థాక్రే బయోపిక్ వెనక 'కాషాయ' కుట్ర!

Wed Jan 23 2019 07:00:01 GMT+0530 (IST)

హిందూత్వ నినాదంతో హిందువుల్ని పరిరక్షించేందుకు ఏర్పడిన పార్టీగా శివసేనకు పేరు ఉంది. కాషాయ పార్టీ భాజపాకు దశాబ్ధాల పాటు వెన్నుదన్నుగా నిలిచిన ఈ సోదర పార్టీ కలతల వల్ల ఇటీవల దూరం జరిగిన సంగతి తెలిసిందే. మోదీ సహా కీలక నేతలతో పొసగకపోవడంతో శివసేన వర్గాలు వ్యతిరేకులుగా మారిపోవడం సంచలనమైంది. అయితే ఇన్నాళ్లు ఈ డిస్ట్రబెన్స్ నుంచి బయటపడేసే దారి దొరకలేదు. సంధి మార్గం కనిపించలేదు. ఆ క్రమంలోనే శివసేన అధినాయకుడు బాల్ థాక్రే (బాలా సాహెబ్ థాక్రే)  జీవితకథను వెండితెరకెక్కించిన నిర్మాత సంజయ్ రౌత్ ఇరు వర్గాల్ని ఏకం చేసేందుకు తనవంతు కృషి చేయడం హాట్ టాపిక్ గా మారింది.తాజాగా `థాక్రే` బయోపిక్ ని ప్రధాని నరేంద్ర మోదీ సహా భాజపా నాయకుల కోసం ప్రత్యేకించి ప్రివ్యూ వేసేందుకు శివసేన వర్గాలు రెడీ అవుతున్నాయి. ఈ ప్రివ్యూలో శివసేన నాయకులు ఉంటారు కాబట్టి - ఇరు వర్గాల్ని కలిపేందుకు ఆస్కారం దొరుకుతుందని శివసేన నాయకుడు.. ఎంపీ సంజయ్ రౌత్ భావిస్తున్నారట. నిర్మాత సంజయ్ రౌత్ ఓ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ-``దిల్లీలోని ఎంపీలందరి కోసం ఓ ప్రివ్యూని ఏర్పాటు చేశాం. పీఎం మోదీజీ కూడా ఈ షోకి విచ్చేయాలన్నది మా అజెండా`` అని అన్నారు. అయితే ఈ ప్రివ్యూకి ప్రస్తుత శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే విచ్చేస్తారా.. లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. దానిపై ఇప్పటివరకూ సరైన క్లారిటీ లేదు.

గుజరాత్ అల్లర్ల వేళ శివసేనకు చెందిన మౌత్ పీస్ సామ్న పత్రికలో నరేంద్ర మోదీపై వ్యతిరేక కథనాలు వచ్చాయి. నాటి నుంచి మోదీ- ఉద్ధవ్ మధ్య బంధం చెడింది. ఇరువురూ నువ్వా నేనా? అంటూ కలహించుకుని దూరంగానే ఉంటున్నారు. కాషాయ పార్టీ గోడలు ఊహించని రీతిలో బీటలు వారాయి. అయితే ఈ సన్నివేశం నుంచి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం ఇంతకాలం జరగనేలేదు. అయితే శివసేన నుంచి ఎంపీ సంజయ్ రౌత్ ఆ పాత్రను తీసుకుంటున్నారు. ఇదివరకూ థాక్రే ట్రైలర్ లాంచ్ కి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం వెనక వ్యూహమిదే.

కాషాయ పార్టీలన్నీ ఏకం కావాలి. హిందూత్వను బతికించాలి. బాలా సాహోబ్ థాక్రే నినాదమిదే. పీఎం నరేంద్ర మోదీ నినాదం ఇదే. అందుకే థాక్రే ప్రివ్యూ సందర్భంగా దీనిపై చర్చ సాగాలని కోరుకుంటున్నారట. థాక్రే బయోపిక్ జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ప్రివ్యూకి ఇంకా తేదీని వెన్యూని ఫిక్స్ చేయాల్సి ఉంది. దిల్లీ రాష్ట్రపతి భవన్ లేదా పార్లమెంట్ థియేటర్ లో ఈ ప్రివ్యూని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. మోదీ - ఫడ్నవిస్ - ఉద్ధవ్ థాక్రే తదితరులను కలపడం ద్వారా తిరిగి కాషాయ అలయెన్స్ బలం పుంజుకునేలా చేయాలన్న వ్యూహం నెరవేరుతుందా.. లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. కాషాయ అలయెన్స్ బీటలు వారడం ప్రత్యర్థులకు కలిసొస్తోంది. ప్రస్తుతం ఈ ఉత్పాతం నుంచి కాపాడేందుకు థాక్రే బయోపిక్ సహకరిస్తుందా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది.