Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: బాబు బంగారం

By:  Tupaki Desk   |   12 Aug 2016 9:14 AM GMT
మూవీ రివ్యూ: బాబు బంగారం
X
చిత్రం: ‘బాబు బంగారం’

నటీనటులు: వెంకటేష్ - నయనతార - సంపత్ - పోసాని కృష్ణమురళి - జయప్రకాష్ - పృథ్వీ - బ్రహ్మానందం - వెన్నెల కిషోర్ - షావుకారు జానకి - గిరి తదితరులు
ఛాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్
సంగీతం: జిబ్రాన్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కథ - మాటలు: మారుతి - డార్లింగ్ స్వామి
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మారుతి

కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తూ హీరోయిజం ఉన్న మాస్ క్యారెక్టర్లకు దూరమైపోయాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. మారుతి మాత్రం వెంకీని అభిమానులు కోరుకునే విధంగా చూపించడానికి నడుం బిగించాడు. ఇప్పటిదాకా చిన్న.. మీడియం రేంజి హీరోలతోనే సినిమాలు చేసిన మారుతి తొలిసారి వెంకీ లాంటి స్టార్ హీరోను డైరెక్టర్ చేశాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘బాబు బంగారం’ విడుదలకు ముందు బాగా ఆసక్తి రేకెత్తించింది. అంచనాలు పెంచింది. మరి సినిమా ఆ ఆసక్తిని నిలబెట్టిందా.. అంచనాల్ని అందుకుందా.. చూద్దాం పదండి.

కథ:

ఏసీపీ కృష్ణ (వెంకటేష్)ది చాలా జాలి గుండె. నేరస్థుల్ని చితకబాది.. ఆ తర్వాత వాళ్లకు ట్రీట్మెంట్ చేయించే టైపు. అతను తన లాంటి జాలి మనస్తత్వమే ఉన్న శైలజ (నయనతార)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు తనో ఎన్నారైగా పరిచయం చేసుకుని.. దగ్గరవుతాడు. ఐతే శైలజ తండ్రి ఓ హత్య కేసులో చిక్కుకుని తప్పించుకు తిరుగుతుంటాడు. అతడి కోసం మల్లేష్ యాదవ్ (సంపత్) అనే రౌడీ మనుషులు శైలజ వెంటపడుతుంటారు. ఐతే శైలజ.. కృష్ణను ప్రేమించి అతడికి దగ్గరయ్యే సమయానికి అతను తన తండ్రిని పట్టుకోవడానికే తన వెంట తిరిగాడని తెలుస్తుంది. ఇంతకీ కృష్ణ ప్లాన్ ఏంటి.. శైలజ తండ్రి నిజంగానే హత్య చేశాడా.. కృష్ణ ఆయన్ని పట్టుకున్నాడా.. రౌడీల గుట్టు విప్పాడా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కొత్త కథల కోసం కష్టపడటం కన్నా పాత కథల్ని రీసైకిల్ చేసి ఎంటర్టైనింగ్ గా చెప్పడానికి ప్రాధాన్యమిస్తున్నారు మన యువ దర్శకులు. మారుతి కూడా అదే పని చేశాడు. పాతికేళ్ల కిందటి ‘నిర్ణయం’ కథను అటు ఇటుగా మార్చి.. ‘బాబు బంగారం’ తీశాడు. పోలీసు అయిన హీరో పాత్రధారికి ‘జాలి’ అనే ప్రత్యేక లక్షణాన్ని పెట్టి వినోదాన్ని పండిద్దామని చూశాడు. ఐతే ‘భలే భలే మగాడివోయ్’లో ‘మతిమరుపు’ లాగా ఈ ‘జాలి’ యూఎస్పీ కాలేకపోయింది. ఎంటర్టైన్ చేయలేకపోయింది. పృథ్వీ.. పోసాని లాంటి వాళ్లు కొంత వరకు నవ్వించారు కానీ.. ప్రధానంగా హీరో పాత్ర నుంచి ఆశించిన వినోదం ఇందులో మిస్సయింది. తెలిసిన కథ.. పైగా మామూలుగా సాగిపోయే కథనం.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘నిర్ణయం’ సినిమాకు ‘బాబు బంగారం’ బ్యాడ్ రీమేక్.

