Begin typing your search above and press return to search.

బాహుబలి, భజరంగి హోరాహోరీ

By:  Tupaki Desk   |   31 July 2015 6:06 AM GMT
బాహుబలి, భజరంగి హోరాహోరీ
X
ఓ తెలుగు సినిమాతో తాను బాక్సాఫీస్ దగ్గర పోటీ పడాల్సి ఉంటుందని సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ఊహించి ఉండడేమో. ఐతే ‘బాహుబలి’ సినిమా అతణ్ని భయపెట్టే స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. తర్వాతి వారం వచ్చిన ‘భజరంగి భాయిజాన్’కు క్రిటిక్స్ నుంచి జనాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ.. లేకుంటే సల్మాన్ సినిమా బాహుబలి దెబ్బకు కుదేలైపోయి ఉండేదే. ఎవ్వరూ ఊహించని విధంగా భారతీయ బాక్సాఫీస్ తొలి రోజు, తొలి వీకెండ్, తొలి వారం వసూళ్ల రికార్డులను బాహుబలి బద్దలు కొట్టేయడంతో సల్మాన్ కంగారు కంగారుగా తన సినిమా ‘భజరంగి భాయిజాన్’ను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు.

భజరంగి..కి అన్ని వైపుల నుంచి ప్రశంసలు రావడంతో కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి. సల్మాన్ సినిమాల్లో ఇదే హైయెస్ట్ గ్రాసర్ కావచ్చన్న అంచనాలకు తగ్గట్లే సినిమా ప్రభంజనం సృష్టించిన భజరంగి.. బాహుబలి నెలకొల్పిన 3 రికార్డుల్ని అందుకోలేకపోయినా.. ఫుల్ రన్ లో ఆ సినిమాను దాటేయడానికి బాగానే ప్రయత్నిస్తోంది. బాహుబలి ఇప్పటికే రూ.450 కోట్ల మార్కును దాటేసి 500 కోట్ల క్లబ్ లో చేరడానికి ఉరకలు వేస్తుండగా... దాని కంటే వారం వెనక వచ్చిన భజరంగి ఇప్పటికే 450 కోట్ల క్లబ్ లో చేరింది. బాహుబలిని తరుముకొస్తున్న భజరంగి.. 500 కోట్ల క్లబ్ లో చేరుతుందనడంలో సందేహం లేదు. ఇటు బాహుబలి, అటు భజరంగి టార్గెట్ ఒక్కటే. రూ.540 కోట్ల గ్రాస్ వసూళ్లతో పీకే తర్వాత రెండో స్థానంలో ఉన్న ‘ధూమ్-3’ రికార్డును బద్దలు కొట్టాలనే. మరి రెండు సినిమాల్లో ఏది ఆ రికార్డును అందుకుంటుందో చూడాలి.