పైసా వసూల్ మొదలెట్టిన బాలయ్య

Sat Aug 12 2017 13:09:31 GMT+0530 (IST)

బాలయ్య పైసా వసూల్ వసూళ్లు అప్పుడే మొదలైయ్యాయి - పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 1కి విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బాలకృష్ణ 101వ సినిమాగా వస్తున్న పైసా వసూల్ ను తనదైన శైలిలో సూపర్ ఫాస్ట్ గా కానిచ్చేశాడు పూరీ జగన్నాథ్. అయితే బాలయ్య కూడా అంతే జోరు మీదున్నాడు. పైసా వసూల్ షూటింగ్ పూర్తి అవ్వగానే తన 102వ సినిమా షూటింగ్ మొదలుపెట్టేశాడు. ఆ సినిమా ఓపెనింగ్ కు కావాల్సినంత ప్రచారం కూడా దొరికింది.

ఇక పైసా వసూల్ విషయానికొస్తే పూరీ - బాలయ్య కాంబినేషన్ ఫస్ట్ టైమ్ కావడంతో ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏషియన్ సినిమాస్ వారు ఈ సినిమా నైజాం రైట్స్ ను దాదాపు 7 కోట్లకి దక్కించుకున్నట్లు తెలిసింది. అలానే బాలయ్య కలెక్షన్స్ కు కంచుకోటగా భావించే సీడెడ్ ఏరియాలో ఈ సినిమాను ఓ ప్రముఖ డిస్ట్రీబ్యూటర్ ఏడున్నర కోట్లకి కొనుగోలు చేసినట్లు సమాచారం. అలానే ఆంధ్రా - కర్ణాటక - ఓవర్ సీస్ తదితర ఏరియాల్లో కూడా ఈ సినిమా ఫ్యాన్సీ రేట్లు పలుకుతున్నాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే మరోవైపున డబ్బులు పెడుతున్న వారిలో కూడా కాస్త టెన్షన్ ఉందట దానికి కారణం పూరీ ఇప్పుడు పెద్దగా ఫామ్ లో లేకపోవడం అని అంటున్నారు. సహజంగా హీరో డైరెక్టర్ మార్కెట్ కి మించి సినిమాను కొనుగోలు చేసిన వారిలో ఈ భయం కాస్త ఎక్కువుగానే ఉందని తెలిసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతానికి రిలీజ్ ముందే నిర్మాతకి లాభాలు తెచ్చిపెడుతున్న పైసావసూల్ రిలీజ్ తరువాత పంపిణిదారుల్ని కూడా సేవ్ చేస్తుందేమో చూడాలి.