మొదట్నుంచి ఎంటర్టైనర్సే తీస్తున్న మారుతికి.. నాని లాంటి కొంచెం రేంజ్.. కామెడీ టైమింగ్ ఉన్న హీరో దొరికితే ఎలాంటి ఔట్ పుట్ వచ్చిందో ‘భలే భలే మగాడివోయ్’లో చూశాం. అలాంటిది కామెడీ పండించడంలో తిరుగులేని వెంకటేష్ లాంటి స్టార్ హీరోను పెట్టుకుని మారుతి ఎంటర్టైన్ చేయడంలో ఫెయిలయ్యాడు. హీరోకు విపరతీమైన జాలి ఉండటం అనేది వినోదం పండించడానికి ఉపయోగపడే మంచి పాయింటే అయినా.. దాన్ని సరిగా వాడుకుని వినోదాత్మకమైన సన్నివేశాలు రాసుకోలేకపోయాడు మారుతి.

రైటింగే అంతంతమాత్రంగా ఉంటే.. ఆ సన్నివేశాల్ని తెరకెక్కించిన తీరు కూడా సాదాసీదాగా అనిపిస్తుంది. హీరో తాను కొట్టిన రౌడీల్ని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించి వారి గురించి బాధపడే తొలి సన్నివేశంలోనే మారుతి డిజప్పాయింట్ చేస్తాడు. అక్కడ అనుకున్నంత స్థాయిలో వినోదం పండలేదు. ఇక అక్కడి నుంచి చివరిదాకా కథనం అప్ అండ్ డౌన్స్ తోనే సాగుతుంది. బత్తాయి కాయల బాబ్జీగా పృథ్వీ ఒక్కడు ప్రథమార్ధాన్ని మోసే ప్రయత్నం చేశాడు. వెంకీ పాత్రను కూడా సరిగా తీర్చిదిద్ది ఉంటే.. ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా ఉండేవి. వెంకీ నుంచి ఎంతో ఆశిస్తాం కానీ.. ఆ పాత్ర చాలాచోట్ల నామమాత్రంగా ఉంటుది. ఇంటర్వెల్ ముందు హీరోయిన్ కు హీరో గురించి నిజం తెలిసే సన్నివేశాన్ని మారుతి పేలవంగా డీల్ చేశాడు. ఈ సన్నివేశంలో వెంకీలో కనిపించే నిస్సహాయత సినిమా పరిస్థితి అద్దం పడుతుంది.

కథ అంతా కూడా ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లు ఉంటే.. కథనం ద్వారా మ్యాజిక్ చేయడంలోనూ మారుతి ఫెయిలయ్యాడు. హీరోయిన్ సమస్యను హీరో టేకప్ చేయాలంటే ఆ ఎమోషన్ ను ముందు ప్రేక్షకుడు ఫీలవ్వాలి. అసలు హీరో హీరోయిన్ల మధ్య బంధం పెరగడానికి సరైన కారణాలే కనిపించవు. ఈ దిశగా బలమైన సన్నివేశం ఒక్కటీ పడలేదు. హీరోయిన్ పాత్రతోనే ఎక్కడా కనెక్టవ్వం. అన్నేసి మర్డర్లు చేసిన విలన్.. హీరోయిన్ విషయంలో అంత తాపీగా ఉండటం లాజికల్ గా అనిపించదు. హీరో-విలన్ మధ్య వచ్చే తొలి సన్నివేశం తేలిపోయింది. అంత క్రూరమైన విలన్ కామెడీ అయిపోయాడు చాలా చోట్ల.

