Begin typing your search above and press return to search.

ఆ విషయంలో బాహుబలిని కొట్టేవాడే లేడు

By:  Tupaki Desk   |   26 July 2015 10:14 AM GMT
ఆ విషయంలో బాహుబలిని కొట్టేవాడే లేడు
X
బాహుబలి ఓ ప్రాంతీయ భాషా చిత్రం. అయినప్పటికీ నేషనల్ లెవెల్లో ప్రభంజనం సృష్టించింది. బాలీవుడ్ రికార్డుల్ని కూడా బద్దలు కొట్టింది. తొలి రోజు, తొలి వీకెండ్, తొలి వారం వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించింది. ఐతే ఓవరాల్ కలెక్షన్ల విషయంలో మాత్రం బాహుబలి కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు లేనట్లే. పీకే సినిమా ఏకంగా రూ.730 కోట్ల గ్రాస్ వసూళ్లతో అగ్రస్థానంలో ఉంటే.. ధూమ్-3 రూ.540 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం బాహుబలి 400 కోట్లు దాటేసి 500 కోట్ల మార్కు దిశగా వెళ్తోంది. ఐతే ఫుల్ రన్ లో రూ.500 కోట్లు దాటి అంతకంటే ముందుకు వెళ్లే అవకాశాలు లేనట్లే. కాబట్టి మూడో స్థానానికి ఫిక్సవక తప్పదేమో. అతి కష్టం మీద రెండో స్థానానికి చేరితే చేరొచ్చు.

ఐతే ఓవరాల్ కలెక్షన్ల విషయంలో బాహుబలి రికార్డు నెలకొల్పలేకపోవచ్చు కానీ.. బయ్యర్లకు అత్యధిక లాభాలు సాధించి పెట్టిన సినిమాగా మాత్రం బాహుబలి చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. బాహుబలి హిందీ వెర్షన్ సంగతే తీసుకుంటే కరణ్ జోహార్ కు హక్కులు అమ్మింది రూ.20-25 కోట్ల మధ్యేనని సమాచారం. ఐతే గ్రాస్ వసూళ్లు రూ.100 కోట్ల మార్కును అందుకుంటున్నాయి. షేర్ మాత్రమే రూ.60 కోట్లదాకా వచ్చే అవకాశముంది. ఇక తెలుగు వెర్షన్ విషయంలోనూ బాహుబలి మీద పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యక్తీ భారీగా లాభాలు చూస్తున్నాడు. ఓవర్సీస్ లో షేర్ మాత్రమే పెట్టుబడికి మూడు రెట్లపైనే వసూలవుతోంది. కర్ణాటకలో అయితే ఇప్పటికే పెట్టుబడి మీద నాలుగు రెట్ల షేర్ వచ్చింది. తమిళనాట కూడా పెట్టుబడికి డబుల్ వసూలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బయ్యర్లందరరూ లాభాల బాటలో ఉన్నారు. మొత్తంగా చూస్తే బాహుబలి థియేట్రికల్ బిజినెస్ కు రెట్టింపు షేర్, మూడు రెట్ల గ్రాస్ వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే ఏ పెద్ద హిందీ సినిమా కూడా ‘బాహుబలి’ రికార్డుకు దగ్గర్లో కూడా ఉండదేమో.