Begin typing your search above and press return to search.

బాలయ్య పాత్ర వెనుక అంత కథ ఉంది

By:  Tupaki Desk   |   18 April 2016 6:22 AM GMT
బాలయ్య పాత్ర వెనుక అంత కథ ఉంది
X
గౌతమీ పుత్ర శాతకర్ణి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతున్న పేరు. ఈ శాతవాహన రాజు చరిత్రను నందమూరి బాలకృష్ణ వందో సినిమా కథాంశంగా ఎంచుకోవడంతో ఆ చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు చాలామంది. ఐతే ఇంటర్నెట్లో ఎంత వెతికినా గౌతమీ పుత్ర శాతకర్ణి గురించి సమాచారం దొరకట్లేదు. ఐతే దర్శకుడు క్రిష్.. ఎంతో పరిశోధన జరిపి.. ఎన్నో గ్రంథాలు తిరగేసి.. చాలామంది చరిత్రకారుల్ని కలిసి.. గౌతమీ పుత్ర శాతకర్ణి గురించి చాలా విషయాలు తెలుసుకుని.. ఎంతో ఉద్వేగానికి లోనై ఈ సినిమాను పట్టాల మీదికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇంతకీ గౌతమీపుత్ర శాతకర్ణి ఎవరూ అంటే..

తెలుగు గడ్డను సుదీర్ఘ కాలం.. దాదాపు 500 ఏళ్లు పాలించిన శాతవాహన వంశానికి చెందినవాడే ఈ గౌతమీ పుత్ర శాతకర్ణి. శాతవాహనులు కాకతీయుల కంటే ముందు తెలుగు రాజ్యాన్ని పాలించారు. గొప్ప పరిపాలనతో తెలుగు ప్రజలకు సుఖసంతోషాలు పంచినప్పటికీ.. వీరి తర్వాత వచ్చిన కాకతీయులు ఆ గొప్పదనం గురించి తర్వాతి తరాలకు తెలియకుండా చేశారంటారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర.. ఒరిస్సా.. తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు శాతవాహనుల రాజ్యంలో భాగాలుగా ఉండేవి. వీటిన్నంటినీ కలిపి పరిపాలించాడు శాతకర్ణి. శాతవాహన కాలంలో మొత్తం 30 మంది రాజులు తెలుగు రాజ్యాన్ని పరిపాలించగా.. అందులో శాతకర్ణి 23వ వాడు. మొత్తం 30 మందిలోనూ అత్యుత్తమం అనిపించుకున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలనలో ఎదురైన అనేక సవాళ్లను ఛేదించి.. శాతవాహనుల ఆధిపత్యాన్ని దేశం మొత్తానికి చాటి చెప్పి.. గొప్ప పరిపాలనతో ప్రజలు సుఖ సంతోషాలు అందించాడని చరిత్ర చెబుతోంది. గౌతమీపుత్ర శాతకర్ణి జీవితంలో ఎన్నో ముఖ్య ఘట్టాలున్నప్పటికీ.. వాటన్నింటినీ రెండున్నర మూడు గంటల సినిమాలో చూపించడం అంత సులువైన విషయం కాదు. అంతే కాక వందల ఏళ్ల కిందటి పరిస్థితుల్ని ప్రతిబింబించేలా సినిమా తీయడమూ సవాలే. మరి క్రిష్ ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడు.. బాలయ్య ఈ పాత్రను ఎలా పోషిస్తాడు అన్నది ఆసక్తికరం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రి ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. మేలో షూటింగ్ మొదలయ్యే అవకాశముంది.