ప్రథమార్ధంలో హీరో పాత్రతో వినోదం పండించే ప్రయత్నంలో విఫలమైన మారుతి.. ద్వితీయార్ధంలో ఈ పాత్రకు అసలైన ‘హీరో’ లక్షణాలు ఆపాదించి యాక్షన్ బాట పట్టించి పర్వాలేదనిపించాడు. ఉన్నంతలో హీరో పాత్ర ఇలా మారాకే బాగుందనిపిస్తుంది. మాస్ ప్రేక్షకులు నచ్చేలా ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు పడ్డాయి. బ్రహ్మానందం పాత్రను.. ఆ ఎపిసోడ్ ను బలవంతంగా ఇరికించినట్లుంది. కథనం సాగతీతగానే ఉన్నప్పటికీ పోసాని పాత్ర అక్కడక్కడా నవ్విస్తూ క్లైమాక్స్ దాకా తీసుకెళ్తుంది. చివర్లో వెంకీ ‘బొబ్బిలి రాజా’ టచ్ తో అభిమానుల్ని అలరించాడు. మొదట్నుంచి కథనం వినోదాత్మకంగా సాగి ఉంటే.. క్లైమాక్స్ పాజిటవ్ గా అనిపించేదేమో కానీ.. చాలా వరకు బోరింగ్ సాగే సన్నివేశాల్ని దాటి అక్కడికొచ్చాక అది కూడా మామూలుగా అనిపిస్తుంది.

నటీనటులు:

వెంకీ చాన్నాళ్ల తర్వాత అభిమానులు మెచ్చేలా కనిపించాడు. ఆహార్యం దగ్గర్నుంచి అన్నీ జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అవకాశం వచ్చినపుడు ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించాడు కానీ.. చాలాచోట్ల ఏమీ చేయలేని నిస్సహాయుడైపోయాడు. నయనతార పాత్ర వృథా అయిపోయింది. నటన పరంగా ఆమె చేయడానికి పెద్దగా ఏమీ లేకపోయింది. పృథ్వీ.. పోసాని తమ కామెడీ టైమింగ్ తో నవ్వించారు. బ్రహ్మానందం ఎంటర్టైన్ చేయలేకపోయాడు. ఆయన పాత్ర తేలిపోయింది. సంపత్.. జయప్రకాష్.. పర్వాలేదు. వెన్నెల కిషోర్.. గిరి ఆరంభంలో పర్వాలేదనిపిస్తారు కానీ.. తర్వాత వాళ్లు కూడా ఉత్సవ విగ్రహాలే అయిపోయారు.

సాంకేతిక వర్గం:

జిబ్రాన్ పాటలు బాగున్నాయి. వెన్నెల వానలా.. బాబు బంగారం పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. హీరో పాత్రకు వాడిన థీమ్ రామ్ గోపాల్ వర్మ సినిమాల్ని గుర్తుకు తెస్తుంది. కొన్నిచోట్ల సన్నివేశాల్లో బలం లేకపోవడంతో అతడి నేపథ్య సంగీతం అతిగా అనిపిస్తుంది. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం ప్లెజెంట్ గా అనిపిస్తుంది. నిర్మాణ విలువల విషయంలో ఏమీ రాజీ పడలేదు. ఇటు రచయితగా.. అటు దర్శకుడిగా మారుతికి ఇది వీక్ ఫిల్మ్. కథ విషయంలోనే అతను తీవ్రంగా నిరాశ పరిచాడు. తన బలం అయిన కామెడీనే అతను సరిగా డీల్ చేయకపోవడంతో సినిమా బోరింగ్ అనిపిస్తుంది. వెంకీని కొన్నిచోట్ల అభిమానులకు నచ్చేలా ప్రెజెంట్ చేయగలిగాడు కానీ.. ఆ పాత్రతో అనుకున్నంత స్థాయిలో వినోదం పండించలేకపోయాడు. ఓవరాల్ గా మారుతి నిరాశ పరిచాడు.

చివరగా: ఈ బాబు ‘బంగారం’ కాదు

రేటింగ్: 2.25/5


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre