ఈ లుక్ రాదనే తేజ భయపడ్డాడా?

Wed Aug 15 2018 09:25:45 GMT+0530 (IST)

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ - అన్నగారు ఎన్టీఆర్ అసలు సిసలు బ్రాండ్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆయన బ్రాండ్ కాషాయం. ఆయన బ్రాండ్ ఆ మాట విరుపు.. ఆ చేతి తిప్పుడు. ఆయన బ్రాండ్ సూటిగా దూసుకుపోయే సూదంటు చూపు. ప్రగల్భాలు కాదు.. వాక్భాణాలు ఆయన శైలి. అందుకే ఆయన గతించి ఇంతకాలం అయినా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగువారి ఆరాధ్య దైవంగా - శ్రీమహావిష్ణువు ప్రతిరూపంగా కొలువుండిపోయారు.అలాంటి రూపం మళ్లీ ఎవరిలో చూడగలం? ఈ ప్రశ్నకు ఇంతకాలం ఎన్నెన్నో సందేహాలు. కానీ ఆయన దివ్యరూపం ఆయన లేని లోకంలో అభిమానులు చూడగలిగారు. అది కూడా ఎన్టీఆర్ వారసుడు నటసింహా నందమూరి బాలకృష్ణ ఆ వేషం కడితే - కాషాయంలో కనిపించిన అతడిని చూసుకుని అభిమానులు మురిసిపోతున్నారు. అన్నగారే బతికొచ్చారా? అన్నంతగా ఒదిగిపోయి కనిపించారు బాలయ్య. ఈ పోస్టర్కి ముందు అభిమానుల్లో ఎన్నో సందేహాలు. ఎన్టీఆర్ స్ఫురద్రూపం బాలయ్యకు వస్తుందా? ఆయన సూటవుతారా? అంటూ రకరకాల సందేహాలు. ఇదే విషయమై అప్పట్లో స్క్రిప్టు వర్క్ చేసిన తేజలోనూ సందేహాలొచ్చాయని - అందుకే ఆయన ఈ సినిమా తీసేందుకు సందేహించారని ప్రచారం సాగింది. ఆ తర్వాత పరిణామాలేంటో తెలిసిందే.

అయితే క్రిష్ దర్శకత్వ నిర్ధేశనంలో అంతా పక్కాగా సాగుతోందనేందుకు ఇదిగో ఈ కొత్త లుక్ సమాధానం. ప్రస్తుతం దీనిపై తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. స్వాతంత్య్ర దినోత్సవ వేళ అదిరిపోయే కానుకను అందించారని నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు. నిమ్మకూరు నుంచి హైదరాబాద్ - విజయవాడ - అమరావతి రాజధాని వరకూ చర్చ సాగుతోంది. అటు దేశరాజధాని దిల్లీలోనూ ఈ లుక్పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతగా ప్రభావితం చేసిందంటే ఎన్టీఆర్ బయోపిక్ మునుముందు మరెంతగా సంచలనాలు సృష్టిస్తుందోనన్న అంచనాలు పెరిగాయి. మొత్తానికి అన్నగారి రూపంలో బాలయ్య ఇప్పటికి గెలిచాడు. అయితే పెద్దతెరపైనా గెలిచి తీరాలి. అభిమానుల అంచనాల్ని అందుకోవాల్సి ఉంది. సంక్రాంతి కానుకగా 2019 జనవరిలో ఈ సినిమా రిలీజవుతుందన్న సంగతి తెలిసిందే. మరోవైపు వైయస్సార్ బయోపిక్ - ఇందిరా గాందీ బయోపిక్ - బాల్ థాక్రే బయోపిక్ వేడి పెంచుతున్న వేళ `ఎన్టీఆర్` సినిమాతో బయోపిక్ పరంగా అన్నగారి ఆగమనాన్ని ఘనంగానే చాటుకోనున్నారని అర్థమవుతోంది.