Begin typing your search above and press return to search.

వినాయక్‌ కు బాలయ్య టాటా?

By:  Tupaki Desk   |   24 Jun 2018 5:48 AM GMT
వినాయక్‌ కు బాలయ్య టాటా?
X
‘ఖైదీ నంబర్ 150’తో పోయినేడాది భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు వి.వి.వినాయక్. కానీ ఏడాది తిరిగాక ‘ఇంటిలిజెంట్’ లాంటి పెద్ద డిజాస్టర్ ఆయన్ని పాతాళానికి పడేసింది. ‘ఖైదీ’ విజయంలో వినాయక్ కు దక్కిన క్రెడిటే చాలా తక్కువ అంటే.. దాన్ని కూడా ‘ఇంటిలిజెంట్’ ఫలితం తుడిచేసింది. ఈ సినిమాతో వినాయక్ కు వచ్చిన చెడ్డ పేరు అంతా ఇంతా కాదు. వినాయక్ తో సినిమా అంటేనే స్టార్ హీరోలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఓ మోస్తరు హీరోలు కూడా అతడితో సినిమా చేయడానికి ముందుకు రావట్లేదు. ఇలాంటి స్థితిలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వినాయక్ తో సినిమా ఓకే చేశాడు. ఎన్టీఆర్ బయోపిక్ అనుకోని కారణాలతో ఆలస్యమవుతుండటంతో.. ఎంత త్వరగా కథ తెస్తే అంత త్వరగా సినిమా మొదలుపెట్టడానికి బాలయ్య రెడీ అయ్యాడు. కానీ బాలయ్యను మెప్పించే కథను వినాయక్ రెడీ చేయలేకపోయాడు.

డెడ్ లైన్ దాటిపోయింది. కథ ఓకే కాలేదు. అటు చూస్తే క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ కోసం చకచకా ఏర్పాట్లు చేసేస్తున్నాడు. సంక్రాంతి రిలీజ్ డేట్ అందుకోవాలంటే వచ్చే నెలలోనే ఆ చిత్రాన్ని మొదలుపెట్టాలి. నిర్విరామంగా షూటింగ్ చేయాలి. ఆ సినిమా కోసం స్పెషల్ లుక్.. మేకప్ లో కనిపించాలి బాలయ్య. కాబట్టి మధ్యలో వేరే సినిమా వైపు చూడ్డానికి లేదు. దీంతో వినాయక్ సినిమా అవకాశాలు మసకబారిపోతున్నాయి. ఇక అతను ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు. పోనీ ఎన్టీఆర్ బయోపిక్ అయిపోయాక చూసుకుందాంలే అంటే.. అవతల బోయపాటి శ్రీను రెడీగా ఉన్నాడు. రామ్ చరణ్ సినిమాను సంక్రాంతికి రెడీ చేసి బాలయ్యతో వెంటనే సినిమా మొదలుపెట్టాలని అతను పట్టుదలతో ఉన్నాడు. బోయపాటిపై ఉన్న ప్రత్యేక అభిమానం దృష్ట్యా బాలయ్య కూడా కొత్త ఏడాదిలో అతడితోనే సినిమా చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో వినాయక్ సినిమా అటకెక్కేసినట్లే అంటున్నారు. బాలయ్యతో చేయాల్సిందే అనుకుంటే వెంటనే కథ రెడీ చేయాలి. లేదంటే వచ్చే ఏడాది ద్వితీయార్ధం వరకు వెయిట్ చేయాలి. మరి రెండో ఆప్షన్ చూసుకుందామనుకుంటే ఈలోపు వేరే హీరోతో ఒక సినిమా చేసుకోవాలి. కానీ వినాయక్ తో సినిమాకు ఎవరు రెడీగా ఉన్నారన్నది ప్రశ్న. ఒకప్పుడు హీరోల్ని క్యూలో నిలబెట్టిన దర్శకుడికి ఇలాంటి పరిస్థితి రావడం చిత్రమే.