టైటిల్ లోనే తేడా కొడుతోందే

Thu Jun 14 2018 15:34:43 GMT+0530 (IST)

హీరో బాలకృష్ణ స్పీడు పెంచాడు. తన తండ్రి... విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవిత గాథను తెరకెక్కించేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాడు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ తీసుకున్నారు. ఇదే టైంలో మరో సినిమా చేసేందుకు కూడా బాలయ్య రెడీ అయ్యాడు. మాస్ చిత్రాల డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.వి.వి.వినాయక్ డైరెక్షన్ లో నటించే సినిమాకు ఎ.కె. 47 టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఎ.కె. 47 అనేది గన్ పేరనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ మూవీ వరకు మాత్రం ఎ.కె. అంటే ఆంధ్రా కింగ్ అని అర్ధమట. ఈ విషయం తెలియగానే అభిమానులు డీలా పడిపోయారు. అసలే ఈమధ్య డైరెక్టర్ వి.వి.వినాయక్ కు హిట్ అన్నదే లేదు. మాస్ కథలనే నమ్ముకుంటూ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీసను ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ తో తీసిన ఇంటిలిజెంట్ సినిమా అయితే డిజాస్టర్ మిగలడమే కాదు..  తేజు కెరీర్ లోనే బ్లాక్ మార్క్ గా మిగిలిపోయింది.

ఇలాంటి టైంలో వి.వి.వినాయక్ తో కమర్షియల్ సినిమా చేయడమే ఓ రకంగా అభిమానులను కలవరపరుస్తోంది. దానికితోడు ఆంధ్రా కింగ్ అంటూ టైటిల్ పెట్టడం మరికాస్త ఇబ్బందికరంగా ఉంటోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన టైంలో ఒక ప్రాంతం పేరుతో టైటిల్ పెట్టడం కూడా అంత సేఫ్ కాదనే మాట వినిపిస్తోంది. మరి బాలయ్య - వినాయక్ ఈ విషయం లెక్కలోకి తీసుకుంటున్నారో.. లేదో?