Begin typing your search above and press return to search.

వంద‌కోట్ల క్ల‌బ్‌ పై `బాహుబ‌లి` గురి!

By:  Tupaki Desk   |   28 July 2015 4:59 AM GMT
వంద‌కోట్ల క్ల‌బ్‌ పై `బాహుబ‌లి` గురి!
X
ఒక డ‌బ్బింగ్ సినిమా హిందీలో వంద కోట్లు చేస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు. కానీ ఆ ఊహ‌ల‌కు, అంచ‌నాల‌కు అంద‌ని రీతిలో `బాహుబ‌లి` విజ‌య ఢంకా మోగించింది. స‌ల్మాన్‌ఖాన్‌లాంటి ఓ స్టార్ హీరో సినిమా వ‌చ్చినా స‌రే... `బాహుబ‌లి` తొణ‌క‌లేదు. బెణ‌క‌లేదు. బాక్సాఫీసు ద‌గ్గ‌ర విజృంభిస్తూనే ఉంది. రోజూ రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే రూః 90కోట్లకి చేరువలో ఉంది. ఇంకో వారం పాటు ఇదే ఊపుతో ఆడితే వంద కోట్ల క్ల‌బ్‌ లోకి బాహుబ‌లి చేర‌డం ఖాయం అని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. `బాహుబ‌లి` హిందీలో వంద కోట్లు వ‌సూలు చేస్తే మాత్రం ఒక సంచ‌ల‌న‌మైన రికార్డుగా న‌మోద‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు.

బాహుబ‌లి విడుద‌లైన వారం రోజుల‌కే `భ‌జ‌రంగీ భాయ్‌ జాన్‌` వ‌చ్చింది. అప్ప‌టికి బాహుబ‌లి గురించి ఇంకా హిందీ ప్రేక్ష‌కుల‌కు పూర్తిగా తెలియ‌దు. దీంతో అంతా `భ‌జ‌రంగీ భాయ్‌ జాన్‌` కోసం ఎదురు చూశారు. ఆ చిత్రం చూశాక ``బాహుబ‌లి` గురించి కూడా చాలా చెబుతున్నారు క‌దా? చూద్దాం`` అంటూ వెంట‌నే ఆ సినిమాకి వెళ్లిపోతున్నారు. దీంతో బాహుబ‌లికి వ‌సూళ్లు స్టడీ గా ఉన్నాయి.

మ‌రోప‌క్క ప్ర‌భాస్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో పాటు, ఇత‌ర రాజ‌కీయ నేత‌ల‌నీ, బాలీవుడ్ హీరోల్ని క‌లుస్తుండ‌టంతో సినిమాకి మ‌రింత ప్ర‌చారం ల‌భిస్తోంది. మోడీ కూడా ట్వీట్ చేశాడంటే సినిమాలో ఏదో ఉందంటూ ఉత్త‌రాది ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్లిపోతున్నారు. ఒక‌వేళ భ‌జ‌రంగీ భాయ్‌ జాన్ విడుదల కాక‌పోయుంటే మాత్రం బాహుబ‌లి ఇంకెన్ని సంచ‌ల‌నాలు సృష్టించేదో మ‌రి! హిందీలో శాటిలైట్ రైట్స్‌ తో లెక్కేస్తే ఇప్ప‌టికే బాహుబ‌లి వంద కోట్ల క్ల‌బ్‌ లోకి చేరిపోయిన‌ట్టే. కానీ బాక్సాఫీసు నుంచే ఆ మొత్తం వ‌చ్చేలా క‌నిపిస్తుండ‌డం విశేషం.