోల‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ లాంటి పెద్ద బేన‌ర్ తీసిన‌ సినిమాలో ఇలాంటి సెట‌ప్ అస‌లు ఊహించ‌లేం. విల‌న్ పాత్ర‌ల్ని తేల్చి ప‌డేయ‌డం కూడా బందోబ‌స్త్ లో పెద్ద మైన‌స్. కాస్తో కూస్తో ప్ర‌థ‌మార్ధం ఓ మోస్త‌రుగా ఎంగేజ్ చేస్తుంది కానీ.. ద్వితీయార్దంలో సినిమా పూర్తిగా నీరుగారిపోయింది. ఇంత‌కుముందు సూర్య‌-కేవీ ఆనంద్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన బ్ర‌ద‌ర్స్ ఫ్లాప్ అయినా.. విష‌య ప‌రంగా దాని స్థాయి ఎంతో ఉన్న‌తం. అంత‌కుముందు ఇద్ద‌రూ క‌లిసి చేసిన వీడొక్క‌డే గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. బందోబ‌స్త్ వాటి ద‌రిదాపుల్లో కూడా ఉండ‌దు.

నటీనటులు:

సినిమా ఎలా ఉన్నా.. పాత్ర ఎలాంటిదైనా నటన పరంగా తన వరకు పూర్తి న్యాయం చేసే హీరో సూర్య. ‘బందోబస్త్’లో అతను దేశం కోసం ఏమైనా చేసే అధికారి పాత్రలో ఒదిగిపోయాడు. పాత్రకు తగ్గట్లుగా డిఫరెంట్ లుక్స్ లో కనిపించిన సూర్య.. ఎంతో ఎనర్జీ చూపించాడు. తన అభిమానుల్ని అలరించే విన్యాసాలు చేశాడు. కానీ నటుడిగా అతడికి పరీక్ష పెట్టే పాత్ర అయితే కాదిది. మోహన్ లాల్ విషయంలో నిరాశ తప్పదు. ఆయన ప్రత్యేక పాత్ర చేశాడంటే చాలా ఆశిస్తాం. ప్రధాని పాత్ర చేశాడు కానీ.. సినిమాలో దాని ఇంపాక్ట్ పెద్దగా లేదు. హీరోయిన్ సాయేషా సైగల్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. అందం, అభినయం సాధారణమే. సముద్రఖని ఆకట్టుకున్నాడు. బొమన్ ఇరానీ, ఆర్య బాగానే చేశారు.

సాంకేతికవర్గం:

హ్యారిస్ జైరాజ్ అసలేమాత్రం ఫాంలో లేడని మరోసారి రుజువైంది. పాటల్లో ఒక్కటీ క్యాచీగా లేవు. పాటలు సినిమాకు స్పీడ్ బ్రేకర్లలా తయారయ్యాయి. అవన్నీ తీసేస్తే సినిమాకు మేలు జరిగేది. హ్యారిస్ బ్యాగ్రౌండ్ స్కోర్లో కొత్తదనం లేదు. ‘రంగం’ సహా కొన్ని సినిమాల సౌండ్స్ వినిపిస్తాయి. అభినందన్ రామానుజం ఛాయాగ్రహణం ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. కేవీ ఆనంద్ సినిమాల్లో కెమెరామన్ ఎవరైనా ఆయన స్టయిల్ కనిపిస్తుంది. విజువల్స్ చాలా షేకీగా ఉంటాయి. ఇందులోనూ అలాగే జరిగింది. ఇక ద‌ర్శ‌కుడు కేవీ ఆనంద్ ద‌గ్గ‌ర ఐడియాల‌న్నీ అయిపోయాయేమో అనిపిస్తుంది బందోబ‌స్త్ చూస్తుంటే.. బ‌యో ఫార్మింగ్ వ్య‌వ‌హారం మిన‌హాయిస్తే సినిమాలో కొత్త‌గా అనిపించే పాయింటే లేదు. రైటింగ్ ద‌గ్గ‌రే సినిమా ఫెయిలైంది. త‌న టేకింగ్ తోనూ ఆనంద్ దాన్ని పైకి లేప‌లేక‌పోయాడు.

చివరగా: బందోబ‌స్త్.. విష‌యం త‌క్కువ హ‌డావుడి ఎక్కువ‌

రేటింగ్-1.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in The