ట్రెండింగ్: నందమూరి అలయెన్స్?

Sun Oct 21 2018 10:06:20 GMT+0530 (IST)

కాలం మార్పు కోరుతుంది. ఆ మార్పు ఇప్పుడు అన్నిచోట్లా స్పష్టంగా కనిపిస్తోంది. కుటుంబాల్లో కలతలు తగ్గి మంచి వైపు పయనం సాగుతోంది. ప్రస్తుతం నందమూరి హీరోలంతా ఏకమవుతున్నారంటే అది దేనికి సూచిక? అంటూ అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ కలయికకు `అరవింద సమేత వీర రాఘవ` సక్సెస్ వేదిక ఆలంబన కానుంది. ఈ వేదికపై ఓ స్పెషల్ గెస్ట్ సందడి చేయబోతున్నారు. ఆ గెస్ట్ మరెవరో కాదు.. నటసింహా నందమూరి బాలకృష్ణ. బాలయ్య - ఎన్టీఆర్ - కల్యాణ్ రామ్ త్రయం ఒకే వేదికపై ఒకే ఫ్రేమ్ లో కనిపించి అభిమానులకు కన్నుల పండుగ చేయబోతున్నారు.ఈ దృశ్యం ఎంతకాలానికి సాధ్యపడుతోంది? అంటే దాదాపు 8ఏళ్ల సమయం పట్టిందని నందమూరి ఫ్యాన్స్ లెక్కలు కడుతున్నారు. అప్పట్లో `సింహా` సక్సెస్ వేదికపై బాబాయ్ పక్కనే ఎన్టీఆర్ కనిపించారు. ఆ తర్వాత ఇరువురి మధ్యా సఖ్యత చెడిందని ప్రచారమైంది. ఎన్నికలు - రాజకీయాలు కుటుంబాల మధ్య కలతలకు కారణమయ్యాయని ఒకటే ప్రచారం సాగింది. బాబాయ్ అంటే అబ్బాయ్ లకు విపరీతమైన అభిమానం ఉన్నా ఆ ప్రచారం జనాల్లోకి వెళ్లిపోయింది.

ఏదైతేనేం.. కాలంతో పాటే మార్పు. ప్రస్తుతం బాబాయ్ కోసం అబ్బాయ్ కల్యాణ్ రామ్ `ఎన్టీఆర్` బయోపిక్ లో కీలక పాత్రలో నటిస్తున్నారు. కీ.శే.హరికృష్ణగా అభినయిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్- హరికృష్ణ సన్నివేశాల్ని చిత్రీకరించారు.  అన్న మరణానంతరం బాలయ్య మైండ్ సెట్ లో అనూహ్య మార్పు కనిపిస్తోందనడానికి ఇదే నిదర్శనం. నేటి సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికపై బాబాయ్- అబ్బాయ్ లను ఒకే ఫ్రేమ్ లో వీక్షించే భాగ్యం నందమూరి అభిమానులకు కలిగిందంటే కారణమదే. ఇది అరుదైన సందర్భం. అందుకే అభిమానులు భారీ ఎత్తున తరలి రానున్నారని తెలుస్తోంది. ఇక బాలయ్య బాబు ఈ వేడుకకు రావడం వెనుక.. కల్యాణ్ రామ్ మధ్యవర్తిత్వం బాగా పనిచేసిందని నందమూరి కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. బాబాయ్ ఈ ఫంక్షన్ కి మీరే రావాల్సిందే అంటూ కల్యాణ్ రామ్  పట్టుబట్టారట. ప్రస్తుత ఎన్నికల వేళ బాలయ్య-ఎన్టీఆర్ కలయిక ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. నందమూరి అలయెన్స్ 2019 ఎన్నికల ప్రచారంలో పదునైన వాగ్ధాటితో కత్తి దూస్తుందన్న మాటా వినిపిస్తోంది.