Begin typing your search above and press return to search.

అల్లుడి కోసం మెగాస్టార్ అండ్ బాలయ్య

By:  Tupaki Desk   |   22 Jun 2018 10:18 AM GMT
అల్లుడి కోసం మెగాస్టార్ అండ్ బాలయ్య
X
మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో హీరో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు. చిన్నల్లుడికి మొదటి నుంచి చిరు నుంచి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. 80ల నాటి తన హిట్ సినిమా టైటిల్ ఇచ్చాడు. కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా నిర్మాణ బాధ్యత వారాహి చలనచిత్రం లాంటి పేరున్న బ్యానర్ తీసుకోవడం వెనుకా చిరుయే ఉన్నాడు.

కళ్యాణ్ దేవ్ నటించిన విజేత ప్రీ రిలీజ్ ఫంక్షన్ జూన్ 24న జరగనుంది. ఈ ఫంక్షన్ కు మెగాస్టార్ వస్తాడనే విషయం ఎప్పుడో కన్ఫర్మ్ అయింది. అభిమానులకు ఉత్సాహం కలిగించే ఇంకో విషయం ఏమిటంటే ఈ ఫంక్షన్ కు మరో స్టార్ హీరో రాబోతున్నాడు. నట సింహం నందమూరి బాలకృష్ణ ఈ ఫంక్షన్ కు రావడానికి ఓకే చెప్పారనేది లేటెస్ట్ న్యూస్. చిరంజీవి - బాలకృష్ణ ఇద్దరినీ ఒకే స్టేజ్ పై చూడటమంటే ఇద్దరి అభిమానుల్లోనూ అది మరింత జోష్ నింపుతుందని చెప్పక తప్పదు.

విజేత సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తండ్రీ కొడుకుల అనుబంధం బేస్ చేసుకుని ఈ సినిమా కథ సాగుతుంది. ఫ్యామిలీ ప్రేక్షకులను నచ్చేలా ఈ మూవీ ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. కొత్త దర్శకుడు రాకేష్ శశి డైరెక్ట్ చేసిన విజేత మూవీలో ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది.