హడావిడి ఎందుకు బాలయ్య

Mon Jun 18 2018 11:56:00 GMT+0530 (IST)

వరుసగా వేగంగా సినిమాలు చేయటంలో అందరికంటే ముందున్న సీనియర్ హీరోల్లో బాలకృష్ణదే ఫస్ట్ ప్లేస్. ఈ ఏడాది సంక్రాంతికి జైసింహతో ఆల్రెడీ బోణీ కొట్టేసిన బాలయ్య దర్శకుడు  వివి వినాయక్ తో సి కళ్యాణ్ నిర్మాణంలో కొత్త సినిమాకు గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. కానీ షూటింగ్ మాత్రం ఇప్పటికీ మొదలుకాలేదు. కానీ విడుదల మాత్రం దసరా లేదా దీపావళికి ఉంటుంది అనేలా టాక్ బయటికి తేవడం చూస్తే ఆలు లేదు చూలు లేదు అనే సామెత గుర్తుకురాక మానదు. నిజానికి పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ కూడా సిద్ధం కాలేదని వినికిడి. కన్నడ హిట్ మూవీ మఫ్టీకి రీమేక్ గా ఇది తీస్తున్నారు అనే వార్త గతంలోనే ప్రచారంలోకి వచ్చింది. కానీ దాన్ని ధృవీకరిస్తూ వినాయక్ కానీ నిర్మాత కళ్యాణ్ కానీ ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ అది నిజమనుకుంటే అందులో మరో హీరో కూడా ఉండాలి. కన్నడ వెర్షన్ లో శివ రాజ్ కుమార్ తో పాటు యూత్ స్టార్ మురళి సమాన ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసాడు. ఇప్పుడు మఫ్టీ రీమేక్ కనక నిజమైతే బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టు సవాల్ విసిరే యువ హీరోని తీసుకోవడం వినాయక్ కు సవాలే. నారా రోహిత్ అని ఒక లీక్ బయటికి వచ్చింది కానీ  ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనే దాని మీద ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని టాక్.మరి ఇంత  సందిగ్ధం ఉన్నప్పుడు సినిమా విడుదల గురించి అప్పుడే మాట్లాడ్డం విడ్డూరమే. ఎలాగైనా జైసింహతో మరో సినిమా ఈ ఏడాది ఉండాలని  బాలకృష్ణ గట్టిగా డిసైడ్ చేసుకోవడం వల్లే నిర్మాత  కళ్యాణ్ కూడా తొందరపడుతున్నాడని కనిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ వచ్చే సంక్రాంతి సందర్బంగా జనవరి 9 లేదా 10న విడుదల చేసేలా ప్రణాళిక రెడీ కావడంతో వినాయక్ సినిమా ఎంత లేదన్నా దానికి మూడు నెలల ముందు రావడం చాలా అవసరం. మరి అంత డెడ్ లైన్ పెట్టుకుని సినిమా చేస్తే క్వాలిటీ విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది. అసలే ఇంటెలిజెంట్ ఇచ్చిన షాక్ నిర్మాత కళ్యాణ్ కు ఇంకా కోలుకునేలా చేయలేదు. మళ్ళి అదే వినాయక్ తో సినిమా చేస్తున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండటం అవసరం. టైటిల్ కూడా అనుకోకుండానే ఇలా ఆఫీస్ లో విడుదల తేదీల గురించి తీర్మానం చేయటం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రచారంలోకి వచ్చిన AK 47 టైటిల్ బాలయ్య కోసం కాదని నిర్మాత కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేసిన నేపథ్యంలో ఈ అయోమయం తొలగి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు.