Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘బాహుబలి: ది కంక్లూజన్’

By:  Tupaki Desk   |   28 April 2017 5:00 PM GMT
మూవీ రివ్యూ: ‘బాహుబలి: ది కంక్లూజన్’
X
చిత్రం : ‘బాహుబలి: ది కంక్లూజన్’

నటీనటులు: ప్రభాస్ - రానా దగ్గుబాటి - అనుష్క - రమ్యకృష్ణ - సత్యరాజ్ - నాజర్ - సుబ్బరాజు - తమన్నా తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్
మాటలు: విజయ్ కుమార్ - అజయ్ కుమార్
ప్రొడక్షన్ డిజైన్: సాబు సిరిల్
వీఎఫెక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్
కథ: విజయేంద్ర ప్రసాద్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి

తెలుగు అని కాదు.. తమిళం అని కాదు.. హిందీ అని కాదు.. దేశంలో ఏ భాషకు చెందిన ప్రేక్షకులైనా సరే.. ఇప్పటిదాకా మరే సినిమాకూ ఎదురు చూడనంతగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ కోసం ఎదురు చూశారంటే అతిశయోక్తి లేదు. ఆకాశాన్నంటే అంచనాలు అన్నా సరే.. ‘బాహుబలి-2’ విషయంలో తక్కువే అయిపోతుందేమో. అంతగా ఉత్కంఠ రేపిందీ సినిమా. ఎట్టకేలకు ఈ ఉత్కంఠకు.. నిరీక్షణకు తెరపడింది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈసారి రాజమౌళి బృందం ఎలాంటి మాయ చేసిందో.. ‘బాహుబలి’ని ఎలా ముగించిందో తెలుసుకుందాం పదండి.

కథ:

కాలకేయులతో యుద్ధంలో విజయానంతరం బాహుబలిని శివగామి మహిష్మతికి రాజుగా ప్రకటించాక.. పట్టాభిషేకానికి గడువు సమీపించేలోపు అమ్మ ఆదేశం మేరకు దేశాటనకు బయల్దేరతాడు బాహుబలి. మరోవైపు సింహాసనం తనకు దక్కలేదన్న అక్కసుతో రగిలిపోతున్న భల్లాలదేవుడు బాహుబలిని ఎలా దెబ్బ తీయాలా అని ఆలోచిస్తుంటాడు. ఇంతలో దేశాటనలో భాగంగా కుంతల రాజ్యానికి వెళ్లిన బాహుబలి.. ఆ దేశ యువరాణి దేవసేనను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. దీనిపై ముందే సమాచారం తెలుసుకున్న భల్లాలదేవుడు.. బాహుబలి-దేవసేన ప్రేమలో ఉన్నారన్న సంగతి తెలియని శివగామి దగ్గర తనకు దేవసేనను ఇచ్చి పెళ్లి చేస్తాననే మాట తీసుకుంటాడు. శివగామి భల్లాలకు ఇచ్చిన మాట కారణంగా.. బాహుబలికి రాజు కావడమా.. లేక దేవసేనను చేపట్టడమా అన్న మీమాంస ఎదురవుతుంది. అప్పుడతను ఏం చేశాడు.. అతడి నిర్ణయం తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అసలు కట్టప్ప బాహుబలిని చంపడం నిజమేనా.. అందుకు దారి తీసిన పరిస్థితులేంటి.. తన నేపథ్యం గురించి తెలుసుకున్నాక శివుడు ఏం చేశాడు.. భల్లాలను బతికుండగానే చితి మీద పడుకోబెట్టి కాల్చాలన్న తన తల్లి కోరికను అతను నెరవేర్చాడా.. అన్న ప్రశ్నలకు తెరమీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

మనసు వెళ్లిన చోటకల్లా మనిషి వెళ్లకూడదు అంటారు. ఐతే సినిమాకు సంబంధించిన ఊహల విషయంలో మాత్రం రాజమౌళి మాత్రం తన మనసు వెళ్లిన ప్రతి చోటికీ తాను వెళ్లిపోవాలనుకుంటాడు. తన ఊహల్లో రూపుదిద్దుకున్న అందమైన.. అసాధారణమైన దృశ్యాలకు వెండితెర రూపం ఇస్తాడు. ప్రేక్షకుడిని అబ్బురపరుస్తాడు. విస్మయానికి గురి చేస్తాడు. నోరెళ్లబెట్టి చూసేలా చేస్తాడు. ‘బాహుబలి: ది బిగినింగ్’లో ఇలా ప్రేక్షకుడికి సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన దృశ్యాలెన్నో. తన ఊహలకు ఆకాశాన్నే హద్దుగా చేసుకుని.. వెండితెరపై కళ్లు చెదిరిపోయే దృశ్యాల్ని ఆవిష్కరించి భారతీయ సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాడు జక్కన్న.

ఐతే ‘ది బిగినింగ్’లో కళ్లు అయితే చెదిరిపోయాయి కానీ.. మనసు మాత్రం నిండలేదన్న భావన ప్రేక్షకులకు కలిగిన మాట వాస్తవం. ముఖ్యంగా పెద్దగా కథంటూ ఏమీ లేకపోవడం.. కథ.. పాత్రలు అసంపూర్ణంగా ముగిసిపోవడం.. బలమైన ఎమోషన్ లేకపోవడం ప్రేక్షకుడిని కొంత నిరాశకు గురి చేశాయి. అయినప్పటికీ అద్భుత దృశ్యాల మాయలో పడి ప్రేక్షకుడు ఈ తప్పిదాల మీద మరీ ఎక్కువ దృష్టిపెట్టలేదు. ఐతే ‘ది కంక్లూజన్’లోనూ అలా పైపైన కథ నడిపించేయడానికి వీల్లేదని రాజమౌళికి తెలుసు. అందుకే ఈసారి కథకు పెద్ద పీట వేశాడు. పాత్రల్ని బలంగా తీర్చిదిద్దుకున్నాడు. ఎమోషన్లు బాగా పండేలా చూసుకున్నాడు. తనదైన శైలి హీరోచిత సన్నివేశాలకూ ఢోకా లేకుండా చూసుకున్నాడు.

కానీ తొలి భాగానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన విజువల్ గ్రాండియర్.. వార్ సీక్వెన్స్ విషయంలో మాత్రం ప్రేక్షకులు పెట్టుకున్న ‘భారీ’ అంచనాల్ని రాజమౌళి అందుకోలేకపోయాడు. ‘ది కంక్లూజన్’ ప్రధానంగా కథ మీద సినిమా నడవడం వల్ల ‘ది బిగినింగ్’ తరహాలో శరవేగంగా సినిమా సాగిపోయిన భావన కలగదు. ఈసారి కథ వల్ల.. పాత్రల వల్ల మనసు నిండినా.. కళ్లు చెదిరిపోయే ఫీలింగ్ అయితే పూర్తి స్థాయిలో కలగదు. ఐతే ఈ ప్రతికూలతల మాటెలా ఉన్నా.. లోపాల గురించి ఎంత చర్చించుకున్నా.. అంతిమంగా ‘బాహుహుబలి: ది కంక్లూజన్’ కూడా తప్పక చూడాల్సిన చిత్రమే. అది అనివార్యం.

‘బాహుబలి: ది బిగినింగ్’ ఎక్కడ ముగిసిందో అక్కడ మొదలయ్యే కథ ‘ది కంక్లూజన్’. ఒక రకంగా చెప్పాలంటే ఒక సినిమా ఇంటర్వెల్ నుంచి కొనసాగుతున్నట్లే. అలాంటపుడు ఇక్కడ కొత్తగా ఇంట్రో సీన్లకు అవకాశం ఉండదనే అనుకుంటాం. హీరోను కొత్తగా పరిచయం చేసేదేముందనే భావిస్తాం. కానీ ఇలాంటి నేపథ్యంలోనూ ఒక కొత్త సినిమాలో హీరోను పరిచయం చేసినట్లుగా బాహుబలిని తెరమీదకు తీసుకురావడం.. రోమాలు నిక్కబొడుచుకునే వీరోచిత విన్యాసంతో.. ప్రేక్షకుల్లో ఒక రకమైన భావోద్వేగం.. ఉత్సాహం కలిగించే రీతిలో తన కథానాయకుడిని పరిచయం చేయడం రాజమౌళికే చెల్లింది. ఆ సన్నివేశంతోనే ‘సాహోరే..’ అనిపిస్తాడు. ప్రేక్షకుల నాడిని జక్కన్న ఎంతగా పట్టేశాడో... హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విద్యను ఎంతగా ఔపాసన పట్టేశాడో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రాజమౌళి బలమంతా ఇక్కడే ఉంది.

హీరోయిజాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లే ఇలాంటి రోమాంచిత దృశ్యాలు ‘ది కంక్లూజన్’లో లోటేమీ లేదు. హీరో తన వాస్తవ రూపాన్ని దాచుకుని.. ఒక సామాన్యుడిలా కనిపిస్తూ.. అవసరమైన సమయంలో ఒక్కసారిగా తన వీరత్వాన్ని చూపిస్తే ప్రేక్షకుడిలో వచ్చే ఎమోషనే వేరు. ఇది ఎన్నిసార్లు వాడినా అరిగిపోని.. తరిగిపోని సక్సెస్ ఫుల్ ఫార్ములా. ఈ అవకాశాన్ని కూడా జక్కన్న వదిలిపెట్టలేదు. కుంతల రాజ్యంలోకి మందబుద్ధి కలవాడిగా ప్రవేశించి.. సందర్భానుసారం తన వీరత్వాన్ని చూపించే సన్నివేశంలో హీరోయిజం వారెవా అనిపిస్తుందంతే. ఇక ‘ది బిగినింగ్’లో విగ్రహం సీన్లో ఎలా అయితే హీరోయిజం పతాక స్థాయికి చేరుకుని.. రోమాలు నిక్కబొడచుకునేలా చేసిందో.. ఇందులోనూ విరామానికి ముంగిట భల్లాలదేవుడి పట్టాభిషేకం జరిగే సమయంలో బాహుబలి నామస్మరణతో హోరెత్తిపోయే సన్నివేశం అంతకుమించి ఎమోషన్ తీసుకొస్తుంది ప్రేక్షకుడిలో. ఇక నిండు సభలో భల్లాల నమ్మినబంటు శిరచ్ఛేదనానికి సంబంధించిన సన్నివేశం కూడా ప్రేక్షకుడిని కుదురుగా కూర్చోనివ్వదు. హీరోయిజాన్ని పండించడంలో రాజమౌళి ప్రత్యేకతను చాటిచెప్పే ఈ ఘట్టాలన్నీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేస్తాయంతే. వీటితోనే సగం కడుపు నిండిపోతుంది.

‘ది కంక్లూజన్’ చూడకముందే తమ ఊహాశక్తితో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానం కనిపెట్టేశారు చాలామంది. ఇక ‘ది కంక్లూజన్’ కథ మొదలైన కాసేపటికే దీనిపై ప్రేక్షకులకూ ఒక అంచనా వచ్చేస్తుంది. ఇందులో బలమైన కథ ఉంది కానీ.. కథలో తర్వాత ఏం జరగబోతోందన్నది ఊహించడం అంత కష్టమేమీ కాదు. అయినప్పటికీ ప్రతి సన్నివేశాన్నీ రక్తికట్టించడంలో రాజమౌళి బృందం విజయవంతమైంది. కథలో.. పాత్రల్లో ఉన్న బలానికి తోడు.. ప్రధాన పాత్రధారులందరూ తమ అత్యుత్తమ ప్రతిభను చాటుకోవడంతో ఎమోషనల్ సీన్లు రక్తికట్టాయి. నేపథ్య సంగీతం కూడా ఈ సన్నివేశాల్ని మరింత ఎలివేట్ చేస్తుంది. ముఖ్యంగా అమరేంద్ర బాహుబలి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దడంతో ప్రేక్షకులు ఆ పాత్రతో ఎమోషనల్ గా బాగా కనెక్టయిపోయి.. దాంతో పాటు ప్రయాణిస్తారు. తెరమీద ఆ పాత్ర కనిపించినంతసేపూ ప్రేక్షకుడి దృష్టి పక్కకు వెళ్లదు. ఆ పాత్రను ముగించిన తీరు.. అనంతరం వచ్చే ఎమోషనల్ సీన్స్ కదిలిస్తాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు... జవాబు ఇచ్చే ఘట్టాన్ని.. దానికి ముందు డ్రామాను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ విషయంలో ప్రేక్షకుడిని బాగానే సమాధాన పరిచాడు రాజమౌళి.

