Begin typing your search above and press return to search.

మళ్ళీ అభిమాని చెంప చెళ్లుమ‌నిపించిన బాల‌య్య‌

By:  Tupaki Desk   |   17 Aug 2017 6:06 AM GMT
మళ్ళీ అభిమాని చెంప చెళ్లుమ‌నిపించిన బాల‌య్య‌
X
వివాదానికి కేంద్రంగా నిలిచారు ప్ర‌ముఖ సినీన‌టులు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వియ్యంకుడు క‌మ్ ఎమ్మెల్యే అయిన నంద‌మూరి బాల‌కృష్ణ‌. తాజాగా త‌న ద‌గ్గ‌ర‌కు అభిమానంతో వ‌చ్చిన ఒక అభిమాని చెంప చెళ్లుమ‌నిపించిన వైనం అక్క‌డి వారిని షాక్‌కు గురి చేసింది. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ చేయి చేసుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న బాల‌య్య గ‌డిచిన ఏడు నెల‌ల వ్య‌వ‌ధిలో దాదాపు మూడు సంద‌ర్భాల్లో చేయి చేసుకోవ‌టం వీడియోల రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఓప‌క్క నంద్యాల ఉప ఎన్నిక‌ల వేళ‌.. పోటాపోటీగా సాగుతున్న వేళ‌.. ఆగ్ర‌హంతో అభిమానిపై చేయి చేసుకున్న తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతం వివ‌రాల్లోకి వెళితే..

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయ‌టానికి నంద్యాల వ‌చ్చారు బాల‌య్య‌. రాత్రి పూట బ‌స కోసం ఆయ‌న‌కు నంద్యాల‌లోని ఒక లాడ్జిలో బ‌స ఏర్పాటు చేశారు. త‌మ అభిమాన హీరోకు పూల‌దండ వేసి ఫోటో దిగాల‌ని ఒక టీడీపీ కార్య‌క‌ర్త ఉత్సాహంగా ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లారు. ఏమైందో ఏమో కానీ త‌న‌కు మ‌రీ అంత ద‌గ్గ‌ర‌గా రావ‌టంపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన బాల‌య్య‌.. స‌ద‌రు అభిమాని చెంప చెళ్లుమ‌నించారు.

ఊహించ‌ని ఈ ప‌రిణామానికి స‌ద‌రు అభిమాని షాక్ తిన్నాడు. అక్క‌డే ఉన్న ఇత‌ర నేత‌ల నోటి నుంచి మాట రాక అవాక్కు అయిన ప‌రిస్థితి. ఈ ఉదంతాన్ని వీడియో తీసిన ఒక‌రు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టంతో ఇది కాస్తా వైర‌ల్ అయ్యింది. పోటాపోటీగా సాగుతున్న ఎన్నిక‌ల వేళ‌లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న టీడీపీ వ‌ర్గాలను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ మ‌ధ్య‌నే షూటింగ్ సంద‌ర్భంగా త‌న అసిస్టెంట్‌ను చేయి చేసుకున్న దృశ్యం.. ఆ మ‌ధ్య‌న గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా రిలీజ్ సంద‌ర్భంగా అభిమానంతో త‌నకు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన అభిమానిపైనా బాల‌య్య చేయి చేసుకున్న‌ట్లుగా ఆరోప‌న‌లు ఉన్నాయి. దీనికి సాక్ష్యంగా వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌డావుడి చేస్తున్నాయి.