Begin typing your search above and press return to search.

బాహుబలి కి 23 నిమిషాలు కోత

By:  Tupaki Desk   |   31 Aug 2015 6:46 AM GMT
బాహుబలి కి 23 నిమిషాలు కోత
X
బాహుబలి రిలీజై యాభై రోజులు దాటిపోయింది. అక్కడక్కడా మాత్రమే ఆడుతోంది. దేశవ్యాప్తంగా బాహుబలి కథ దాదాపుగా ముగిసినట్లే. ఇప్పుడు సినిమాకు 23 నిమిషాలు కోత వేయడం ఏమిటి.. అయినా సినిమా లెంగ్త్ గురించి ఎవరూ కంప్లయింట్ లే చేయకున్నా కోత వేయాల్సిన అవసరం ఏమొచ్చింది.. ఇంతకీ సినిమా నుంచి ఏం తీసేస్తున్నారు.. అనుకుంటున్నారా? ఈ కోత నిజమే కానీ.. అది మన ప్రేక్షకుల కోసం కాదండోయ్. ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం. బాహుబలి రిలీజైనపుడే ఆ సినిమాను కొన్ని రోజుల తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ లో రిలీజ్ చేస్తామని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ వెర్షన్ ఎడిటింగ్ కోసం ప్రఖ్యాత హాలీవుడ్ ఎడిటర్ విన్సెంట్ తబైలాన్ ను నియమించుకున్నారు కూడా.

విన్సెంట్ నెల క్రితమే ‘బాహుబలి’ని ఎడిట్ చేసే పనిలో పడ్డాడు. రాజమౌళి ఇన్ పుట్స్ తీసుకుని.. నిర్మాతలు శోభు, ప్రసాద్ ల సహకారంతో సినిమాను ఎడిట్ చేశాడు. కొన్ని పాటలు, మరికొన్ని సన్నివేశాల్ని ఎడిట్ చేశాక సినిమా నిడివి 23 నిమిషాలు తగ్గి 2 గంటల 16 నిమిషాలైంది. ప్రస్తుతం బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి పంపుతోంది కూడా ఎడిటెడ్ వెర్షనే. అక్కడి ప్రేక్షకుల స్పందన చూశాక.. అంతా ఓకే అనుకుంటే ఆ వెర్షన్ నే అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేస్తారు. సెప్టెంబరు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ‘బాహుబలి’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చైనాలో దాదాపు 4 వేల థియేటర్లలో ‘బాహుబలి’ ప్రదర్శితం కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే బాహుబలి రూ.600 కోట్ల దాకా వసూలు చేసింది. ఇంటర్నేషనల్ కలెక్షన్స్ కూడా కలిపితే రూ.800 కోట్ల మార్కును అందుకున్నా అందుకుంటుందేమో.