ఆడది అవసరం కాదు- బాలయ్య

Sun Oct 21 2018 22:08:14 GMT+0530 (IST)

అరవింద సమేత సక్సెస్ వేదిక ఆద్యంతం హరికృష్ణ నామస్మరణతో హోరెత్తింది. నందమూరి హరికృష్ణ జోహార్.. ఎన్టీఆర్ జోహార్ అంటూ నందమూరి హీరోలు బాలయ్య - ఎన్టీఆర్ - కల్యాణ్ రామ్ ఫ్యాన్స్ లో స్ఫూర్తి రగిలించారు. ఇదే వేదికపై ఎన్టీఆర్ సినిమా విజయాన్ని కీర్తించిన బాలయ్య హరికృష్ణతో తన అనుబంధాన్ని అన్నయ్యలోని ధీరత్వాన్ని గుర్తు చేసుకున్నారు.ముక్కుసూటి తత్వం ఉన్న అన్నయ్య ప్రజా శ్రేయస్సు కోసం ఆవిర్భవించిన తెలుగు దేశం పార్టీ కి వెన్నంటి నిలిచారు. చైతన్య రథ సారథి .. నా అన్నయ్య నందమూరి హరికృష్ణ జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడం నా హృదయాన్ని ధ్రవీభవింపజేసింది... అని బాలయ్య బాధను వ్యక్తం చేశారు. లాభనష్టాలు చూడకుండా తాను అనుకున్నదాని కోసం ముక్కుసూటిగా వెళ్లేవాడు అన్నయ్య. ఆయన ఒక మొరటు మనిషి.. మనసు వెన్న. కరిగిపోయే తత్వం ఉన్నవాడు. అవన్నీ ఆయనలో ఉన్న గొప్ప అలంకారం.. నాన్న గారు తెలుగు దేశం పార్టీ పెట్టిన తొలిరోజుల్లో పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటూ తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రంలో ఒక వికాసాన్ని ప్రవహింపజేసి చైతన్య రథసారథి అయ్యాడు. అందుకే ఈ సభాముఖంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నా. నాన్నగారి మరణానంతరం హిందూపురంలో రికార్డు ఓట్లతో గెలిచినవాడు అన్నయ్య. ఎమ్మెల్యే అయ్యాక రైతుల కోసం ఎంతో చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉపాధి కల్పించారు. పార్టీ తరపున బోలెడంత కృషి చేశారు... అనీ గుర్తు చేసుకున్నారు.

అరవింద సమేత ఘనవిజయం సాధించడానికి కారకులైన ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు బాలయ్య. అంతేకాదు తెలుగు భాష గొప్పతనాన్ని చెబుతూనే మహిళల గొప్పతనంపై తీసిన ఈ సినిమా గొప్పది అని ప్రశంసించారు. ఆడది అవసరం కాదు.. ఎవడైనా అమ్మ కడుపు నుంచే పుట్టాలి! అనేది నా సినిమా లెజెండ్ లోనే ఓ డైలాగ్ ను నా చేత చెప్పించారు.. అనీ బాలయ్య తెలిపారు. అరవింద సమేత చిత్రాన్ని నాయికా ప్రాధాన్యతతో తీసిన త్రివిక్రమ్ గొప్పతనాన్ని కీర్తించారు. చారిత్రక పౌరాణికాలంటే నందమూరి వంశం పెట్టింది పేరు. ఒక స్త్రీ పేరుతో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో నటించాను. స్త్రీలను గౌరవించే సంప్రదాయం మనది.. అనీ బాలయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాలయ్య స్పీచ్ ఆద్యంతం తారక్ బాబాయ్ వెంటే ఉండడం విశేషం.