హిందూపూర్ లో బాలయ్య ఫ్యాన్స్ హంగామా!

Wed Jan 11 2017 17:04:23 GMT+0530 (IST)


అసలే సంక్రాంతి.. ఆపై బాలయ్య సినిమా.. అది కూడా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్.. 100వ సినిమా.. ఇన్ని సందర్భాలు ఒకేసారి రావడంతో బాలకృష్ణ అభిమానులు సంబరాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారనే చెప్పాలి. సంక్రాంతి సందర్భంగా ఎప్పుడు బాలయ్య సినిమా విడుదలయినా అది కచ్చితంగా అభిమానులను అలరిస్తుందనే సెంటిమెంట్ కూడా ఉండటంతో గౌతమిపుత్ర శాతకర్ణిపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. దీంతో ఇప్పటికే పలుచోట్ల ర్యాలీలు హడావిడిలు మొదలైపోగా థియేటర్ల వద్ద హడావిడి విషయంలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన హిందూపురంలోని ఒక థియేటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

బాలకృష్ణ-శ్రేయ జంటగా నటించిన శాతకర్ణి గురువారం రాబోతోండటంతో హిందూపురంలోని ఓ థియేటర్ ని బాలయ్య అభిమానులు అత్యంత సుందరంగా అలంకరించారు. థియేటర్ చుట్టు దండలు - మెరుపులు - రకరకాల స్టిల్స్ తో బాలయ్య - నందమూరి తారకరామారావు కటౌట్లతో ఒకవిధంగా చెప్పాలంటే పెళ్లి పందిరిలా ఆ థియేటర్ ని ముస్తాబు చేశారు. ఇదే క్రమంలో నెల్లూరు - చిత్తూరు - కర్నూలు జిల్లాల్లో అయితే బాలయ్య ఫ్యాన్స్ భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు.

ఈ హడావిడి ఇలా ఉంటే మరోవైపు అమరావతి చరిత్రను తెరకెక్కిస్తున్నామంటూ పబ్లిసిటీ ఇచ్చినంత మాత్రాన "గౌతమీపుత్ర శాతకర్ణి"కి వినోద పన్ను మినహాయింపుని ఎలా ఇస్తారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమా అవుట్ ఫుట్ మీద కనీస అవగాహన లేకుండా పన్ను రద్దు చేయడం అనేది ఆశ్రిత పక్షపాతం కిందకే వస్తుందని ఫిర్యాదీ చెబుతున్నారు. కాగా రుద్రమదేవి మూవీ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ గుణశేఖర్ ఈ విషయంపై ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/