Begin typing your search above and press return to search.

అబ్బాయ్ కి దూరంగా బాబాయ్

By:  Tupaki Desk   |   6 Oct 2015 12:02 PM GMT
అబ్బాయ్ కి దూరంగా బాబాయ్
X
టాలీవుడ్ లో కొన్నేళ్లుగా నడుస్తున్న వ్యవహారమే ఇది. సంక్రాంతి - సమ్మర్ - దసరా లాంటి భారీ సీజన్ లకు ముందు చాలా సినిమాలు రేసులో నిలుస్తాయి. కానీ చివరికి ఒకటో రెండో మాత్రమే విడుదలవుతాయి. పోయిన సంక్రాంతికి అవీ ఇవీ అనుకుని.. చివరికి ‘గోపాల గోపాల’ మాత్రమే విడుదలైంది. రాబోయే సంక్రాంతికి మొన్నటిదాకా నాలుగు సినిమాల పేర్లు వినిపించాయి. నాన్నకు ప్రేమతో - డిక్టేటర్ - సర్దార్ - అ..ఆ సినిమాలు సంక్రాంతికే వస్తాయని అన్నారు. కానీ చివరికి ఈ నాలుగు సినిమాల్లో ఒక్కొక్కటి సైడైపోయి చివరికి ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ మాత్రమే సంక్రాంతి రేసులో నిలిచేలా కనిపిస్తోంది.

సర్దార్ - అ..ఆ సినిమాలు ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్నాయి. దీంతో బాబాయ్-అబ్బాయ్ మధ్య రసవత్తర పోరు ఖాయమని అంతా అనుకున్నారు. తీరా చూస్తే బాబాయ్ టాటా చెప్పేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘డిక్టేటర్’ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు లేవన్నది తాజా సమాచారం. ఈ సినిమా షూటింగ్ కొంచెం ఆలస్యమయ్యేలా ఉండటంతో హడావుడి ఎందుకని చెప్పి ఫిబ్రవరికి సినిమాను వాయిదా వేయడం గురించి ఆలోచిస్తున్నాడట డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ శ్రీవాస్. అదే జరిగితే బాలయ్య అభిమానులకు తీవ్ర నిరాశే. బాలయ్యకు సంక్రాంతికి భారీ హిట్లు ఇచ్చిన రికార్డుంది. డిక్టేటర్ లాంటి భారీ అంచనాలున్న సినిమా సంక్రాంతికి వస్తేనే అందం. పైగా ఎన్టీఆర్ - బాలయ్యల మధ్య పోటీ అంటే బాక్సాఫీస్ వేడెక్కడం ఖాయం. కానీ ఇప్పుడు డిక్టేటర్ వాయిదా అంటుండటంతో ఉత్సాహం నీరుగారిపోతోంది. కనీసం ‘నాన్నకు ప్రేమతో’ అయినా సంక్రాంతికి పక్కానా లేదా అన్నదే డౌటిప్పుడు