బాలయ్య సినిమా... శతదినోత్సవ వేడుకలట

Tue Apr 17 2018 18:04:07 GMT+0530 (IST)

ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరో దారి అని సామెత. ఇంకా ఇప్పుడు శతదినోత్సవాలు - సిల్వర్ జూబ్లీలు ఎక్కడ ఉన్నాయి. వారం పదిరోజులు లేదా నెల రోజుల్లోనే ఖర్చుపెట్టినదాని కన్నా రెట్టింపు పిండేసుకోవడం... థియేటర్‌లో నుంచి సినిమా వెళ్లిపోవడం జరిగిపోతుంటాయ్. కానీ బాలయ్య ఇంకా శతదినోత్సవ రోజుల్లోనే ఉండిపోయాడు. ఈ సంక్రాంతికి విడుదలైన జై సింహా శతదినోత్సవ వేడుకలు త్వరలో చేయబోతున్నారట.జైసింహా ఎక్కడ ఆడినా ఆడకపోయినా చిలకలూరి పేట ఎమ్మిగనూరులోని  థియేటర్లలో మాత్రం ఆడేస్తుంది. ఆడేస్తుంది అనే కన్నా ఆడించేస్తారు అనడం సరైనదేమో. ఎందుకంటే ధియేటర్లో మనుషులున్నా లేకపోయినా రోజూ షోలు మాత్రం పడిపోయేవని టాక్. అలా వందరోజులు ఆడేసిందని గుసగుసలు. ఇప్పుడు ఆ చిత్ర నిర్మాత సి కళ్యాణ్ త్వరలో శతిదినోత్సవ వేడుకలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. దీనికి బాలయ్య కూడా హాజరవుతాడట. బాలయ్య సినిమా అంటే చాలు కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు - గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేటలోని థియేటర్లో వందల రోజులు బాలయ్య బొమ్మే పడుతుంది. ఎమ్మిగనూరులో లెజెండ్ 500 రోజులు ఆడిన రికార్డు ఉంది.

బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సినిమాలు వంద రోజులు ఆడిన దాఖలాలు లేవు. బాలయ్య సినిమా అందులోనూ జై సింహా సినిమా వందరోజులనగానే సినీ జనాలు ముసిముసిగా నవ్వేస్తున్నారు. బిగ్గరగా నవ్వితే బాలయ్యకు కోపం వస్తుందేమోని వారికి భయం. ఒకవేళ జెన్యూన్ గా సినిమా ఆడినా ... ఈ రోజుల్లో ఇంకా శతదినోత్సవ వేడుకలేంటీ...?  కాస్త అప్ డేట్ అవ్వాలి కదా అని సలహాలిచ్చే వాళ్లు ఉన్నారు. ఏది ఏమైనా ఈ నెల 21కి జై సింహా విడుదలై 100 రోజులు పూ ర్తి చేసుకోబోతోంది.... శతదినోత్సవ వేడుకలు జరగబోతున్నాయ్.