కాకపోతే కట్టప్ప బాహుబలిని చంపే సీన్ తాలూకు ఎపిసోడ్ మాత్రం అంచనాలకు తగ్గట్లుగా లేదు. అసలక్కడ జరిగిందేంటో సరైన వివరణ లేకుండా హడావుడిగా ఈ సన్నివేశాన్ని లాగించేసినట్లు అనిపిస్తుంది. బాహుబలి మరణానంతరం భల్లాలదేవుడి కర్కశతర్వాన్ని చూపించే సీన్ కూడా సరిగా పండలేదు. ఇక రాజమందిరంలో జరిగే కుట్రలు కుతంత్రాలు.. శివగామిని తప్పుదోవ పట్టించే సన్నివేశాలు బిగువుతోనే అనిపిస్తాయి కానీ.. కొంచెం నాటకీయత ఎక్కువైన భావన కలిగిస్తుంది. అంత శక్తిమంతురాలైన.. తెలివైన శివగామి అంత సులువుగా మోసపోవడం.. ఎక్కడా కూడా ఆమె రెండో కోణాన్ని ఆలోచించకపోవడం.. దేవసేన వివిధ సందర్భాల్లో కయ్యానికి కాలు దువ్వేలా ప్రవర్తించే తీరు.. ఆమె పాత్ర చిత్రీకరణ కొంచెం అసహజంగా అనిపిస్తాయి. ఒక దశలో ‘బాహుబలి’ ప్రియులు ప్రధానంగా ఆశించే విజువల్ గ్రాండియర్ ఏమీ లేకుండా ప్రధానంగా కథ మీదే నడవడం వల్ల సినిమా నెమ్మదిగా.. కొంచెం సాగతీతగా సాగుతున్న భావన కూడా కలుగుతుంది.

దీన్నుంచి బయటపడేయడానికి.. ఫ్లాష్ బ్యాక్ ముగిశాక హడావుడిగా రాజమౌళి యుద్ధ సన్నివేశంలోకి దిగిపోయి ప్రేక్షకులు కోరుకునే విజువల్ గ్రాండియర్ అందించే పనిలో పడతాడు. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి.. యుద్ధ సన్నివేశాలు ‘ది బిగినింగ్’ స్థాయిని అందుకోలేకపోయాయి. అమరేంద్ర బాహుబలి మరణంతోనే ప్రేక్షకుల్లో ఒకరకమైన నైరాశ్యం అలుముకోగా.. తనకంటూ ఏ బలం లేని శివుడు నేరుగా కదన రంగంలోకి దిగేయడం సమంజసంగా అనిపించదు. అతడి యుద్ధ వ్యూహాలు.. భల్లాలదేవుడిపై దాడికి దిగే తీరు నమ్మశక్యంగా అనిపించవు. ‘ది బిగినింగ్’లో పతాకస్థాయిలో జరిగే హోరాహోరీ సమరాన్ని చూసి కళ్లు చెదిరిపోయి.. మహేంద్ర బాహుబలి-భల్లాలదేవుడి మధ్య యుద్ధంపై ఎన్నో అంచనాలతో చూసే ప్రేక్షకుల కళ్లకు తెరమీద జరిగేది అంతగా ఆనదు. వేరే ఏ సినిమాతో పోల్చి చూసినా ఇది గొప్పగా అనిపించొచ్చేమో కానీ.. ‘ది బిగినింగ్’ చూసిన కళ్లతో చూస్తే మాత్రం ఇది సంతృప్తి పరచదు. పతాక సన్నివేశంతో పాటు.. కుంతల రాజ్యంలో వచ్చే యుద్ధ సన్నివేశంలోనూ విజువల్ ఎఫెక్ట్స్ విన్యాసాలు అనుకున్న స్థాయిలో కుదరలేదు. వీటిలో సహజత్వం లోపించింది. హంసనావ పాటలో విజువల్ గ్రాండియర్ కోసం ఏదో ప్రయత్నం చేశారు కానీ.. ఆ ఊహ గొప్పగా అనిపిస్తూనే.. మరీ అతిశయోక్తిలా అనిపిస్తుంది. ‘ది కంక్లూజన్’లో కొంత కథను కామెడీతో నడిపించి.. ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయాలని చేసిన ప్రయత్నం అంతగా ఫలించలేదు. ఐతే మామూలు సినిమాల్లో ఇవేవీ కూడా చెప్పుకోదగ్గ లోపాలేమీ కావు. కానీ ‘బాహుబలి: ది బిగినింగ్’తో రాజమౌళి నెలకొల్పిన ప్రమాణాల ప్రకారం చూస్తే వీటి గురించి ప్రస్తావించాల్సిందే. కానీ ఈ లోపాల మాటెలా ఉన్నా.. ప్రేక్షకుల కడుపు నింపే మరెన్నో విశేషాలు.. అద్భుతాలు కూడా ‘బాహుబలి: ది కంక్లూజన్’లో ఉన్నాయి. అందులో మరో మాట లేదు.

నటీనటులు:

ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెబితే సరిపోదు. అతడి నటన.. కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక గొప్ప చక్రవర్తి అంటే ఇలా ఉంటాడేమో అనిపిస్తాడు ప్రభాస్. బాహుబలి గొప్పదనం ఏంటో ‘ది కంక్లూజన్’లో చాలా బాగా చూపించడంతో మరింతగా ఈ పాత్రతో ప్రేమలో పడిపోతాం. తొలి భాగంతో పోలిస్తే ప్రభాస్ మరింతగా ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా అమరేంద్ర బాహుబలిగా అతను ఎమోషనల్ సన్నివేశాల్లో నటించిన తీరు ఎక్కువ మెప్పిస్తుంది. యాక్టింగ్ దగ్గర్నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు అన్ని రకాలుగా అమరేంద్ర బాహుబలి పాత్రలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు ప్రభాస్. ఐతే అక్కడక్కడా కొన్ని చోట్ల అతడి వాయిస్ మాత్రం తేడా కొట్టింది. లుక్ కొన్ని చోట్ల కొంచెం తేడాగా అనిపిస్తుంది.

బాహుబలి తర్వాత కథలో అత్యంత కీలక పాత్ర దేవసేనదే. ఈ పాత్రలో అనుష్క మెప్పించింది. మధ్యలో అనుష్క శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా లుక్ కొంచెం అటు ఇటుగా కనిపించడం ఇబ్బంది పెట్టినా.. నటన పరంగా అనుష్కకు అతి పెద్ద పరీక్షగా నిలిచిన సన్నివేశాల్లో మెప్పించింది. శివగామికి సవాలు విసిరే సన్నివేశాల్లో అనుష్క నటన ఆశ్చర్యపరుస్తుంది. భల్లాలదేవుడిగా రానా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. పతాక సన్నివేశాల్లో అతడి పెర్ఫామెన్స్ చాలా బాగుంది. తల్లి దగ్గర మంచి వాడిగా నటిస్తూనే తన కపటత్వాన్ని చాటుకునే సన్నివేశాల్లో రానా నటన ఆటకట్టుకుంటుంది. ఐతే బాహుబలి చనిపోయాక అతడి శవం ముందు కూర్చుని కర్కశత్వాన్ని ప్రదర్శిస్తూ వీరావేశంతో డైలాగులు చెప్పే సీన్లో మాత్రం రానా నిరాశ పరిచాడు. అతను ఆ డైలాగులు చెప్పిన తీరు ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

కట్టప్పగా సత్యరాజ్ మరోసారి మెప్పించాడు. తొలి భాగంలో లాగే అతడి పాత్ర ప్రేక్షకుల మదిపై బలమైన ముద్ర వేస్తుంది. ఇందులో కట్టప్ప పాత్రతో వినోదం కూడా పండించడానికి చేసిన ప్రయత్నం పెద్దగా సక్సెస్ కాలేదు. నాజర్ యాజ్ యూజువల్ గా అదరగొట్టేశాడు. సత్యరాజ్.. నాజర్ ఇద్దరినీ చూస్తున్నపుడు వాళ్లు నటిస్తున్నారు అన్న అన్న సంగతే మరిచిపోతాం అసలు. అంతగా ఇద్దరూ ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. కుమార వర్మగా సుబ్బరాజుకు మంచి గుర్తింపున్న పాత్రే దక్కింది. అతను ఆకట్టుకున్నాడు. తమన్నాకు ‘ది కంక్లూజన్’లో అసలేమాత్రం పాత్ర లేదు. ఒకట్రెండు షాట్లలో నామమాత్రంగా కనిపిస్తుందంతే. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

కీరవాణి మరోసారి తన నేపథ్య సంగీతంతో ‘బాహుబలి’కి పెద్ద బలంగా నిలిచాడు. ఓవైపు ఎమోషనల్ సీన్స్.. మరో వైపు యుద్ధ సన్నివేశాలు.. మరోవైపు హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్.. అన్నింట్లోనూ కీరవాణి నేపథ్య సంగీతం పతాక స్థాయిలో సాగుతుంది. బాహుబలిని చంపక తప్పదని శివగామి నిర్ణయానికి వచ్చే సన్నివేశంలో వచ్చే నేపథ్య సంగీతం విన్నాక కీరవాణికి హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేం. ఐతే పాటల పరంగా కీరవాణి నుంచి మరింత ఎక్కువగా ఆశిస్తాం. సాహోరే బాహుబలి.. దండాలయ్యా మినహా పాటలు మామూలుగా అనిపిస్తాయి. పాటలు మరింత బాగా ఉండాల్సిందన్న భావన కలుగుతుంది. సెంథిల్ కుమార్ కెమెరా పనితనానికి వంకలు పెట్టలేం. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్.. గ్రాఫిక్స్ తో ముడిపడ్డ సన్నివేశాల్లో సెంథిల్ పాత్ర ఏంటన్నది స్పష్టంగా చెప్పలేం కానీ.. వాటితో సంబంధం లేని సన్నివేశాల్లో సెంథిల్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రపంచ స్థాయికి ఏమాత్రం తగ్గని ఔట్ పుట్ ఇచ్చాడు సెంథిల్. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ కూడా సినిమా స్థాయికి తగ్గట్లుగా సాగింది. రాజ దర్బార్ తో పాటు అనేక సెట్టింగ్స్ కట్టిపడేస్తాయి.

విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మాత్రం ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాల్ని ‘బాహుబలి: ది కంక్లూజన్’ అందుకోలేదనే చెప్పాలి. బాగా లేవు అని చెప్పలేం కానీ.. ‘బాహుబలి: ది బిగినింగ్’ తర్వాత పెట్టుకున్న అంచనాల్ని మాత్రం వీఎఫెక్స్ టీం అందుకోలేకపోయింది. కొంచెం హడావుడిగా పని ముగించేశారేమో అన్న భావన కలుగుతుంది. నిర్మాణ విలువల గురించి.. నిర్మాతల సాహసం గురించి చెప్పేదేముంది? వాళ్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కథకుడు విజయేంద్ర ప్రసాద్ తొలి భాగంలో కంటే ఇందులో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కథ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే సాగినప్పటికీ.. ప్రధాన పాత్రలు.. వాటి మధ్య సంఘర్షణను విజయేంద్ర డీల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అజయ్ కుమార్.. విజయ్ కుమార్ కలిసి రాసిన డైలాగుల్లో నిలకడ లేకపోయింది. కొన్ని చోట్ల మాటలు వారెవా అనిపిస్తాయి. కొన్ని చోట్ల సాదాసీదాగా అనిపిస్తాయి. భాష.. యాస విషయంలో కన్సిస్టెన్సీ లేకపోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్నిచోట్ల ఇప్పటి సినిమాల తరహాలో అనిపిస్తాయి డైలాగులు.

ఇక తొలి భాగంలో కేవలం విజువల్ గ్రాండియర్ తో మాయ చేసేశాడు.. కథను సరిగా చెప్పలేకపోయాడని కొంత మేర విమర్శలెదుర్కొన్న రాజమౌళి.. ఈసారి ఆ విషయం మీదే ఎక్కువ దృష్టిపెట్టాడు. అసలు కథను ఆసక్తికరంగా.. బిగువుతో చెప్పడంలో రాజమౌళి విజయవంతం అయ్యాడు. ఎమోషనల్ డ్రామాను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎప్పట్లాగే హీరో ఎలివేషన్ సీన్స్ లో రాజమౌళి తనకు తానే సాటి అనిపించాడు. విజువలైజేషన్.. ఎగ్జిక్యూషన్ విషయంలో మరోసారి రాజమౌళి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కాకపోతే విజువల్ గ్రాండియర్ విషయంలో ఈసారి రాజమౌళిపై ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాల్ని అతను అందుకోలేకపోయాడు. పతాక సన్నివేశంలో యుద్ధం రాజమౌళి స్థాయికి తగ్గట్లు లేదనే చెప్పాలి. కామెడీ తన కప్ ఆఫ్ టీ కాకపోయినా.. దాని మీద అనవసరంగా దృష్టిపెట్టాడేమో అనిపిస్తుంది. తొలి భాగంతో పోలిస్తే కచ్చితంగా ‘బాహుబలి-2’ కొంత లాగింగ్ గా అనిపిస్తుంది. ఈ విషయంలో రాజమౌళి కొంచెం జాగ్రత్త పడాల్సింది.

చివరగా: సాహోరే.. బాహుబలీ

రేటింగ్: 3.25/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre