Begin typing your search above and press return to search.

హరికృష్ణ ఇప్పుడే గుర్తుకొచ్చాడా బాలయ్యా?

By:  Tupaki Desk   |   22 Oct 2018 11:01 AM GMT
హరికృష్ణ ఇప్పుడే గుర్తుకొచ్చాడా బాలయ్యా?
X
నందమూరి హరికృష్ణ హఠాన్మరణం నేపథ్యంలో నందమూరి కుటుంబంలో సమీకరణాలు మారాయి. చాలా ఏళ్లుగా జూనియర్ ఎన్టీఆర్‌ ను దూరం పెట్టిన బాలకృష్ణ.. అన్న మరణించిన సమయంలో అతడితో సన్నిహితంగా మెలిగాడు. తాజాగా ‘అరవింద సమేత’ విజయోత్సవ వేడుకకు వచ్చాడు. వేదిక ఎక్కి సుదీర్ఘంగా ప్రసంగించాడు. కానీ 18 నిమిషాల పాటు మాట్లాడిన ఆయన చిత్ర బృందంలో అందరి గురించీ వివరంగా మాట్లాడి.. ఒక్కొక్కరిని ప్రత్యేకంగా అభినందించి.. ఎన్టీఆర్ ప్రస్తావన మాత్రం నామమాత్రంగా తేవడం.. కొన్ని సెకన్లకు మించి అతడి గురించి మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది. ముందు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. బాలయ్యను తన తండ్రి స్థానంలో నిలబెట్టాడు. ఆయనకు గొప్ప గౌరవాన్నిచ్చాడు. కానీ బాలయ్య మాత్రం ఎన్టీఆర్ గురించి మాట్లాడటం ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరించాడు.

కానీ హరికృష్ణ గురించి మాత్రం బాలయ్య గొప్పగానే మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నాడు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి ప్రచారానికి వెళ్లినపుడు చైతన్య రథానికి సారథిగా ఉన్న విషయాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేశాడు. రవాణా శాఖ మంత్రిగా హరికృష్ణ తీసుకున్న మంచి నిర్ణయాల్ని కొనియాడాడు. గత కొన్నేళ్లుగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గానికి చేయూత అందించిన విషయాన్ని కూడా కొనియాడాడు. కానీ హరికృష్ణ చనిపోయాక ఆయన్ని ఇంతలా పొగిడేసిన బాలయ్య.. ఆయన బతికుండగా ఎలా వ్యవహరించాడో అందరికీ తెలిసిందే. పార్టీలో హరికృష్ణ ప్రాధాన్యాన్ని బాబు పూర్తిగా తగ్గించేసి ఆయన్ని అవమానాలకు గురి చేస్తే బాలయ్య సైలెంటుగా ఉన్నాడు. ఎన్నడూ అన్న గురించి పాజిటివ్ గా ఒక్క మాట మాట్లాడింది లేదు. అసలు అన్న ప్రస్తావనే తెచ్చింది లేదు. ఇప్పుడు మాత్రం ఆయన గురించి ప్రస్తావిస్తూ... ఒక సినిమా వేడుకలో తెలుగుదేశం పార్టీని హైలైట్ చేయడానికి ప్రయత్నించాడు. హరికృష్ణ గురించి బాలయ్య మాట్లాడిందంతా రాజకీయాల కోణంలోనే కావడం గమనార్హం. వ్యక్తిగత విషయాలేవీ మాట్లాడలేదు. ఒక రకంగా బాలయ్య ఒక ఫక్తు రాజకీయ నాయకుడిగా మారి.. హరికృష్ణ విషయంలో సెంటిమెంటును వాడుకునే ప్రయత్నం చేశాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా చంద్రబాబు స్కెచ్ లో భాగమే అని కూడా అంటున్నారు.