బాలయ్య మాటః ఆయన లేకుంటే రైతు లేదు

Tue Jan 10 2017 18:42:39 GMT+0530 (IST)

గతంలో నయనతార నటించకుంటే ‘శ్రీరామరాజ్యం’ సినిమా చేసేవాడిని కాదన్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ మద్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా విషయంలో హేమమాలిని పాత్ర గురించి కూడా ఇలాగే అన్నాడు. ఇప్పుడు తాను చేయాల్సిన మరో ప్రతిష్టాత్మక చిత్రం గురించి కూడా ఇదే తరహాలో మాట్లాడుతున్నాడు బాలయ్య. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తర్వాత బాలయ్య తన 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ చేయాల్సిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా ముందుకు కదిలే అవకాశాలు కష్టంగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తే తప్ప ఈ సినిమా చేయనంటున్నాడు బాలయ్య.

ఆ మధ్య రామోజీ ఫిలిం సిటీలో సర్కార్-3 షూటింగ్ సందర్భంగా అమితాబ్ ను బాలయ్య - కృష్ణవంశీ కలవడం.. రైతు సినిమాలో కీలక పాత్ర కోసమే ఆ కలయిక అని మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. ఈ విషయాన్నే బాలయ్య ధ్రువీకరించాడు. అమితాబ్ ను ముఖ్య పాత్ర కోసం అడిగామన్నారు. ఐతే ఆయన ఈ పాత్ర చేయడానికి అంగీకరించింది లేనిదీ బాలయ్య చెప్పలేదు. ఐతే అమితాబ్ నటిస్తేనే ‘రైతు’ సినిమా ఉంటుందని.. లేకుంటే లేదని బాలయ్య స్పష్టం చేయడం విశేషం. ఇప్పటిదాకా తెలుగులో నటించని అమితాబ్ విషయంలో బాలయ్య ఇంత పట్టుదలగా ఉండటం ఏమిటో అర్థం కావడం లేదు. ఇంతకీ అమితాబ్.. బాలయ్యకు ఏం చెప్పారో ఏంటో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/